అవును…ఇంకా తెలంగాణలో యుద్ధం మిగిలే ఉంది!

557

–  ఆత్మగౌరవం కూడా ఉన్నోళ్లకు పరిమితమైంది
– మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా ఆత్మగౌరవం లేకుండా పోయింది.
-చారిత్రక సందర్భాన్ని చేజార్చుకుంటున్న ఈటల
-ఆత్మగౌరవ జెండాను నిలబెట్టాలంటే స్వతంత్ర పార్టీ పెట్టాలి
– నాయకులు పార్టీలు మారితే ప్రజలకు ఒరిగేదేముండదు

కానరాని కరోనా వైరస్ తో తెలంగాణ సమాజం దుర్భరదయనీయ .  జీవనం గడుపుతోంది  రాజ్యంలోని ప్రజలు దుర్భర జీవన స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం, ప్రభుత్వ నాయకత్వం కరోనా సమస్యను అధిగమించడానికి ఐక్యతతో పనిచేయాల్సిన సందర్భంలో.. తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడు, ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి పదవునుండి తొలిగించి,  రాజకీయాలనుండి తప్పించడం వల్ల రాష్ట్రంలో ఉన్న కరోనా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసినట్లు అయింది. కెసిఆర్ తన స్వీయ రాజకీయ ప్రయోజనాలకిచ్చిన ప్రాధాన్యతను,  సామాజిక సమస్యకు ఇవ్వలేదని స్పష్టంగా అర్ధమవుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థిలో కెసిఅర్ తీసుకున్న నిర్ణయాన్ని,  తెలంగాణ సమాజానికి చేసిన ద్రోహంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. కెసిఆర్ నిజస్వరూపం తెలియక తెలంగాణ ఉద్యమ సమయంలో మద్దతునిచ్చామని, ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా బ్రహ్మరథం పట్టి తప్పు చేశామని తెలంగాణ ప్రజలు నేడు బాధపడుతున్నారు. ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో త్యాగాలు, మరెన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో, ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా ఆంధ్ర పాలనలోకన్నా అద్వాన్నమైనాయి. అందుకే తెలంగాణలో “యుద్ధం మిగిలే ఉంది”

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. మా నీళ్లు మాకే, మా భూములు మాకే మా ఉద్యోగాలు మాకే, మా భాష వేరు, మా సంస్కృతి వేరు, మాకు మీకు కలవదంటే కలవదని ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయారు. ఆంధ్ర ప్రాంత  పాలకుల వల్లనే తెలంగాణ ప్రజలు అభివృద్ధికి నోచుకోవడంలేదని.. ఇక్కడి ప్రజలు కట్టే పన్నులతో, ఇక్కడి వనరులతో ఆంధ్ర వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారని నాయకులు చెబితే నమ్మి,  ప్రజలంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నారు. కెసిఅర్ రాజీ ధోరణి చూసిన యువకులు తన బలిదానంతోనైన తెలంగాణ వస్తుందని 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. ఎందరో కేసుల పాలై ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

తుది దశ తెలంగాణ పోరాటం కన్నా ముందునుండే.. తెలంగాణలో భూస్వాములు, దొరలు, జాగీదార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆనాటి సాయుధపోరాటం నుండి నేటి నక్సలైట్ల పోరాటంలో ఎందరో అమరులయ్యారు. తెలంగాణ సాధనలో వీరి త్యాగాలు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయి. ఒక దశలో అధికార కాంగ్రెస్ ను గ్రామాల్లోకి రానివ్వకుండా కట్టడి చేసి తెలంగాణ ఉద్యమానికి, టిఆర్ఎస్ గెలుపుకు నక్సలైట్లు అండగా నిలిచారు. నక్సలైట్లతో చర్చలు జరుపుతామని చెప్పిన కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు పెట్టుకున్న టిఆర్ఎస్.. కేంద్రంలో, రాష్టంలో మంత్రి పదవులు కూడ అనుభవించింది. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ చర్చల పేరుతో నక్సలైట్లను నమ్మించి నయవంచన చేసి, ఎందరినో బూటకపు ఎంకౌంటర్లలో కాల్చి చంపింది. అలా ఎందరో త్యాగాలు చేస్తే ఏర్పడ్డ తెలంగాణలో నేడు పాలన ఫామ్ హౌస్ కు పరిమితమై ప్రజలు అల్లకల్లోలమవుతున్నారు.

