అవకాశం చేజిక్కించుకుంటారో..వారే అపరిమిత విజేతలు.

810

నిజమే బీజేపీ లో చేరకుంటే ఈ టెలను ఏం చేస్తారు?  కొన్ని ఆస్తులను ఆక్రమిస్తారేమో ! దాని క్రింద జైల్లో వేస్తారేమో ? అంతకన్నా జరిగేదేముంది !? కానీ తెలంగాణా ప్రజా జీవ నంలో ఒక వీరుడిగా, ప్రజల కోసం నిజంగానే నిలిచిన ప్రజాతంత్ర యోధుడిగా మిగిలిపోతారు. తెలంగాణ జనం ఒక మార్పును ఆహ్వానించే చారిత్రక సందర్భపు,  ఒక ఉషోదయమై వెలుగు వెలిగే గొప్ప అవకాశాన్ని నిజంగానే వదులుకుంటున్నాడు. ఈటెల కి ఏమీ కాదు. ఆయన బీజేపీ లో చేరక, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ప్రజా  నాయకులను ఉపాధ్యాయులనూ, లాయర్ లను డాక్టర్ లను మిగతా తెలంగాణ మేధావులను విద్యార్థులను కలుపుకొని .. ప్రజల తరపున నిలబడితే తాత్కాలికంగా కష్టమైనా, నష్టమైనా కాల గమనంలో ఆలస్యమైనా అంతిమంగా గెలుపు వరించేది. ప్రజలు తప్పక గెలిపించేవారు. తెలంగాణ మేధావులు ప్రొఫెస్సర్ లు జనం పక్షపాత ప్రజానీకం చేయి చేయి కలిపి, ఒక మహా సముద్రమై మహా ప్రభంజనం సృష్టించబడేది. ఆ రకంగా ఆలోచించినప్పుడు, ఆయన తనకు తాను నష్టం చేసుకున్నవాడే గాక.. తెలంగాణ ప్రజానీకానికంతటికీ తీరని నష్టం కష్టం మిగిల్చినవాడే అవుతాడు. అంతే గాక ఒక చారిత్రక మార్పుకు అనుకూలమయ్యేవాడు తానే ప్రతికూలంగా కనబడతాడు. ఏది ఏమైనా ఈ సందర్భాన్ని ఈటెల వదులుకున్నా, తెలంగాణ ప్రజా సంఘాలు మేధావులు…..వివిధ పార్టీల్లో ముందు నడిచే రాజకీయనాయకులు వదులుకోకూడదు. ఇలాంటి సమయం ఇప్పుడు వదులుకుంటే, నాయకులకూ ప్రజలకూ మళ్ళీ రావాలంటే కష్ట సాధ్యం.గాలి వీచినప్పుడే తూర్పారబట్టడం నాయకులు నేర్చుకోవాల్సిన గుణపాఠం. మహా ప్రవాహంలా వస్తున్న అవకాశాన్ని వదులుకోకుండా,  అనుకూలంగా మార్చుకోవడంలోనే నాయకుల గొప్పతనం నిలిచి ఉంటుంది. ముందు నడిచే నాయకులారా పహారాహుషార్…ఎవరు ఈ అవకాశం చేజిక్కించుకుంటారో వారే అపరిమిత విజేతలు.

–  ఏ.చంద్రమోహన్