దేశ హితమే పాత్రికేయుడికి పరమావధి కావాలి

628

నారదుడ్ని కలహభోజుడిగా పురాణాలలో పలుచోట్ల అభివర్ణించారు. నారదుడు ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఒక చోటు నుంచి మరొక చోటికి సమాచారాన్ని చేరవేస్తూ ఉండేవాడు. దానివలన ఒకరి మధ్య ఒకరికి అపార్ధాలు, కోపతాపాలు, ఈర్ష్యాసూయలు ఏర్పడ్డ కారణంగా ఒకరితో ఒకరు అనేక సందర్భాలలో కలహించుకున్నారని, కనుక ఆయన కలహభోజుడని వాటిలో హాస్యస్ఫోరకంగా అభివర్ణించినా….. నిజానికి నారదుని చర్యల అంతిమ లక్ష్యం లోక కళ్యాణమే అనే విషయాన్ని కూడా ఆయా గ్రంథకారులు స్పష్టం చేశారు. ఆయన చర్యల కారణంగానే అనేకమంది రాక్షసుల సంహారం జరిగి తద్వారా ధర్మోద్ధరణ, ధర్మస్థాపన గావింపబడినదనే విషయం మనకు పురాణ గ్రంథాల ద్వారా అర్థం అవుతుంది.

నారదుని జీవితాన్ని అవలోకిస్తే….. నారదుడు కోట్లాది సంవత్సరాల క్రిందటి వార్తాహరునిగా మనకు అవగతమవుతాడు. నారదుడు ఆది వార్తాహరుడు. ఎందుకంటే ఒక వార్తాహరుని/ పాత్రికేయుని లక్ష్యం ధర్మో ద్ధరణ, సత్య సంస్థాపన కావాలి. దానిని యావజ్జీవితము తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శ వార్తాహరుడు/ పాత్రికేయుడు నారదుడు.

ఆ విలువలేవీ?

ఈ మధ్య కాలం వరకూ మనం విలువలతో కూడిన పాత్రికేయాన్ని, విలువలు నిండిన పాత్రికేయులను చూశాం. ఆ మేరకు వారికి గౌరవాభిమానాలను పంచాం. ప్రజాహితమే పరమావధిగా భావించి పాత్రికేయ విధులను నిర్వర్తించి తమ ప్రాణాలమీదకే తెచ్చుకున్న పాత్రికేయ మిత్రులనూ చూశాం. తమ ప్రాణాలు పోయినా సరే నిజాన్ని బ్రతికించాలని, నిజం బ్రతికితే చాలు తామేమైపోయినా ఫర్వాలేదని భావించి తపించిన పాత్రికేయ తపస్విలను చూశాం.

అలా నిజాన్ని నమ్ముకుని పాత్రికేయ వృత్తిలో జీవించినవారు కొందరైతే….. తాము జీవించడం కోసం నిజాన్ని అమ్ముకుని పాత్రికేయానికి జీవం లేకుండా చేసిన, చేస్తున్న పాత్రికేయుల్ని నేడు చూస్తున్నాం.

నిజాల్ని కాకుండా తమ ఇజాల్ని బ్రతికించుకోవడం కోసమే ఇప్పుడు కొంతమంది పాత్రికేయాన్ని స్వీకరిస్తున్నారు. అమ్ముడుపోవడం, తామనుకున్నదే నిజమని, తమను కొన్నవారు, తమవారు చెప్పినదే నిజమని జనాల్ని నమ్మింపజేసే….. కాదు కాదు భ్రమింపజేసే ప్రయత్నాలు చేసే వాడే, అందుకోసం ఎంతకైనా బరితెగించేవాడే విజయవంతమైన పాత్రికేయుడు, అదే ప్రగతిశీల పాత్రికేయము అనుకునే మానసిక స్థితిలోకి మనల్ని నెట్టివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.

ఆంగ్లేయుల కాలం నుంచే…..

నిజానికి ఈ పరిస్థితి ఇప్పటిది కాదు. ఆంగ్లేయుల పాలనా కాలంలోనే భారతీయ స్వాతంత్ర పోరాట యోధులకు, ముఖ్యంగా విప్లవ యోధులకు వ్యతిరేకంగా, వారి బలిదానాలను తక్కువ చేస్తూ, వారి పోరాటానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం గాంధీ, నెహ్రూలకు మాత్రమే పెద్ద పీట వేస్తూ…. వారి పోరాట ధోరణికి మాత్రమే సమర్థనగా, సానుకూలంగా వార్తలు, వ్యాసాలు వ్రాసి వారికి, వారి పోరాటానికి విపరీతమైన ప్రచారం కల్పించి వారి పోరాటానికే ప్రజల మద్దతును కూడగట్టడంలో నాటి పత్రికలు ప్రధాన భూమిక పోషించాయి.

