త్వరలోనే విశాఖపట్నం పరిపాలనా రాజధాని: విజయసాయి

483

ఆంధ్రప్రదేశ్‌‌కు అతి త్వరలోనే విశాఖపట్నం పరిపాలనా రాజధాని కానుందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలు ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితి, విశాఖపట్నం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. అతి తొందరలోనే పరిపాలనా రాజధాని విశాఖకు తరలింపు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సి.ఆర్.డి.ఏకు సంబంధించిన కేసులకు, రాజధాని తరలింపుకు సంబంధం లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పాలనను కొనసాగించవచ్చని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం  ఇచ్చారు.

జీవీఎంసీ పరిధిలోని ప్రతీ వార్డులో పారిశుద్ధ్యం, పార్కుల ఆధునికీకరణ, తాగునీరు పంపిణీ, మురుగునీటి శుద్ది తదితర అంశాలపై అధికారలతో సమీక్ష సమావేశంలో చర్చించడం జరిగిందని వెల్లడించారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న 98 వార్డులలో ప్రతి వార్డులోనూ ”వార్డు డెవలప్మెంట్ ప్రణాళిక”ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని చెప్పారు. అతి తొందరలోనే జీవీఎంసీ నేతృత్వంలో వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ రూపకల్పన జరుగుతుందన్నారు. గతంలో విశాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి వి.ఎం.ఆర్.డి.ఎ పరిధిలో చేసిన శంకుస్థాపనలను  త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు.

విశాఖ నగరానికి భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ కైలాసగిరి నుండి భోగాపురం వరకు ఆరు లైన్ల రోడ్డు నిర్మాణ పనులు వి.ఎం.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో జరగాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నరని పేర్కొన్నారు. స్థానిక మూడసర్లోవ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని వెల్లడించారు. ఈ పార్కు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు నిర్ణయం తీసుకొన్నారని పేర్కొన్నారు.

సింహాచలం దేవస్థాన భూముల పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి సంబంధించి కోర్టు తీర్పును అనుసరించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని వెల్లడించారు. పంచ గ్రామాలలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందదని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఒక నిర్దిష్ట సమయం పెట్టుకోవాలని ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. అందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో సూచించడం జరిగిందని, ఈ కమిటీకి కలెక్టర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. జీవీఎంసీ కమిషనర్, మెట్రోపాలిటన్ కమిషనర్, తూర్పు విద్యుత్ పంపిణి సంస్ధ కమిషనర్ ఇతర ఉన్నత అధికారులు ఈ కమిటీలో ఉంటారని ఆయన వెల్లడించారు. జీవీఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వందకు వంద శాతం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జీవీఎంసీ పరిధిలో 793 మురికివాడలు ఉన్నాయని అందులో ప్రభుత్వం కొన్నిటిని గుర్తించిందని పేర్కొన్నారు. విశాఖ నగరంలో మురికివాడలు గుర్తించడంతో పాటుగా, ప్రభుత్వ భూముల్లో ఉన్న మురికివాడలకు రోడ్లు విస్తరించి, అక్కడ నివసిస్తున్న వారికి  పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. ఒకవేళ ప్రైవేటు భూముల్లో మురికివాడలు ఉంటే జీవీఎంసి టిడిఎస్ మంజూరు చేసి, అక్కడ నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో పనిచేస్తున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వెల్లడించారు.