అద్దీ నెల్లూరోళ్ళ మందల

104

కమ్మటి మొలగలుకు వడ్లకు చిరునామా…. నెల్లూరు సీమ. పెన్న తీరాన శతాబ్దాల చరిత గలిగిన ఎత్తయిన రంగనాయకుల స్వామి గుడి గోపురం నెల్లూరు నగరంలోకి గంభీరంగా, సాదరంగా ఆహ్వానిస్తుందెవరినైనా. ప్రక్కనే చేత ఘంటము ధరించి సింహపురి సీమ పాండితీ ప్రకర్షకు సాక్షిగా కూర్చున్న మహాభారత గ్రంధకర్త తిక్కన సోమయాజి కనుపించి కనువిందు చేస్తారు.

చేపల పులుసుకు ప్రసిద్ధి నెల్లూరు …… ఆహా….. తలచుకుంటేనే నోరూరు. ఆతిథ్యంలో, ఔదార్యంలో, ఆత్మీయ పలకరింపులో నెల్లూరు వారి తర్వాతే ఎవరైనా. రోషం, పౌరుషం సింహపురి సింహాలకు సొంతమైన సిరి. నెల్లూరీయుల మాట కటువు. కానీ…. మమతలకు లేదు కరువు.

నృసింహ కొండపై కొలిచిన వారి కొంగుబంగారమై నిలచిన నరసింహ స్వామి, పచ్చని వృక్షాలు, కొండలు, జలపాతాల నడుమ ఆదిలక్ష్మిని ఒడి చేర్చుకుని పెనుశిలగా నిలచిన పెంచల నరసింహుడు, ముకుళిత హస్తాలతో తనను మదిన తలచినదే తడవుగా కోరిన కోర్కెలు ఈడేర్చే కరుణ కలిగిన తల్లి కామాక్షమ్మ, దిక్కని నమ్మిన వారి పెద్ద దిక్కు సూళ్ళూరుపేట చెంగాళమ్మ….. ఇలా అడుగడుగునా ఆధ్యాత్మిక శోభతో అలరారే చైతన్యపురి సింహపురి.

ఇక శాస్త్ర సాంకేతిక రంగంలో….. అనేక విజయాలతో దేశానికే వన్నెతెచ్చిన అంతరిక్ష పరిశోధనా కేంద్రం కొలువై యున్నది సింహపురి గడ్డ మీదనే. అక్కడికి సమీపంలోనే ప్రపంచంలోని విహంగాలకెన్నిటికో ఆవాసంగా, ఆలవాలంగా, విహారయాత్రా స్థలంగా….. కనువిందు చేసే పులికాట్, నేలపట్టు చూపరులకు చేస్తుంది కనికట్టు. నాటి రాచరికానికి ఆనవాళ్లుగా గంభీరంగా నిలచిన ఉదయగిరి దుర్గం, వేంకటగిరి నగిరి నెల్లూరు చరిత్రను కళ్ళకు కడతాయి.

ఇక లక్షలాది ఎకరాలకు సాగునీటినిచ్చే సోమశిల డ్యామ్, అండమాన్ తర్వాత నెల్లూరు జిల్లాలో మాత్రమే అరుదుగా కనిపించే ఇరకం, వేనాడు దీవులు. నైపుణ్యానికి, నాణ్యతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేంకటగిరి జరీ చీరలు…… ఇలా నెల్లూరు ప్రత్యేకతలు చెప్పుకుంటూపోతే రోజులు చాలవు, వ్రాసుకుంటూ పోతే కాగితాలు మిగలవు.

ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవైన నెల్లూరు సీమ ఈ కరోనా సమయంలోనూ ప్రత్యేకంగా నిలిచింది….. ప్రపంచం మొత్తం దిగ్భ్రమతో తన వైపు చూసేలా చేసుకుంది.

కరోనా కల్లోలంతో యావత్ ప్రపంచం విలవిలలాడిపోతున్న వేళ, జనం ఊపిరాడక ఆక్రందనలు చేస్తున్న వేళ నెల్లూరుకి చెందిన DRDO చైర్మన్ సతీష్ రెడ్డి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కరోనాను కంట్రోల్ చేసే 2DG మందును వెలుగులోకి తెచ్చింది. నిజానికి కరోనా కరాళ నృత్యంతో కకావికలవుతున్న ప్రపంచం మొత్తం ఇలాంటి ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తూ ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో మనకంటే ఎంతో ముందున్న దేశాలు అనేకం ఉన్నాయి. కానీ అన్ని దేశాల కంటే ముందు మనం కరోనాకు విరుగుడు మందు కనిపెట్టగలిగాం. ఇలాంటి నేపథ్యంలో ఈ ఆవిష్కరణ సామాన్యమైనదేమీ కాదు. కరోనా రోగులకు ప్రభావవంతంగా పని చేస్తే…… ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత గొప్ప ఆవిష్కరణగా నిలిచిపోతుంది. మన దౌర్భాగ్యమేమో కానీ ఇంత గొప్ప ఆవిష్కరణకు కూడా మన మీడియా….. తగినంత ప్రాధాన్యతనివ్వడం లేదనిపిస్తూ ఉంది. ప్రపంచం మొత్తాన్ని కరోనా కబంధహస్తాల నుంచి బయటపడవేయగలిగిన దివ్యౌషధం 2DGని ఆవిష్కరించిన శాస్త్రవేత్తల బృందానికి నెల్లూరీయుడు సతీష్ రెడ్డి నేతృత్వం వహించడంతో నెల్లూరు వారి ప్రతిభ మరోసారి జగద్విదితమైంది.