తమకు నచ్చని వాదాలను, విధానాలను పత్రికా మాధ్యమంగా దుయ్యబట్టడంలో, దుమ్మెత్తి పోయడంలో మహాత్మా గాంధీ వంటి వారు సైతం అతీతులు కాదు. బ్రిటిష్ వైస్రాయ్ ప్రయాణిస్తున్న రైలు పెట్టెను పేల్చివేసినందుకు చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని విప్లవదళంపై మహాత్మా గాంధీ తీవ్రంగా ఆగ్రహించారు. ఆజాద్ బృందం చర్యలను ఖండిస్తూ కాంగ్రెస్ మహాసభలలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతటితో ఆగక విప్లవకారుల చర్యలను, కార్యకలాపాలను తీవ్రంగా దుయ్యబడుతూ తమ ‘ యంగ్ ఇండియా’ పత్రికలో గాంధీజీ ఒక వ్యాసాన్ని వెలువరించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ గాంధీజీ వంటి మహానుభావులే తమ విప్లవోద్యమాన్ని అపార్ధం చేసుకుని అపనిందలు వేస్తున్నందుకు తీవ్రంగా ఆవేదనచెందారు.

సెలెక్టివ్ వార్తా రచన….

మరి ఇప్పుడో? తమకు గిట్టనివారి చర్యలకు, సిద్ధాంతాలకు దురుద్దేశాలను అంటగడుతూ చాలా సెలెక్టివ్ గా కొన్ని నిజాలను మాత్రమే వెల్లడించే లబ్దప్రతిష్టులైన పాత్రికేయులెందరో? తాము నిజాలనుకునే వాటిని, తాము నమ్మిన వారి కోసం, తమను నమ్మిన వారి కోసం, తాము నమ్ముకున్న వారి కోసం, తాము అమ్ముకున్న, తమని కొనుక్కున్న వారి కోసం మాత్రమే వార్తలను వెల్లడించే వారు ఎందరో ఉన్నారు.

దేశంలో ఎక్కడైనా ఇస్లాం, క్రైస్తవుల ఆగడాలు జరిగినా వాటి పూర్తి వివరాలను వెల్లడించకుండా “ఒక వర్గం వారు….. ఒక వర్గం వారిపై…..” అంటూ అస్పష్టమైన, అతి చిన్న వార్తలతో ముక్తాయిస్తారు. మౌల్వీలు, ఇమాంలు చేసే అత్యాచారాలు, అకృత్యాల వార్తలు వ్రాసే సమయంలో వారిని స్వామీజీలుగా, పూజారులుగా, సన్యాసులుగా పేర్కొంటూ వ్రాసిన వార్తలెన్నో…. పైగా అదేదో అప్రాధాన్యమైన వార్త అన్నట్లుగా ఎక్కడో మూలన వేస్తారు. ఫోటోలు కూడా రావు. ఎంత దౌర్భాగ్యం?

ఇక లవ్ జిహాద్ కుట్రలకు బలయ్యే యువతుల విషయంలోనూ అంతే….. నిజానికి హిందూ యువతులెవరూ లవ్ జిహాద్ బారిన పడకుండా ఉండేలా, ఒక హెచ్చరికగా ఉండాల్సిన వార్త…… ఏదో సాధారణ కుటుంబ, వ్యక్తిగత సమస్యల కారణంగా జరిగిన ఆత్మహత్య లేదా మృతిగా అభివర్ణిస్తారు. ఆ మృతి వెనుక యువతి అనుభవించిన దారుణ మనోవేదనను, శారీరిక, మానసిక హింసను ఆవిష్కరించే ప్రయత్నం ఉండదు. ఆమెను నమ్మించి వివాహం చేసుకున్న ఆ కసాయి అకృత్యపు అభివర్ణన ఉండదు. ఆమెను కన్న తల్లిదండ్రుల ఆవేదన ఆనవాలు ఉండదు. ఇదేనా పాత్రికేయం?

అదే హిందూ సాధుసంతులు, సన్యాసులు, పీఠాధిపతుల విషయంలో…. గోరంతలు కొండంతలు చేసే, కట్టు కథలల్లే దుస్సాహసం, అత్యుత్సాహం అతి సహజంగా మన పాత్రికేయులలో కనిపిస్తూ ఉంటుంది. పరువుకు వెరసి, మీడియాతో మనకెందుకనుకుని మౌనం దాలుస్తున్నవారెందరో?

