బరిలో ఈటల భార్య జమున?

842

రాజకీయ భవిష్యత్తు కోసమే ఈటల నిర్ణయం
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్థయించుకున్నట్లు తెలుస్తోంది.  ఆయన ఈ నెల 8న బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని   ఈటల అనుచరులు చెబుతున్నారు. అయితే రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికలో,  తన బదులు భార్య జమునారెడ్డిని బరిలోకి దింపాలని ఈటల వ్యూహాత్మక  నిర్ణయం తీసుకున్నట్లు  సమాచారం.

మరో మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లోగా ఈటల తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేక ంగా గళం విప్పడంతోపాటు, ప్రధానంగా బీసీ వర్గాలను బీజేపీ వైపు ఆకర్షించే కార్యక్రమాలు నిర్వహిస్తారని చెబుతున్నారు.

ఉప ఎన్నికకు దూరంగా ఉండాలన్న ఈటల నిర్ణయం వెనుక, సుదూర రాజకీయ వ్యూహం లేకపోలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ‘ఎన్నికలో గెలిస్తే ఫర్వాలేదు. అదే ఒకవేళ ఓడిపోతే ఇక ఈటల రాజకీయ భవిష్యత్తు, మనుగడ, బీజేపీలో ఉనికి ప్రశ్నార్ధకమవుతాయి. అందుకే అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతనే వచ్చే ఎన్నికలో పోటీ చేయకుండా, భార్య జమునారెడ్డిని బరిలోకి దింపాలని  నిర్ణయించుకున్నట్లు ఈటల వర్గీయుడొకరు వెల్లడించారు. పైగా ఈటల భార్య బరిలో ఉంటే,  కేసీఆర్ హుజూరాబాద్‌పై ఈటల స్థాయిలో దృష్టి సారించకపోవచ్చని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు. ఈటల నేరుగా బరిలో ఉన్నదానికీ, ఆయన భార్య బరిలో ఉన్న దానికీ తీవ్రతలో తేడా ఉంటుందని అంటున్నారు. ఇన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈటల,  తన భార్యను బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

  ఈ కారణంతోనే ఆమెను  ముందస్తుగా మీడియాతో మాట్లాడిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆమె నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్‌పై ధ్వజమెత్తడంతోపాటు, తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామన్న సంకేతం పంపించారు. ఈటల మంత్రి, ఎమ్మెల్యేగా ఉన్నంతవరకూ భార్య జమునారెడ్డి ఎప్పుడూ మీడియాముందుకు రాకపోవడం గమనార్హం. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులపై పోలీసులు పెట్టిన కేసులకు అడ్వకేట్ల ఫీజులు,  బెయిల్ , ష్యూరిటీలకు సంబంధించిన ఆర్ధిక అంశాలన్నీ జమునారెడ్డి సమన్వయం చేసేవారని ఈటల వర్గీయులు చెబుతున్నారు.