శ్రీరామదూతం……

421

శిరసాం నమామి
( శిరసనగండ్ల సత్యనారాయణ శర్మ, గుంటూరు)

“నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేధారిణః నా సామవేద విదుషః శక్య మేవం ప్రభాషితుమ్? సూరం వ్యాకరణం కృత్స్నమ్ అనేన బహుధా శ్రుతం బహు వ్యాహరతా నేన న కించిదపశబ్దితమ్ నముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్వసి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్ ”
అని రామచంద్రమూర్తి వారు లక్ష్మణుడితో చెప్పిన మాటలివి.
సోదరా లక్ష్మణా! ఋగ్వేదంలో మహాపండితుడు కాకపోతే, యజుర్వేదాన్ని ఆపోశన పట్టి ఉండకపోతే, సామవేదంలో దిట్టకాకపోతే ఇంత స్పష్టంగా, జనులందరికీ ఇంకా ఇంకా వినాలని అనిపించేలా, మృదుమధుర కంఠ స్వరంతో ఇలా పలకగలగడం అసాధ్యం. అలాగే ఇంతసేపు మనతో మాట్లాడుతున్న ఇతను పలికిన ఏ ఒక్క పలుకులోనూ ఎక్కడా ఒక్క అపశబ్ధమన్నది లేనేలేదు.. నోటి నుంచి వస్తున్న మాటల్లో ఎక్కడా వెటకారమన్నది కనపడటం లేదు. అలాగే మనతో మాట్లాడుతున్న వేళ ఎంతో పద్ధతి కనపడుతోంది. ముఖం తిప్పడం, కళ్లుఆర్పడం వంటివేవి ఇతనిలో కనపడటం లేదని లక్ష్మణుడితో రామచంద్రమూర్తి వారు చెప్పిన మాటలవి.
ఋష్యమూక పర్వతం మీద ప్రాణభీతితో జీవనం సాగిస్తున్న సుగ్రీవుడు తమ వద్దకు వస్తున్న రామలక్ష్మణుల నిజ రూపాన్ని తెలుసుకునేందుకు భిక్షుక (సన్యాసి) రూపంలో వెళ్లమని ఆంజనేయుడిని పంపారు.
అయితే సన్యాసికి ఉండవల్సిన ప్రధాన లక్షణాల్లో ఒకటి మౌనం. దానిని ఎవరైనా భంగపరిస్తే వచ్చే అసహనం సహజంగానే సన్యాసికి ఉంటుంది. అలాంటి లక్షణాలేవి తమని ప్రశ్నిస్తున్న ఆంజనేయుడిలో లేకపోవడాన్ని రామలక్ష్మణులు గమనించారు. వచ్చిన వాడు అసలు సన్యాసే కాదనీ గుర్తించారు.
‘ఏష దత్వాచ విత్తాని ప్రాప్య చానుత్తమం యశః లోకనాథః పురా భూత్వా సుగ్రీవం నాథ మిచ్చతి పితా హ్యస్యపురా హ్యాసీ చ్చరణ్యో ధర్మవత్సలః తస్య పుత్ర శ్శరణ్య శ్చ సుగ్రీవం శరణం గతః సర్వలోకస్య ధర్మాత్మా శరణ్య శ్శరణం పురా గరుర్మే రాఘవ స్సోయం సుగ్రీవం శరణం గతః”
..అంటూ హనుమతో చెప్పారట లక్ష్మణు స్వామి.. ‘ఇతను పూర్వం నానా విధములు దానములు చేసిన వాడు.. గొప్ప కీర్తి గడించిన వాడు.. ఇతని తండ్రి మంచి ధర్మవత్సలుడు. ఆయన శరణార్థులను రక్షించే వాడని ప్రతీతి.. ఒకప్పుడు లోకనాథుడిగా కీర్తి గడించిన వారు ఆయన.. నేడు సుగ్రీవుడి శరణాగతిని కోరడానికి వచ్చాడని’ సెలవిచ్చారు.
అసలు పుట్టుకతోనే అందరి దేవతల శక్తులు పొందారు స్వామి హనుమ. వాళ్ళే స్వయంగా ఓ  ఆశ్రమంలో చేర్పిస్తే అక్కడ హోమద్రవ్యాలను పాడు చేయడం, ఆరవేసిన వస్త్రాలను చింపేయడం చేస్తుంటే మునులు ఈ పిల్లవాడికి ఇంత బలం ఇప్పుడవసరం లేదని గ్రహించారు. రామావతారం.. అరణ్యకాండ వస్తే కాని ఉపయోగం ఉండదని భావన చేశారు. పెద్దవాడు అయ్యేవరకు అక్కర్లేని బలం అవసరం లేదని.. అలా ఎవరైనా మహర్షి గుర్తుచేస్తే వచ్చేటట్టుగా మునులంతా అనుగ్రహించారు.