ఇక బ్లాక్మెయిలింగ్ కి అంతే లేదు. ఈ మధ్యనే ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో పనిచేసే ప్రముఖ యాంకర్ ఒకరు…… మరో పెద్ద మనిషిని చాలా పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తూన్నట్లున్న ఆడియో ఒకటి విడుదలై సంచలనం రేపిన సంగతి అందరికీ తెలుసు. అంత అలజడి రేగిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఇంకా ఆ ఛానల్ లోనే పని చేస్తున్నాడంటే మరి మీడియా సంస్థల యాజమాన్యాల చిత్తశుద్ధి కూడా మనకు వెల్లడవుతోంది. ఇలా కాసులతో కప్పెట్టబడే, కనుమరుగైపోయే నిజాలెన్నో?

సంక్షోభ సమయంలోనూ…. దేశ హితాన్ని సైతం మరచి…..

ఈ కరోనా సంక్షోభ సమయంలో…. యావద్దేశం ఒక్క త్రాటిపై నిలబడాల్సిన తరుణంలో సైతం మీడియా వండి వార్చిన కట్టు కథలెన్నో? గతేడాది లాక్డౌన్ సమయంలో జనం ఆకలితో చచ్చిపోతున్నారంటూ వచ్చిన వార్తలు అబద్ధాలని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. అవే నోళ్లు….. సారీ కలాలు…. ఈ కరోనా సెకండ్ వేవ్ లో లాక్డౌన్ విధించలేదని ప్రభుత్వంపై నిందలకు పూనుకుంటూ ఉండడం కూడా జనం గమనించక పోలేదు.

ఇక CAA, NRC లకు వ్యతిరేకంగా ఢిల్లీ షహీన్ బాగ్ లో జరిగిన సుదీర్ఘ దేశ వ్యతిరేక ఆందోళనలకు ఒక వర్గం మీడియా అగ్రతాంబూలం ఇచ్చిన సంగతి, ప్రధాన శీర్షికలలో ప్రచురించి….. ఒక నగరంలో…. ఒక ప్రాంతానికి పరిమితమైన ఆందోళనను దేశవ్యాప్త ఆందోళనగా, దేశంలోని ప్రజలందరి ఆందోళనగా చిత్రీకరించే ప్రయత్నం చెయ్యడం మనకు తెలియనిది కాదు.

అలాగే దేశంలోని రెండు రాష్ట్రాలలోని కొందరి రైతులకు మాత్రమే పరిమితమైన రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమానికి సైతం దేశంలోని రైతులందరి ఉద్యమంగా కలరింగు, కవరింగు ఇచ్చే ప్రయత్నం చేసి నవ్వులపాలైంది మీడియా.

హఠాత్తుగా ఏమైందో ఏమో…. అంటే గిట్టనివారిపై తమ అక్కసు వెళ్ళబోయడానికి మరో కారణం/దారి దొరికిందని కామోసు…… ఇప్పుడు రైతుల సంగతే వదిలేసి కరోనా ఆకస్మిక విజృంభణతో దేశంలో నెలకొన్న ఆక్సిజన్, వ్యాక్సిన్ మరియు ఇతర మందుల కొరతపైన అర్జంటుగా ఆక్రోశించటం మొదలుపెట్టారు.

విచిత్రమేంటంటే…. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ వ్యాక్సిన్ ను సరఫరా చేస్తే….. అప్పుడు ఈ మీడియా కానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు కానీ కనీసం వ్యాక్సిన్ వేయించుకోమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చెయ్యలేదు. యాభై లక్షల డోసుల వ్యాక్సిన్ వృధా అయిపోతే వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు.

ఈరోజు వ్యాక్సిన్ అవసరం ఏర్పడింది కదాని….. ఇప్పటికిప్పుడు 130 కోట్ల వ్యాక్సిన్లు తయారు చెయ్యలేరు. ఒక వేళ చేసినా అందరికీ వెంటనే వ్యాక్సిన్ వేయడానికి అవసరమైన యంత్రాంగం మన దగ్గర లేదు. ఇప్పట్లో అసాధ్యం కూడా…… కనుక అప్పటివరకూ కరోనా దరి చేరకుండా ఎవరి జాగ్రత్తలో వారుండడమే కరోనా వ్యాప్తికి విరుగుడు. ఇలా పరిస్థితులపై ప్రజలకు అవగాహన కలిగించడానికి మీడియా ప్రయత్నించలేదు. దాని స్థానే కేంద్రాన్ని, ప్రధానిని నిందించడం… అసత్యాలను ప్రచారం చెయ్యడానికే మీడియా పెద్దపీట వేసింది. కొందరు రాష్ట్రాల పాలకులతో గొంతు కలిపి కేంద్ర ప్రభుత్వము, ప్రధానిపై దాడి మొదలుపెట్టింది.