తెలంగాణ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించిన పాలకులు మాత్రం గద్దెనిక్కింది గుత్తా నేటి వరకు దోపిడి రాజకీయాల్లో మునిగి, సంపద పోగు చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడి కలబడే వాళ్ళు ఉండకూడదని ఉద్యమాలను అణచివేశారు.  ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులు ఉండకూడదని ప్రతిపక్షాలను కొన్నారు. ప్రజా సంఘాలను, కుల సంఘాలను చీల్చారు. ప్రజల ఓట్ల కోసం ప్రలోభ పెట్టే పథకాలను పెట్టి రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసిన కెసిఅర్ ప్రభుత్వం వాటన్నిటినీ మరచిపోయింది. ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారి, ఫక్తు కుటిల రాజకీయాలు చేసుకుంటూ ప్రజల యోగ క్షేమాలు, విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి మరిచారు. ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలతో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు.

ఉద్యోగాలు రాకుండానే నిరుద్యోగుల వయసు అయిపోయింది. రైతుల మరణాలు ఆగడంలేదు. చేనేతల వలసలు, ఆత్మహత్యలు ఆగలేదు. స్వయం పాలన అంటే అది కెసిఅర్ కుటుంబానికే పరిమితమైంది. ఆత్మగౌరవం కూడా ఉన్నోళ్లకు పరిమితమైంది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా ఆత్మగౌరవం లేకుండా పోయింది. మొదటినుండి తెలంగాణ కోసం పనిచేసిన వారికి అసలే ఆత్మగౌరవం లేకుండా పోయింది.  విద్య అంటే అది సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయింది. వైద్యం అందక కుప్పలు కుప్పలుగా చచ్చిపోతూ, తెలంగాణ ఒక శవాల గడ్డ గా మారి స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం  ప్రభుత్వ ప్రణాళికలు శూన్యం. తెలంగాణ పాలకులకు ఎప్పుడు ఎన్నికల ధ్యాసతోనే జీవిస్తూ  ఏ ఎన్నికల్లో ఎలా గెలవాలి, గెలిచిన ఇతర పార్టీల నాయకులను ఎట్లా కొనాలనే ధ్యాసలోనే నిత్యం మునిగితేలుతున్నారు.   అందుకే ప్రజల బతుకులు మారడానికి, దోపిడీ పాలకుల నుండి విముక్తి జరగాలంటే మరో పోరాటం చేయక తప్పదు. అందుకే “యుద్ధం మిగిలే ఉంది.”

ఎన్ టి ఆర్ చేసిన తప్పు, సోనియా చేసిన తప్పు నేను చేయనని మాట్లాడిన కెసిఆర్.. తను తిరుగులేని నియంతగా కొనసాగుతూ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేసి ప్రజల హక్కుల గురించి, అణచివేత గురించి అడిగేవారు లేకుండా చేసి నియంత పాలన కొనసాగుస్తూ తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కోసం తపన పడుతున్నాడు. నీతిపరులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి తనకే ముప్పు తెచ్చుకున్న ఎన్ టి ఆర్ లాగా నేను చేయనని చెప్పిన కెసిఆర్.. అవినీతిపరులకు, బడా వ్యాపారులకు, భూ కబ్జాదారులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ,వారిని తన గుప్పిట్లో ఉంచుకోవడంలో కెసిఆర్ సఫళీకృతుడయ్యాడు. అంతేకాక ఇతర పార్టీల్లో గెలిచిన వ్యాపార ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకొని, తన పార్టీలోని ఎమ్మెల్యేలు బయటకు పోకుండా రక్షణ  చూసుకొని తను ఆడిందే ఆట పాడిందే పాట గా కొనసాగుతున్నాడు.  సోనియా ప్రధాని పదవి చేపడితే,  తర్వాత కొడుకు రాహుల్ కూడా ప్రధాని అయ్యేవాడని ప్రధాని పదవి వొదులుకొని కొడుకును ఆగం చేసిన సోనియా లాగా నేను చేయనని చెప్పిన కెసిఆర్… కొడుకు కెటిఆర్ ను ఎట్లా ముఖ్యమంత్రి చేయాలనే ధ్యాస తప్ప, కెసిఆర్ కు ప్రజల యోగ క్షేమాలు అసలే పట్టడం లేదు. ఇంతటి దుర్మార్గ పాలనను బాధిత ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరమున్న ఇలాంటి తరుణంలో తెలంగాణలో “యుద్ధం మిగిలే ఉంది”

