టెట్‌ ఒక్కసారి పాసైతే చాలు!

438

దిల్లీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  టెట్‌ సర్టిఫికేట్‌ ఏడేళ్ల గడువును ఎత్తివేస్తూ.. జీవిత కాలం చెల్లుబాటు అయ్యేలా సవరణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌  పోఖ్రియాల్‌  సూచించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవారికి టెట్‌ను తప్పనిసరి చేస్తూ గతంలో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఆదేశానుసారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్‌ను నిర్వహిస్తున్నాయి. ఒకసారి టెట్‌లో పాసైతే దాని వ్యాలిడిటీ ఏడేళ్లపాటు ఉంటుంది. ఈ లోపల ఉద్యోగం సాధిస్తే సరేసరి, లేదంటే మళ్లీ అర్హత సాధించాల్సి ఉంటుంది.

కేంద్రప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం ఒకసారి టెట్‌ పాసైతే, ఉద్యోగం సంపాదించే వరకు దానిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా మరికొంత మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరవచ్చని కేంద్రం భావిస్తోంది. ‘‘ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారి ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది’’ అని పోఖ్రియాల్‌ అన్నారు. అయితే ఇప్పటికే  టెట్‌ అర్హత సాధించి ఏడేళ్లు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా కొత్త ధ్రువపత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2011  నుంచి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఇది వర్తించనుంది.