అంటే జరిగిన, జరుగుతున్న పరిణామాలపై వారికి అవగాహన లేదని, విషయాలు తెలియవని కాదు. ఇంత సామాన్యమైన విషయం మీడియా, ప్రభుత్వ పెద్దలకు తెలియదనుకోలేం….. తెలిసినా తెలీనట్లు నటిస్తారంతే….. ఎవరి స్వార్థం వారిది. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి. ఎవరి వ్యాపారం వారిది. అవును ఇప్పుడు మీడియా ముసుగులో జరుగుతున్నదంతా వ్యాపారమే. నిజాలను అమ్మే వ్యాపారం. అసత్యాలను ప్రచారం చేసే వ్యాపారం. అభాండాలను వేసే వ్యాపారం. దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాపారం. ఆ మధ్య ఎవరో మిత్రుడన్నట్టుగా శ్మశాన పాత్రికేయం. అవును దేశ ప్రతిష్టను దిగజార్చేలా శ్మశానాల వద్ద కాపు కాసి శవాల ఫోటోలు తీసి, ఆ ఫోటోలకు రేట్లు కట్టి అంతర్జాతీయ మీడియాకు అమ్ముకున్నారుగా? అది శ్మశాన పాత్రికేయం కాక ఇంకేమిటి?

ఈ మీడియా ఎంతగా దిగజారిపోయిందంటే…… కళ్లకు కనిపించే ఎన్నికల ఫలితాలకు సైతం వక్ర భాష్యాలు చెప్పటానికి కూడా సిగ్గు పడటం లేదు. గిట్టనివారి విజయాలను సైతం అపజయాలుగా, తమను కొనుక్కున్న వారి అపజయాలను సైతం విజయాలుగా అభివర్ణించడానికి కూడా వెనుకంజ వేయడం లేదు. ఇటీవల జరిగిన పలు ఎన్నికల ఫలితాలకు సంబంధించి మీడియాలో వచ్చిన విశ్లేషణలు, కథనాలను పరిశీలిస్తే ఎటువంటి వారికైనా వారి బరితెగింపు అవగతమవుతుంది.

మూగ, చెవిటి, గ్రుడ్డి

పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడయిన అనంతరం దారుణ మారణ హోమం జరిగింది, జరుగుతోంది. బెంగాల్ లోని 3662 గ్రామాలపైన దాడులు జరిగాయి. అనేకమంది బిజెపి, సంఘ పరివార్ కార్యకర్తల ఇళ్ళను తగులబెట్టారు. 5500 మంది బిజెపి, సంఘ పరివార్ కార్యకర్తలపై దాడులు జరిగాయి. 32 మంది మృతి చెందారు. 4062 షాపులపై దాడులు జరిగాయి. వాటిలోని సామగ్రిని లూటీ చేశారు. అనంతరం ఆ షాపులను దహనం చేశారు.

వాటిలో టీఎంసీ కార్యకర్తల దుకాణాలు కూడా ఉన్నాయి. అల్లరిమూకలు తమ దుకాణాలపై దాడి చేసి, లూటీ చేసి, దహనం చేస్తున్నప్పుడు వాటి యజమానులైన తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ” భయ్యా మేము టీఎంసీ కార్యకర్తలం. బిజెపి, సంఘ పరివార్ వాళ్ళము కాదు” అని మొరపెట్టుకున్నప్పుడు వారికెదురైన సమాధానం…… ” మీరెవరైతే మాకేంటి? హిందువులే కదా? అది చాలు మీ మీద దాడి చేయడానికి” అని. దాడులకు పాల్పడ్డ వారిలో ఎక్కువమంది బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడిన వారే. వారికి స్థానిక ముస్లిములు కూడా కొందరు తోడయ్యారు. గుండెలు పిండేసే సత్యమేంటంటే ఎందరో మాతృమూర్తులపై సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టారు. తల్లిదండ్రుల ముందు, భర్త, పిల్లల కళ్ళ ముందే ఆ తల్లులకు అవమానాలు జరిగాయి.