ప్రజలంతా నియంత పాలన నుండి విముక్తి ఎట్లనా అని తీవ్రంగా ఆలోచిస్తున్న తరుణంలో,  ఈటల ఉదంతం జరిగింది. కెసిఆర్ పాలనలో మోసపోయిన పీడిత ప్రజలంతా ఈటల వైపు ఆశగా చూసారు. వందల సంఘాలు సంఘీభావం పలికాయి. కెసిఆర్ ను ఎదిరిస్తే మేము తోడుంటామని ప్రకటించారు. ఎవరికి వారే స్వచ్చందంగా  వేల వాట్సాప్ గ్రూపులు పెట్టి, లక్షల మంది “ఈటలకు మద్దతుగా మేము సైతం” అంటూ రణభేరి మ్రోగించారు. ఈటల మద్దతు పేరున కేసిఆర్ ను కేసీఆర్ కుటుంబ పాలనను, ప్రభుత్వ నియంత పాలనను దనుమాడారు. తెలంగాణ ద్రోహులకు పెద్ద పీట వేయడాన్ని తీవ్రంగా దూషించారు. అదే సమయంలో ఈటల వైపు ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూసి, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కరోనా మరణాలను సైతం లెక్క చేయకుండా ఈటల కోసం ఎంతో శ్రమ పడ్డారు. ప్రజలు ఈటలకు మద్దతు పలకడం వెనుక ఈటలపై నమ్మకం, అభిమానమే మాత్రమే కాదు. కేసిఆర్ పైనున్న తీవ్ర వ్యతిరేకతతో పాటు నిరుద్యోగ సమస్య, ఉపాధి సమస్య, విద్య వైద్య సమస్య, రైతుల సమస్యలు, కరోనా మరణాలు  తోడైనాయి.

ప్రజలు, ప్రజా సంఘాలు ఒకలాగా ఆలోచిస్తే, ఈటల మరోలాగా ఆలోచించాడు. ప్రస్తుతం రాజకీయాలు, ఎన్నికలు అంటే కోట్ల రూపాయలతో కూడుకున్నవని, ఓటుకు నోటిచ్చిన వారికే ఓట్లు వేసే సంస్కృతిని పాలకులు బాగా పెంచారని, దానికి తోడు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న కెసిఅర్ ను ఎదురుకోవాలంటే, అంతకన్నా పెద్ద అండ కావాలని ఈటల రాజేందర్  ఇతర పార్టీల నాయకులతో చర్చలు జరుపుతూ, ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నాడు. దాంతో ఎప్పటిలాగే తెలంగాణ ప్రజలు నిరుత్సానికి గురైనారు. ఇలాంటి నిరుత్సాహాలు, ఆశ నిరాశాలు, గెలుపు ఓటములు తెలంగాణ ప్రజలకు కొత్తేమి కాదు. ఆనాటి సాయుధ తిరుగుబాటు నుండి నేటి ఈటల ఉదంతం వరకు ఎన్నో సార్లు నిరుత్సాహానికి గురైనారు. ఎన్నో సార్లు పడిలేచి పరుగెత్తి విజయం సాధించారు.

సాయుధ తిరుగుబాటు ద్వారా నిజాం నిరంకుశ పాలనపై విజయం సాధించామనుకునే సమయంలో, కాంగ్రెస్ పార్టీ చేసిన పోలీసు యాక్షన్ తో దొరలు, భూస్వాములు, జమీందార్లు మళ్ళీ గ్రామాలపై పెత్తనం మొదలుపెట్టినప్పుడు, తెలంగాణ ఉద్యమం పేరున గెలిచిన 11 మంది ఎం.పి. లతో పాటు, మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ లో కలిసినప్పుడు,  కాంగ్రెస్ ను ఓడించి టిడిపిని గెలిపిస్తే ఉద్యమకారులను కాల్చి చంపినప్పుడు, రైతు వేషం వేసి రైతు రాజ్యం తెస్తానంటే రాజశేఖర్ రెడ్డిని  గెలిపిస్తే,ఆయన నమ్మించి ఉద్యమాలను అణచివేసిన తీరుపై, సామాజికన్యాయం నినాదంతో చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు, ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవేందర్ గౌడ్ పార్టీని మూసేసినప్పుడు నిరుత్సాహపడుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఎన్ని సార్లు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, పోరాటం చేస్తూనే ఉన్నారు. నేటి స్థితిలో కూడా  నిరుత్సాహానికి గురికాకుండా, ప్రజలకు విముక్తి జరిగే వరకు పోరాటం చేయాలి. అందుకే తెలంగాణ ప్రజలకు “యుద్ధం మిగిలే ఉంది”

