‘పంజరంలో చిలక’ భలే పలికింది!

500

సీబీఐ వింత వాదన
( మార్తి సుబ్రహ్మణ్యం)

పూర్వం ఇద్దరు కొట్లాడుకున్న సంగతి రాజు గారికి తెలిసి ఇద్దరినీ ప్రవేశపెట్టారు. ఇద్దరూ ముందు తనను అవతలివాడే కొట్టాడని వాదించారు. దానితో ఆరోజు గొడవ జరిగినప్పుడు అక్కడే ఉన్న దుకాణం వాడిని సాక్ష్యానికి పిలిచారు. ముందు ఎవరు కొట్టారో చెప్పమన్నారు రాజు గారు. దుకాణం యజమాని ఇరకాటంలో పడ్డాడు. ఎవరికి వ్యతిరేకంగా చెప్పినా, ఎవరికి అనుకూలంగా చెప్పినా చిక్కే. అందుకే.. అయ్యా ఇద్దరూ కొట్టుకున్న మాట నిజం. కాకపోతే ఆ సమయంలో గాలిరావడంతో ఇసుక కళ్లలో పడి, ఎవరు ముందుకొట్టారో చూడలేకపోయా. కాబట్టి కామందులవారే తీర్పు ఇవ్వాలని చల్లగా తప్పుకున్నాడు. తాజాగా జగన్ కేసు విషయంలో సీబీఐ వాదన కూడా ఇలాగే కనిపించింది.

జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్ ఎట్టకేలకు విచారణకు వచ్చింది. అయితే జగన్ సమాధానం చెప్పడానికి,సీబీఐ కోర్టు ఇచ్చిన చివరిగడువును వినియోగించుకున్నారు. అయితే దానిపై స్పందించాల్సిన సీబీఐ మాత్రం గోడమీద పిల్లివాటం ప్రదర్శించడం అనుమానం, ఆశ్చర్యానికి గురిచేసింది. ‘రఘురామకృష్ణంరాజు పిటిషన్‌పై చట్టప్రకారం మీరే తగిన నిర్ణయం తీసుకోండి. కోర్టు విచక్షణ మేరకు తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నా’మని సీబీఐ న్యాయవాది చేసిన విజ్ఞప్తి న్యాయవాద వర్గాలను విస్మయపరిచింది.

సహజంగా కేంద్ర పరిథిలోని సీబీఐ నుంచి,  రాష్ట్రాల పరిథిలో ఉండే సీఐడీ వంటి అన్ని విచారణ సంస్థలూ నిందితులకు వ్యతిరేకంగా సాక్షాలు సేకరించి, నివేదికలిస్తుంటాయి. కోర్టుల్లో కూడా ఆ మేరకే వాదిస్తుంటాయి. పైగా ఈ కేసులో జగన్‌కు వ్యతిరేకంగా కేసు పెట్టింది కూడా సీబీఐ కావడం ప్రస్తావనార్హం. అందుకే దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై, సీబీఐ ఏం వాదిస్తుంది? ఎలా వాదిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.  ఆ క్రమంలో న్యాయాన్యాయాలు మీరే నిర్ణయించమని స్వయంగా సీబీఐ వంటి అత్యున్నత విచారణ సంస్థ, కోర్టుకే నిర్ణయాధికారం విడిచిపెట్టడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారిగా చూస్తున్నామని న్యాయవాదవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మరి నిర్ణయాధికారం కోర్టుకే వదిలేసినప్పుడు, జగన్‌పై అన్ని కేసులు పెట్టినప్పుడు కూడా ఇదే సీబీఐ ఈ మాట ఎందుకు చెప్పలేదన్నది తెరపైకి వస్తున్న మరో ప్రశ్న. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై స్పష్టమైన అభిప్రాయం చెప్పాల్సిన సీబీఐ.. దానిపై అసలు పెదవి విప్పలేదంటే, జగన్ కేసుపై సీబీఐకి అంత ఆసక్తి లేదన్నది స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేదా పైస్థాయి నుంచి నిర్దిష్టమైన సూచనల వంటి ఆదేశాలు వచ్చి ఉండకపోవచ్చన్న అభిప్రాయం కూడా న్యాయవాద వర్గాల్లో వ్యక్తమవుతోంది. సహజంగా అయితే జగన్ తన పలుకుబడి వినియోగించడం లేదయినా చెప్పాలి. లేకపోతే తన అధికారం అడ్డుపెట్టుకుని ప్రత్యర్ధులను భయపెడుతున్నారయినా చెప్పాలి. ఈ రెండింటిలో ఏది చెప్పినా సీబీఐకి పోయేదేమీ లేదు. అయితే అసలు తన ముందున్న ఆ రెండు మార్గాల్లో ఏదీ ఎంచుకోకుండా, గోడమీద పిల్లి వాటం ప్రదర్శించడమే విమర్శలకు కారణమవుతోంది.

గతంలో సీబీఐ తనపై కేసులు పెట్టి అరెస్టు చేసిన నేపథ్యంలో.. ‘సీబీఐ యుపిఏ పంజరంలో చిలక’గా జగన్ అభివర్ణించారు. జగన్ కుటుంబసభ్యుల నుంచి వైసీపీ అగ్రనేతలు కూడా సీబీఐని యుపిఏ పంజరంలో చిలకగానే ఆరోపించారు. ఇప్పుడు యుపీఏ స్ధానంలో ఎన్డీఏ ఉన్నందున, జగన్ రాజకీయ ప్రత్యర్ధులు కూడా సీబీఐని ‘ఎన్డీఏ పంజరంలో చిలక’ అంటారేమో చూడాలి. ఏదేమైనా గోడమీద పిల్లివాటం ప్రదర్శించి, చాకచక్యంగా తప్పించుకున్న సీబీఐ తెలివిని అభినందించాల్సిందే. మరి జగన్ కేసుల విషయంలో కూడా సీబీఐ ఇదేవిధంగా న్యాయమూర్తి ఇష్టానికే వదిలేస్తుందా? లేక వాదన కొనసాగిస్తుందా అన్నది చూడాలన్న వ్యాఖ్యలు న్యాయవాద వర్గాల్లో వినిపిస్తున్నాయి.