దేశంలో ఇంటి అద్దె చట్టం.

337

ఇళ్ల, స్థలాల గొడవలను పరిష్కరించే ఉద్దేశంతో తీసుకొచ్చిన మోడల్ అద్దె చట్టానికి (మోడల్‌ టెనెన్సీ యాక్ట్‌-ఎంటీఏ) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. మోడల్ అద్దె చట్టానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు అనుగుణంగా కొత్త అద్దె చట్టాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది.లేదంటే ఇప్పటికే ఉన్న చట్టాలను దీనిలోని నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు.తాజా చట్టం వల్ల దేశవ్యాప్తంగా ఇంటి అద్దెలకు సంబంధించిన న్యాయ నిబంధనలను మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈఅద్దె చట్టం ముసాయి దాను కేంద్ర ప్రభుత్వం 2019లోనే వెలువరించింది.

గృహ రంగాన్ని సుస్థిరంగా, సమ్మిళితంగా మార్చడం, అన్ని ఆదాయ వర్గాల వారికీ అద్దె ఇళ్లను అందుబాటులో ఉంచి కొరతను తీర్చడం దీని ముఖ్యోద్దేశం.అద్దె ఇళ్ల రంగాన్ని వ్యవస్థీకృతంగా మార్చి క్రమంగా అది సంఘటిత మార్కెట్‌గా రూపాంతరం చెందడానికీ దోహదపడుతుంది.   ఇళ్లను అద్దెకు ఇవ్వాలని చూస్తున్న వారికి అవకాశాలను కలిగిస్తుంది.

ప్రస్తుతం దేశంలో 1.1 కోట్ల ఖాళీ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త చట్టంతో షాడో మార్కెట్‌ మాయమై అధీకృత వ్యవస్థ మనుగడలోకి వస్తుంది. దీనివల్ల అద్దెల ద్వారా ఆదాయం పెరగడం, దోపిడీ తగ్గడం,రిజిస్ట్రేషన్‌ నిబంధనల భారం తొలగిపోవడం వంటి సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయని కేంద్రం తెలిపింది. పారదర్శకత,క్రమశిక్షణ, పెట్టబడిదారుల్లో విశ్వాసం,సేవల నాణ్యత పెరుగుతాయని కూడా పేర్కొంది.

తాజా చట్టం ప్రకారం లిఖితపూర్వక ఒప్పందం లేకుండా ఇళ్లు,వ్యాపార సముదాయాలను అద్దెకివ్వడం కుదరదు. ఇంటిని అద్దెకు తీసుకునేవారు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్‌పై పరిమితి ఉంటుంది. నివాస గృహసముదాయం అయితే గరిష్ఠంగా రెండు నెలలు,నివాసేతర సముదాయం అయితే గరిష్ఠంగా ఆరు నెలల అద్దెను ముందుగా తీసుకోవాలి. ప్రస్తుతం ఒక్కో చోట ఒక్కోలా దీనిని వసూలు చేస్తున్నారు.
ఢిల్లీలో నివాస గృహాలకు కనీసం మూడు నెలలు, బెంగుళూరులో పది నెలల అద్దె ముందుగా వసూలు చేస్తున్నారు. అద్దె ఎంత ఉండాలి? ఎంతకాలం పాటు అద్దెకు తీసుకోవాలనేదానిపై పరిమితులు ఏమీ లేవు. అద్దెదారు,యజమాని పరస్పర అవగాహనతో ఒప్పందం చేసుకోవచ్చు. దీనివల్ల యజమానులకు భరోసా వస్తుంది.

ఒప్పందంలో నిబంధనలను అనుసరించి.. యజమాని తన ఇంటిని ఖాళీ చేయాలని అద్దెదారుకి ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఒప్పంద గడువు ముగిసిన తర్వాత, కాంట్రాక్ట్‌ రద్దు చేసుకున్న తర్వాత కూడా కిరాయిదారు ఖాళీ చేయకపోతే, తొలి రెండు నెలలు రెట్టింపు అద్దె, ఆ తర్వాత నాలుగు రెట్ల అద్దె వసూలు చేయడానికి యజమానికి అధికారం దక్కుతుంది.

యజమాని/ఆస్తి నిర్వాహకుడు తాను అద్దెకిచ్చిన ప్రాంగణంలోకి 24 గంటల ముందస్తు నోటీసు ఇచ్చి ప్రవేశించవచ్చు.  నోటీసు లిఖిత పూర్వకంగాకానీ, ఎలక్ట్రానిక్‌ మోడ్‌లోగానీ పంపవచ్చు. ‘రెంట్‌ అథారిటీ’ ఏర్పాటవుతుంది.  జిల్లా స్థాయిలోనూ ఇలాంటివి ఉంటాయి. అద్దెలను నియంత్రించడం ద్వారా యజమానులు, అద్దెదారుల ప్రయోజనాలను రక్షించడానికి వీలవుతుంది.

ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదాలను వేగంగా పరిష్కరించే యంత్రాంగం అమల్లోకి వస్తుంది. వివాదాల పరిష్కారం కోసం రెంట్‌ ట్రైబ్యునళ్లు, రెంట్‌ కోర్టులు ఏర్పాటు చేయొచ్చు. వాటిలో వివాదాలను వేగవంతంగా పరిష్కరిస్తారు. అద్దెను ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పెంచడం లేదంటే మూడు నెలల ముందస్తు నోటీసు ఇచ్చిన తర్వాతే పెంచాల్సి ఉంటుంది. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాలు.. రెండింటికీ వర్తిస్తుంది.

యజమాని నుంచి లిఖితపూర్వక సమ్మతి లేకుండానే అద్దెకున్న భవనంలో నిర్మాణ పరంగా మార్పులు చేయడానికి వీల్లేదు. అద్దెదారుల వల్ల ఏవైనా వస్తువులు పాడయితే వారే భరించాలి. నూతన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త అద్దెదారులు లిఖితపూర్వక ఒప్పందం చేసుకొని, ఆ పత్రాన్ని రెంట్‌ అథారిటీకి సమర్పించాలి.ఒప్పంద పత్రాలు సమర్పించడానికి స్థానిక భాషల్లో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఏర్పాటు చేస్తారు. భూస్వామి, అద్దెదారు ప్రయోజనాల మధ్య సమతౌల్యం ఉంటుంది.యజమాని, అద్దెదారు పాత్రలకు స్పష్టమైన నిర్వచనం ఇవ్వడంవల్ల అనవసర వివాదాలు తప్పుతాయి.

                                                                                              –  పవర్ ఆఫ్ ఆర్టీఐ