మళ్లీ రక్షణ శాఖకు టీటీడీ ధర్మారెడ్డి?

996

ఎంపీ రాజు ఫిర్యాదు ఫలితం
కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలతోనే అమ్మిరెడ్డి బదిలీ
( మార్తి సుబ్రహ్మణ్యం- అమరావతి)

టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డిని కేంద్ర రక్షణ శాఖ తిరిగి వెనక్కి పిలిపించబోతోందా? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జరుగుతున్న హాట్ టాపిక్ ఇది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తనను త్వరగా డిశ్చార్జి చేయించి, తర్వాత అక్కడి నుంచి తిరిగి గుంటూరుకు తీసుకువెళ్లే కుట్రలో, ధర్మారెడ్డి కూడా భాగస్వామిగా ఉన్నారంటూ నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి చేసిన ఫిర్యాదుపై,  రక్షణాఖ అధికారులు చర్యలకు నడుంబిగించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ధర్మారెడ్డిని, తిరిగి తన మాతృశాఖ అయిన డిఫెన్స్ సర్వీసుకు పిలిపించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది.

కేంద్ర రక్షణ శాఖ అధికారి అయిన ధర్మారెడ్డిని  డెప్యుటేషన్‌పై ఏపికి పంపించాలన్న  ప్రభుత్వ వినతి మేరకు, కేంద్రరక్షణ శాఖ ఆయన డెప్యుటేషన్‌కు అంగీకరించింది. వైఎస్ హయాంలో కూడా ఇదే విధంగా ధర్మారెడ్డి డెప్యెటేషన్‌పై ఏపీకి వ చ్చిన విషయం తెలిసిందే. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనను టీటీడీ అడిషనల్ ఈఓగా నియమించింది. నిజానికి ధర్మారెడ్డిని తొలుత జెఈఓగా నియమించాలన్న ప్రయత్నం వైఎస్ హయాం నుంచే మొదలయినా, ఆయన ఆలిండియా సర్వీసుకు చెందకపోవడంతో స్పెషలాఫసర్‌గానే కొనసాగించవలసి వస్తోంది. ఇప్పుడు టీటీడీ ఈఓ జవహర్‌రెడ్డికి కోవిడ్ విభాగం అప్పగించిన నేపథ్యంలో, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ధర్మారెడ్డిని.. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు కారణంగా  తిరిగి మాతృశాఖకు పిలిపించే అవకాశాలున్నట్లు  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఢిల్లీ వెళ్లిన ఎంపి రఘురామకృష్ణంరాజును కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ పరామర్శించిన సందర్భంలో గుంటూరు సీఐడీ కార్యాలయంలో రాత్రి తనను ఐదుగురు ముసుగుధరించిన వ్యక్తులు కొట్టారని, అందులో ఒక అత్యున్నత అధికారి కూడా ఉన్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తనను సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్సకు తీసుకువచ్చిన తర్వాత కూడా గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఇచ్చిన నివేదికనే బలపరచాలన్న ఒత్తిళ్లు వచ్చాయని రాజు వివరించినట్లు తెలిసింది. ఆ సందర్భంలో మిలటరీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కెపి రెడ్డి చాలామందికి ఫోన్లు చేశారని, ఆ కాల్‌లిస్ట్‌పై విచారణ జరిపితే తనపై జరిగిన కుట్ర వివరాలు వెల్లడవుతాయని రాజు అభ్యర్ధించారు.

