తహశీల్దార్,ఆర్డీవో కార్యాలయం వేలం

258

మండలానికి తహసీల్దారే సర్వాధికారి. వారే మండల స్థాయి మెజిస్ట్రేట్‌లుగా కూడా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారికి న్యాయస్థానం దిమ్మతిరిగే షాకిచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పిన్నింగ్ మిల్లు నిర్మించిన కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఏకంగా తహసీల్దార్ కార్యాలయ భవనాలను అమ్మేసి అతడి బాకీ తీర్చాలని ఆదేశించింది. దీంతో అధికారులు నంద్యాల తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం వేలం నిర్వహించనున్నట్లు దండోరా వేశారు.

వివరాల్లోకి వెళ్తే… కర్నూలు జిల్లాలో మోహన్‌ రావు అనే కాంట్రాక్టర్‌ 1988లో స్పిన్నింగ్‌ మిల్లు నిర్మించాడు. దానికి 95లక్షల రూపాయలు ఖర్చు కాగా.. దాన్ని అప్పటి స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ చెల్లించలేదు. ఎంత తిరిగినా డబ్బులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించారు. 2018లో దానిపై తీర్పు చెప్పిన నంద్యాల కోర్టు…. తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీసులను జప్తు చేయాలని తీర్పు వెల్లడించింది. అయినప్పటికీ ప్రభుత్వ అధికారుల్లో చలనం కలగలేదు. దీంతో మోహన్‌రావు మళ్లీ కోర్టు మెట్లెక్కారు. తమ ఆదేశాలు పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఈ నెల 24వ తేదీన రెండు కార్యాలయాలు వేలం వేసి అతడికి డబ్బు చెల్లించాలని ఆదేశించింది.

1998లో మోహన్‌రావుకు రూ.95లక్షలు చెల్లించాల్సిన మొత్తం 18శాతం వడ్డీతో కలిపి ఇప్పుడు రూ.75కోట్లు అయిందని అధికారులు అంచనా వేశారు. 24వ తేదీన జరిగే వేలంపాటలో ఎవరైనా పాల్గొనవచ్చని మోహన్‌రావు తరపు న్యాయవాది చెబుతున్నారు. ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు వేలం వేయాలంటూ కోర్టు నోటీసులు ఇవ్వడం, దానికి దండోరా కూడా వేయించడం ఇప్పుడు కర్నూలు జిల్లాలో హాట్‌‌టాపిక్‌గా మారింది.