తదనంతర కాలంలో హనుమ ఋష్యశృంగ పర్వతం చేరి సుగ్రీవుడి వద్ద అమాత్యుడిగా కొలువుదీరారు. సోదరుడి వైరంతో పారిపోయి భూమండలం అంతా తిరుగుతున్న సుగ్రీవుడు అలసిపోయి చివరకు హనుమతో ‘ఇక పరిగెత్తలేను.. దాక్కోవడానికి చోటు ఎక్కడయినా ఉందా? అని అడిగితే… ‘ఎందుకు లేదు! ఋష్యమూక పర్వతానికి వాలి రాలేడని.. అతనికి శాపం ఉన్నదని’ సెలవిచ్చారు హనుమ. ‘మరి ఈమాట ముందు ఎందుకు చెప్పలేదు’ అని సుగ్రీవుడు అడిగితే, ‘మీరు అడగ లేదు.. నేను చెప్పలేదు’ అన్నారు వినమ్రంగా, అసలు రామలక్ష్మణులు ఋష్యమూకానికి వస్తున్న వేళ భయపడిపోయి సుగ్రీవుడు పారిపోతుంటే ‘ఎందుకు పరిగెడుతున్నారంటూ’  వెళ్లి పట్టుకుని ప్రశ్నించారు హనుమ. “ఎవరో ఇద్దరు నరులు ఇటుగా వస్తున్నారు చూడు.. బహుశా వాలి పంపి ఉంటాడు వారిని’ అని సుగ్రీవుడు చెబితే,  ‘ఇంత పిరికివాడివి.. రేపు రాజ్యం వస్తే ఎలా పరిపాలన చేస్తావు? నీవు రాజువని నేను నిన్ను సేవిస్తున్నాను.. యిలా ఉంటే ఎలా?” అంటూ హనుమ వారించారు. ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా తెలుసున్నవాడు హనుమ. ఆయన చెప్పాడు కాబట్టి సుగ్రీవుడు నిగ్రహించాడు. ‘ఆ వస్తున్న ఇద్దరూ ఎంత తేజోమయంగా ఉన్నారో గమనించమని, పాదుకులు కూడా లేకుండా వస్తున్న విషయాన్ని పరిశీలన చేయమని’ హనుమ సూచన చేశారు సుగ్రీవుడికి, సరే, వచ్చిన వారెవరో తెలుసుకురమ్మని.. ఇలా వెడితే గుర్తుపడతారు కాబట్టి లోకమంతా పూజించే సన్యాసి రూపంలో వెళ్లమని హనుమను ఆజ్ఞాపించారు సుగ్రీవుడు. లోకంలో ఎంత మహాపండితుడైనా ఎదురుగా కాషాయ వస్త్రం, చేతిలో కమండలం, దండం ధరించిన ఉన్న వ్యక్తి కనపడితే సాష్టాంగ నమస్కారం చేయడం ఆనవాయితీ.
 అయితే ఇక్కడ సన్యాసి రూపంలో ఉన్న హనుమ రామలక్ష్మణులను చూడగానే వారి కాళ్లమీద పడి “అయ్యా మీ ఇద్దరినీ చూస్తూ ఉంటే దివ్యంగా కనపడుతున్నారు… మీ ఇద్దరి కన్నులు పద్మపత్రాల్లా ఉన్నాయి… దేవలోకం నుంచి వచ్చారా? మీ కన్నుల్లో రక్షించే తేజస్సు నాకు స్పష్టంగా కనిపిస్తోంది.. మంచి ఆభరణాలతో అలరారిన మీ భుజాలు ఇవాళ నిర్జీవంగా కనిపిస్తున్నాయి.. చాలా శ్రీమంతులుగా కనిపిస్తున్నారంటూ..” .. ఎన్నో విశేషాలతో మాట్లాడారు. రామలక్ష్మణులతో స్వామి హనుమ. ఆ తరువాత తన భుజాలపై వారిద్దరినీ కూర్చోబెట్టుకొని పర్వతం మీదకు తీసుకువెళ్లారు. ఇలా ఎన్నో విశేషాలమయం ఆంజనేయ స్వామి అవతారం.

( సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్)