అయితే, తనను సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి నుంచి త్వరగా డిశ్చార్జి చేసి, తిరిగి పోలీసులతో గుంటూరుకు పంపించే వ్యవహారంలో టీటీడీ అధికారి ధర్మారెడ్డి, మిలటరీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కెపి రెడ్డితో మంతనాలు జరిపేందుకు, మే 18న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వచ్చారంటూ, ధర్మారెడ్డి ప్రయాణానికి సంబంధించిన ఆధారాలు కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సమర్పించారు.  ఎస్పీ అమ్మిరెడ్డితో కలసి తనపై కుట్ర చేసిన కేంద్ర రక్షణ శాఖకు చెందిన ధర్మారెడ్డి, కెపిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎంపి రాజు రక్షణశాఖ మంత్రికి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి స్పందించిన  రక్షణశాఖ మంత్రి  ఆ ఘటనపై విచారణకు ఆదేశించారు. అందులో భాగంగానే టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ధర్మారెడ్డిని వెనక్కి పిలిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ (ఐడిఇఎస్)కు చెందిన అధికారులను రక్ష శాఖ ఎప్పుడయినా వెనక్కి పిలిపించే అధికారం ఉంటుందని, దానికి డిఓపిటీ అనుమతి అవసరం లేదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

ధర్మారెడ్డి బదిలీ సాధ్యమేనా?

అయితే ఐడిఇఎస్ అధికారి ధర్మారెడ్డిని తిరిగి వెనక్కి పిలిపించడం,  అంత సులభం కాదన్న వ్యాఖ్యలు అధికారవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఢిల్లీలో విపరీతమైన పలుకుబడి, కేంద్ర పెద్దలతో విస్తృతమయిన పరిచయాలున్న ధర్మారెడ్డిని కదిలించడం అంత సులభం కాదంటున్నారు. గతంలోనే టీటీడీ అధికారిగా పనిచేసిన ధర్మారెడ్డికి, అప్పటినుంచే అన్ని పార్టీలకు చెందిన ఢిల్లీ ప్రముఖులతో సత్సంబంధాలు ఉండేవని గుర్తు చేస్తున్నారు.

అమ్మిరెడ్డి బదిలీ వెనుక?

సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొంది ఢిల్లీ వెళ్లిన ఎంపీ రాజు, అక్కడి ఎయిమ్స్‌లో పూర్తి స్థాయి చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత రక్షణశాఖ మంత్రి, లోక్‌సభ స్పీకర్ వంటి ప్రముఖులతో భేటీ అయ్యారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కూ ఏపీ పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలోనే తనను ఆర్మీ ఆసుపత్రి నుంచి త్వరగా డిశ్చార్జి చేసి, తిరిగి గుంటూరుకు తీసుకువెళ్లేందుకు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆసుపత్రి బయట పోలీసులను నియమించారంటూ ఎంపీ రాజు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా, బయట ఉన్న పోలీసులు తిన్న మెస్ బిల్లులకు తానే స్వయంగా చెల్లించిన చార్జిల రశీదులను కూడా కేంద్ర హోంశాఖకు అందించారు.

దానిపై స్పందించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాన్ని వివరణ అడిగింది. మిలటరీ ప్రాంతంలో పోలీసులను ఎలా పంపించారని ప్రశ్నించినట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆగ్రహం ఫలితంగానే… అమ్మిరెడ్డికి ఎక్కడా పోస్టింగు ఇవ్వకుండా, హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.  సహజంగా రాష్ట్ర స్థాయిలో జరిగే ఎస్పీల బదిలీల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించదు. కానీ అమ్మిరెడ్డి బదిలీలో మాత్రం ట్రాన్స్‌ఫర్ కాపీని, కేంద్ర హోం సెక్రటరీకి సైతం పంపించారంటే.. ఎంపి రాజు నాటి అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి ఇచ్చిన ఫిర్యాదు ఫలించినట్లు స్పష్టమవుతోంది. పైగా.. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, అమ్మిరెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం ప్రస్తావనార్హం. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఎసఈసీ ఆదేశాల మేరకు బదిలీ చేసిన అధికారులకు, వెంటనే పోస్టింగు ఇచ్చిన ప్రభుత్వం, ఎస్పీ అమ్మిరెడ్డికి మాత్రం ఎక్కడా పోిస్టింగ్ ఇవ్వకపోవడం బట్టి.. ఈ వ్యవహారంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎంత సీరియస్‌గా ఉందో అర్ధమవుతోందని అధికారులు విశ్లేషిస్తున్నారు.