“నువ్వు ఊళ్లోకి అడుగుపెట్టాలంటే నీ భార్య పింకీని కొద్ది రోజులు నా వద్దకు పంపు” బెంగాల్ లో మినఖన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఉత్తర24 పరగణాల జిల్లాలోని ఒక గ్రామస్థాయి దళిత బీజేపీ మహిళా నేత భర్త సాధన్ బజ్ తో తృణమూల్ కాంగ్రెస్ నేత ముజఫర్ పలికిన పలుకులివి. దీనిని బట్టి బెంగాల్ లోని పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దురదృష్టం…. చాలా మీడియా సంస్థలు, ముఖ్యంగా మన తెలుగు మీడియా ఆ దుర్ఘటనలకు అసలు స్థానమే కల్పించలేదు. ఇంతకంటే దిగజారుడుతనం, దారుణం, దుర్నీతి ఇంకేమైనా ఉంటుందా? అక్కడి ఆడపడుచుల ఆర్తనాదాలు, అమాయకుల ఆక్రందనలు మన మీడియాకి అసలు కనబడనేలేదు, వినబడనేలేదు. ఇప్పుడనే కాదు….. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారీ మన మీడియా గుడ్డిది, చెవిటిది, మూగది అయిన సందర్భాలు చరిత్రలో ఎన్నో…..

నిక్కచ్చిగా ఉండడమంటే దేశ హితాన్ని విస్మరించడం కాదు

అదే సమయంలో పాత్రికేయులలో నిజాయితీగా వ్యవహరించే వారిని కూడా మనం స్మరించుకోవాలి. తమాషా ఏమిటంటే అలాంటి నిజాయితీపరులలో కూడా ఒక ప్రమాదకరమైన వర్గం ఉంది. వారికి తన, పర భేదాలు ఉండవు. ఏ విషయాన్నయినా ముక్కుసూటిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా వెల్లడిస్తూ ఉంటారు. అందుకు వారు ఒకింత గర్వపడుతూ కూడా ఉంటారు. మనం కూడా వారిని ప్రశంసించ వలసిందే. అదే సమయంలో వారిని హెచ్చరించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటారేమో….. వీరు ఎవ్వరినీ వదలరు. దేశానికి అప్రతిష్టను తెచ్చే విషయమైనా సరే, దేశ రహస్యాలను బహిర్గత పరచే విషయాలైనా సరే మేము నిజాయితీగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా వెల్లడించి పారేస్తామంటారు.

పాత్రికేయులకు నిజాయితీ, నిక్కచ్చితనం తో పాటుగా దేశం పట్ల నిబద్ధత, బాధ్యత, సంయమనం కూడా ఉండాలి. “నేను పాత్రికేయుడ్ని. నిజాలను వెల్లడించడమే నా పని.” అనుకుంటే దేశానికి తీరని ద్రోహం చేసిన వారమవుతాము. వ్యక్తి స్థాయిలో సైతం బయటకు వెల్లడించని, వెల్లడించ లేని, కూడని విషయాలు కొన్ని ఉంటాయన్న సత్యాన్ని మనం మరువరాదు. మరి దేశం విషయంలో? కనుక పాత్రికేయుడికి నీతి, నిజాయితీ, నిక్కచ్చితనం, నిర్మొహమాటత్వం తో పాటుగా కూసింత దేశభక్తి కూడా ఉండాలి. దేశ హితమే పరమావధి కావాలి. తాను పనిచేసే సంస్థ పట్ల విశ్వాసం, యాజమాన్యం పట్ల భక్తి, వ్యక్తిగత ప్రతిష్ట, నియమాలు వీటన్నిటికంటే దేశ హితమే, సౌభాగ్యమే ప్రధానమన్న సంగతి మరువ రాదు. ఒకవేళ ఎవరైనా నిక్కచ్చి పాత్రికేయం పేరుతో దేశ హితాన్ని మరచి వర్తిస్తే….. వారు ఖచ్చితంగా శిక్షార్హులే. తాను వ్యక్తిగతంగా ఎంత అవహేళనకు, అపార్థానికి, అవమానానికి గురైనా…. లోక హితమే పరమావధిగా చరించి, ఆచరించి చూపిన నారద మునీంద్రుడు మనకాదర్శం. ఆయన మార్గమే మనకు సదా ఆదర్శం, ఆచరణీయం. జై హింద్.

– శ్రీరాంసాగర్.

గమనిక : ఈ వ్యాసంలో వెల్లడించిన విషయాలు, అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతం.

( VSK ANDHRAPRADESH )