తెలంగాణ ప్రజలు ఏక కాలంలో రెండు పోరాటాలు చేయాల్సివుంది. ఒకటి రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగిస్తున్న టిఆర్ఎస్ ను ఎదిరించాలి. రెండవది కొత్త రాజకీయ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలి.  అందుకోసం  “యుద్ధం మిగిలే ఉంది”. విలువలతో కూడిన ప్రజాస్వామిక రాజకీయ నిర్మాణం కోసం, ప్రజలంతా యుద్దానికి సిద్ధం కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకుని అధికార టిఆర్ఎస్ ను ఎదిరించే అవకాశం కనపడడం లేదు. రానున్న 2023 లో బిజెపి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఒక కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం మెండుగా ఉంది.  తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇంకొక ప్రాంతీయ పార్టీ వస్తేనే కెసిఅర్ కు చెక్ పెట్టవచ్చు.

ఇలాంటి అవకాశాన్ని ఈటల జారవిడుచుకోకుండా, రాష్ట్రమంతా తిరిగి పార్టీ నిర్మాణం చేయాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. వేరే పార్టీల్లో ఈటల చేరితే ఒక చారిత్రక సందర్భాన్ని చేజార్చుకోవడమే కాకుండా, చరిత్ర లేని వాడుగా మిగిలిపోతాడు. 14 ఏండ్లు తెలంగాణ ఉద్యమం చేసిన కెసిఆర్, తన నిరంకుశ పాలన వల్ల చరిత్ర హీనుడుగా నిలిచిపోయే అవకాశమున్న తరుణంలో, ఈటల తన చరిత్రను తెలంగాణలో చిరస్థాయిగా నిలిపే చారిత్రిక సందర్భాన్ని చేజార్చుకోకూడదు. దేశాన్ని అమ్ముకుంటున్న మతతత్వ పార్టీలో చేరి, వారికి ఆయుధంగా మారి ఈటల తన రాజకీయ చరిత్రను తానే సమాధి చేసుకోరాదు.

తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర సాధనకు 60 ఏండ్లు పట్టింది. ఊధంగా, ఊధంగా చివరకు కెసిఆర్ ఊదగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ మంట అంటుకోవడానికి ఎంతో శ్రమ చేయాల్సి వచ్చింది. ఎందరో బలిదానాలు చేసుకున్నారు.  నేటి యుద్ధం అంతటి కృషి లేకుండానే అంటుకుంది. రోజులలోనే తెలంగాణ అంతటా అంటుకుందంటే, ఎంతటి ప్రభుత్వ వ్యతిరేకత ఉందో అర్ధమవుతుంది. ఇప్పటి రాజకీయ పరిణామాల్లో  పోరాట చరిత్ర కలిగి, మరో పోరాటానికి నాంది పలికే అవకాశం ఈటలకు మాత్రమే ఉంది. ప్రభుత్వంపై ప్రజలకున్న తీవ్ర వ్యతిరేకతతో తక్కువ శ్రమతో ఈటల చరిత్రలో నిలిచి ప్రజలకు సేవ చేసే అవకాశముంది.