ఇక కరోనా బారినపడి, ఆక్సిజన్ అందక అటు లక్షలు పోసి ఖరీదైన అలోపతి వైద్య సౌకర్యాలను పొందలేక, ఒకవేళ లక్షలు ఖర్చు పెట్టినా తమ ప్రాణాలు నిలుస్తాయని నమ్మకం లేక, అట్లని ప్రాణాల మీద ఆశ చావక అలో రామచంద్రా అంటూ అల్లల్లాడుతున్న అమాయక ప్రజానీకానికి అపర సంజీవనిని అందించిన నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య ఘనత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. “ఈ కరోనా కల్లోలంలోంచి మానవాళిని గట్టెక్కించడానికి ప్రకృతి మనకు ప్రసాదించిన వరం ఆనందయ్య” అని ప్రముఖ సినీ నటుడు శ్రీ జగపతి బాబు చెప్పిన మాటలలో అతిశయోక్తి లేదు. ప్రజల కష్టాలను కడతేర్చటానికి ప్రకృతి తనకు తానుగా రూపొందించుకున్న అపర ధన్వంతరి శ్రీ ఆనందయ్య.

గత సంవత్సర కాలం నుంచి ఆనందయ్య కరోనా రోగులకు తన మందులు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఆయన మందులు స్వీకరించిన వేలాది మంది రోగులు స్వస్థత పొందారు. ఈ ఏడాది కూడా శ్రీరామనవమి నుంచి 50 వేల పైచిలుకు కరోనా బాధితులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఆనందయ్య. తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడుతూ…. ఆక్సిజన్ అందని స్థితిలో…. దాదాపు అపస్మారక స్థితిలో తన వద్దకు వచ్చిన రోగులెందరికో ఆయన, ఆయన అనుచరులు కనీసం మాస్క్ కూడా ధరించకుండా వైద్యాన్నందించారు. ఆయన కానీ, అనుచరులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరూ ఇప్పటివరకూ కరోనా బారిన పడలేదు. అంతెందుకు సుమారు 10 వేల పైచిలుకు జనాభా వున్న ఆ ఊరిలో అత్యధికులు మాస్కు లేకుండానే తిరుగుతున్నారు. వారందరి భరోసా ఒక్కరే….. ఆయనే ఆనందయ్య. ఆ ఊరిలో ఎవరిని కదిలించినా వారంతా ఒకటే మాట చెబుతున్నారు “మాకు ఆనందన్న మందిచ్చాడు. మాకేమీ కాదు. మేము మాస్కులు కూడా ధరించాల్సిన అవసరం లేదు.” ఇదీ వారు చెబుతున్న మాట. ఆనందయ్య మందుకున్న మహత్తుకు ఇంతకన్నా తార్కాణమింకేం కావాలి? అయినా సరే మన ఘనత వహించిన అధికార గణం ఆనందయ్య మందు పనితీరుపై విచారణ మీద విచారణ చేస్తూనే ఉంది. చర్చోపచర్చలు కొనసాగిస్తూనే ఉంది. మూర్ఖపు మీడియా ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉంది. వీరికి కంటికి కనిపించే ఆధారాలు అవసరం లేదు. గాలికెగిరిపోయే కాగితాల ఋజువులు కావాలి. అయిన దానికీ కాని దానికీ ఋజువులడిగే మేథావుల మెదళ్ళకు పట్టిన బూజు వదిలే రోజెప్పుడొస్తుందో?

సందేహ దేహులు ఎంతమంది ఎన్ని ప్రశ్నలేసినా…. ఎన్ని ఋజువులడిగినా….. ఎన్ని తర్క వితర్కాలు చేసినా, ఎవరు సర్టిఫై చేసినా, చెయ్యకున్నా ఆనందయ్య మందుకు జనం ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చేశారు. “మానింది మందు” అన్న నానుడిననుసరించి “రోగాన్ని నయం చేస్తున్న మా ఆనందయ్య మందే అసలుసిసలు మందు” అంటున్నారు జనం. ఎందుకంటే ఆనందయ్య మందు పనితనాన్ని వారు ప్రత్యక్షంగా చూశారు. వాడి రూఢిపరచుకున్నారు. ఇప్పుడు ఆనందయ్య మందు జనం నచ్చిన మందు. జనం మెచ్చిన మందు. జనం నమ్మిన మందు. జనం మదిలో నిలచిన మందు. జనం మది గెలిచిన మందు.

నెల్లూరు గడ్డన పుట్టిన బిడ్డలు సతీష్ రెడ్డి, ఆనందయ్యలు ఇలాంటి సంక్షుభిత సమయంలో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతుకులీడుస్తున్న మానవాళికి మేమున్నామంటూ భరోసాగా నిలిచారు. కన్ను కానని చీకటిలో కాగడాలై నిలిచారు. ఊపిరాడక అల్లాడిపోతున్న ప్రజలకు తమ ఆవిష్కరణలతో ఊపిరులూదారు. కరోనా ప్రళయ మారుతం ధాటికి రెపరెపలాడుతున్న ప్రజల ప్రాణదీపాలు ఆరిపోకుండా తమ అరచేతులు అడ్డుపెట్టారు. ప్రజల ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోకుండా కాపాడగలిగే అమృత బిందువులనందించారు. “అద్దీ నెల్లూరోళ్ళ మందల” అని ప్రపంచానికి చాటారు. ఆ సింహపురి సీమ ముద్దు బిడ్డలిద్దరికీ యావత్ప్రపంచం చేస్తోంది ఆత్మీయ అభివందనం. జైహింద్.

– శ్రీరాంసాగర్
 (VSK ANDHRAPRADESH )