పెట్టుబడి శక్తులు, మనువాద రాజకీయ శక్తులు కెసిఆర్ తో పాటు, ఈటల లాంటి తెలంగాణ ఉద్యమకారులకు కూడా చరిత్ర లేకుండా చేసే కుట్రలు చేస్తున్నారు. మనువాద బిజెపి ఎప్పటినుండో దక్షిణ భారతదేశంలో పాగా వేయాలని, అందుకు తెలంగాణను కేంద్రంగా  చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. బిజెపి ఎదురుచూస్తున్నట్లుగానే వారికి కెసిఅర్ అసమర్ధ నియంత పాలన, ఈటల రాజేందర్ ఉదంతం అందివచ్చిన అవకాశంగా మార్చుకోవాలని చూస్తుంది. అందుకే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రముఖ నాయకులతో చకచకా పావులు కదుపుతున్నారు. నోట్ల రద్దుతో ప్రతిపక్షాలకు డబ్బు దొరకకుండా చేసి, బి.సి లను చీల్చి, బి ఎస్ పి పార్టీ వాళ్ళను భయపెట్టి, తండ్రి కొడుకుల తగవును వాడుకొని ఉత్తరప్రదేశ్ లో బహుజన రాజ్యాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన బిజెపి,  బెంగాల్ లో బద్ధ వ్యతిరేకులైన కమ్యూనిస్టులను సైతం వారి పార్టీలో చేర్చుకొని, మూడు సీట్ల నుండి వంద సీట్లు సాధించగలిగింది.

అలాంటి ఎత్తులు జిత్తులు చేయగల బిజెపి, తెలంగాణలో పాగా వేయాలని చూస్తుంది. బిజెపి ఎదురుచూపుకు కెసిఆర్ కుటిల రాజకీయాలతో పాటు, ఈటల లాంటి నాయకుల సహకారం అందివచ్చిన అవకాశంగా మారనుంది. ఈ పరిణామాలన్ని చూస్తే రానున్న రోజుల్లో కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ఓడిపోవచ్చు, కొంతమంది అవకాశవాద నాయకులు మళ్ళీ పార్టీ మారి లబ్ది పొందవచ్చు, అధికార మార్పిడి జరగవచ్చు. కానీ ప్రజలకు ఒరిగేదేమి లేకపోగా తెలంగాణలో మరింత దారుణ పరిస్థితులు దాపురించబోతున్నాయి. టిఆర్ఎస్ పోయి బిజెపి వస్తే, తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అవుతుంది తప్ప మరోటి కాదు.

కాంగ్రెస్, టిడిపి, కమ్యూనిస్టు పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలోకి వలసలు వెళ్లిన నాయకులు, నేడు అదే బాటలో టిఆర్ఎస్ నుండి ఒక్కరొక్కరుగా బిజెపి లోకి వెళుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి రాజకీయాలు ప్రజలకు ఎలాంటి మేలు చేయవు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే దళారి పెట్టుబడి రాజకీయాల వల్ల, బడా నాయకులు బాగుపడి ప్రజలు మరింత నష్టపోతారు. అందుకే తెలంగాణలో “యుద్ధం మిగిలే ఉంది” .

ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రాజనీతిజ్ఞులు విలువల రాజకీయాల నిర్మాణం చేసేంతవరకు, ఇలాంటి అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతుంటాయని ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత వుంది.
గోసి గొంగడేసి తెలంగాణ పాట పాడిన గద్దరన్న, ఏపూరి సోమన్నలు రైతు వేషమేసి రైతు రాజ్యం తెస్తామంటే నమ్మిన రైతుల భూములు రింగు రోడ్ల పేరున, సెజ్ ల పేరుతో గుంజుకొని మా బతుకులను  మట్టికొట్టావని, శాంతి చర్చలంటే నమ్మి గెలిపిస్తే ఉద్యమకారులను చంపి తెలంగాణను వల్లకాడు చేశావని,  పాటలు పాడి ప్రజలను చైతన్యం చేసిన గడ్డ ఇది. లింగమని నమ్మితే లంగవైనావని ఏకంగా కెసిఅర్ మీద పాట పాడి ఉద్యమాన్ని సరిచేసిన రసమయి బాలకిషన్, మత్తడి దునికి అలుగు ఏరులై పారినట్లు తెలంగాణ ఉద్యమం ఉరకలేస్తుందని  విమలక్క పాటలు పాడి తెలంగాణ “ధూం దాం” లతో ప్రజలను తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల చైతన్యం చేసిన గడ్డ ఇది.

నెత్తురు చుక్క చిమ్మకుండా గాంధేయ మార్గంలో తెలంగాణ సాధిస్తామని ఎప్పుడూ తెలంగాణ ఉద్యమాన్ని రాజీనామాలు, ఎన్నికల చుట్టూ తిప్పుతూ రాజీ ధోరణిలో కొనసాగుతున్న కేసిఆర్ ను, కేశవరావు జాధవ్ లాంటి నాయకులు ప్రశ్నించారు. గాంధేయ మార్గంలో అత్యున్నత పోరాట రూపమైన ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయడం లేదని కెసిఆర్ ను  ప్రశ్నించడమే కాకుండా,  కేశవరావు జాధవ్ నాయకత్వంలో ఇందిరా పార్క్ వద్ద బత్తుల సిద్దేశ్వర్, సాయిని నరేందర్, మోదాల వెంకన్న, గుండా యాదగిరి లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాలుగు రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేయడమే కాకుండా, ఉద్యమం పట్ల చిత్తశుద్ధి ఉంటే కెసిఅర్ ఆమరణ దీక్ష చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేసారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఉద్యోగస్తులు వారి ఉద్యోగాలను కూడా లెక్క చేయకుండా, సకల జనుల సమ్మె చేసి ఉద్యమానికి మద్దతునిచ్చారు.  కుల సంఘాలు, ప్రజా సంఘాలు  పార్టీలకతీతంగా ప్రతి మండలంలో జాక్ లు గా ఏర్పడి ఉద్యమాన్ని ఉదృతం చేశారు.

ఇంతటి ఉద్యమ చరిత్ర కలిగిన తెలంగాణలో, రాజ్యాంగ బద్దంగా ఎన్నో చిక్కులను ఛేదించి తెలంగాణ సాధించుకున్న ప్రజలకు,  నేడు కెసిఆర్ రాజ్యాన్ని కూల్చడం పెద్ద విషయమేమి కాదు. వందలాది మంది మేధావులు, ప్రగతిశీల అభ్యుదయ వాదులు ఈటలకు మద్దతు పలికి ప్రజాస్వామిక తెలంగాణ స్థాపనలో భాగమవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకపాత్ర పోషించిన యోధులు సర్ధార్ సర్వాయి పాపన్న, కొమరం భీమ్, సోయం గంగులు, చాకలి ఐలమ్మ, షేక్ బందగి, బత్తిని మొగిలయ్య గౌడ్, దొడ్డి కొమురయ్య, నల్ల నర్సింహులు, యాదగిరి, టాను నాయక్, ఈశ్వరిబాయి, సదా లక్ష్మి, బెల్లి లలిత, బి.ఎన్ రెడ్డి, మారోజు వీరన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ మద్దికాయల ఓంకార్, కేశవరావు జాధవ్, కె.జి. సత్యమూర్తి, కొల్లూరి చిరంజీవి, బి.ఎస్ వెంకట్రావు, అరిగె రామస్వామి, దర్గ్యా నాయక్, ప్రొఫెసర్ జయశంకర్, బియ్యాల జనార్దన్, బుర్ర రాములు, శ్రీకాంత చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదన్న, భూపతి కృష్ణమూర్తి, సంగంరెడ్డి సత్యనారాయణ, ఆమోస్, కాళోజి, తిప్పని సిద్ధులు, నలిగింటి చంద్రమౌళి, పురుషోత్తమ రావు ల లాంటి వారసులుగా తెలంగాణ ప్రజలు బరిగీసి కొట్లాడి ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకోవడానికి యుద్ధానికి సిద్ధమవ్వాలి.

ఎవరో వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా… అన్నట్లు చిత్తశుద్ధి, అంకితభావం కలిగి ప్రజల పట్ల సేవా దృక్పధంగలవారు, నిజాయితిగల ఉద్యమకారులు, యువకులు, విద్యావంతులు, బుద్ధి జీవులు, రాజనీతిజ్ఞులు త్యాగధనులు యుద్ధానికి సిద్ధం కావాల్సిన చారిత్రక సందర్భం. ఉద్యమ సంస్కారం కలిగిన ప్రజలు ఆనాడు కెసిఆర్ ను విశ్వశించడం తప్పుకాదు. రాష్ట్రంలో నేడు నెలకొన్న ప్రమాదపు పాలనను నివారించాల్సిన గురుతర బాధ్యత కూడా తెలంగాణ సమాజంపైనుంది. పాలనలో ప్రజాస్వామిక సంస్కరణ కోసం,  ప్రజాస్వామిక వర్గాల నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు బలపరచి.. బరిగీసి కొట్లాడాల్సిన నేటి అవసరాన్ని గుర్తుంచాలి. అందుకే .. ఇంకా తెలంగాణలో “యుద్ధం మిగిలే ఉంది”

– సాయిని నరేందర్
9701916091