వై.సి.పి. రెండేళ్ల పాలనలో ప్రజారోగ్యం పడకేసింది

143

* ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వానికి ముందుచూపు లేదు
* విదేశీ పెట్టుబడులు పరిశ్రమలు రావడం లేదు
* ఈ విషయంపై మోహన్ దాస్ పాయ్ మాటలు గుర్తు చేసుకోవాలి
* రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు
* తమిళనాడు సీఎం  స్టాలిన్ ను చూసి నేర్చుకోవాలి
* వర్చువల్ మీడియా సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి  టి.శివ శంకర్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి రెండేళ్ల పాలన… ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ప్రతిపక్షాలను అణిచివేయాలనే నియంతృత్వ ధోరణిలో కొనసాగిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి  టి.శివశంకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ ది లా’ లేకుండాపోయిందని, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి మౌలిక సూత్రాలు వరదలో కొట్టుకుపోయినట్లు కొట్టుకుపోయాయన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. ప్రజలకు జవాబుదారులనే వాస్తవాన్ని విస్మరించి… ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు దిగిందని అన్నారు. ‘జగన్ రెండేళ్ల పాలన… ఏయే రంగాల్లో ప్రభుత్వం అభివృద్ధి సాధించింది’ అనే అంశంపై మంగళవారం మీడియాతో వర్చువల్ సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా  శివశంకర్ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ ఆర్ధికరంగం అప్పులకుప్పగా మారింది. రాష్ట్రం మొత్తం అప్పు రూ. 4.47 లక్షల కోట్లకు చేరింది. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే ప్రభుత్వం దాదాపు రూ.1.6 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక రంగంపై ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో ఈ రోజు రాష్ట్రం అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి ప్రభుత్వ తీరే ప్రధాన కారణం. భారతదేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో మన వాటా కేవలం 0.47 శాతం మాత్రమే అంటే ఇక్కడ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ టెర్రరిజం ఉంది కాబట్టే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని మోహన్ దాస్ పాయ్ ఈ మధ్య మాట్లాడం మనకు తెలిసిన విషయమే. ప్రభుత్వం సంక్షేమాన్నే మాత్రమే నమ్ముకొని మిగిలిన అన్ని రంగాలను విస్మరించడంతో పారిశ్రామిక రంగం కుంటుపడింది. తద్వారా ఉపాధి కల్పన జీరోగా మారింది.
ప్రభుత్వ రెండేళ్ల పాలన గందరగోళంగా సాగింది. మూడు రాజధానుల పేరిట అమరావతి రైతులను రోడ్డున పడేశారు. ఇసుక పాలసీ పేరుతో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. నివాసయోగ్యం కానీ స్థలాలు, అసైన్మెంట్ ల్యాండ్స్ లాక్కొని ఇళ్ల స్థలాలు కేటాయించడం వంటి అనేక గందరగోళ నిర్ణయాలు ఈ రెండేళ్ల కాలంలో జరిగాయి.

ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజారోగ్యం పడకేసింది. ప్రజారోగ్యానికి బడ్జెట్ లో కేవలం ఒక శాతం కంటే తక్కువ కేటాయింపులు చేశారు. కోవిడ్ ఫస్ట్ వేవ్  సమయంలో ఆగస్టులో 9 వేల మంది వైద్య సిబ్బందిని నియమించుకొని డిసెంబర్ నెలలో తీసేశారు. ముందుచూపు లేకుండా వైద్య సిబ్బందిని తొలగించి ఇప్పుడు మళ్లీ నోటిఫికేషన్లు ఇవ్వడం సిగ్గుచేటు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో మొదటి నుంచి ప్రభుత్వం నిర్లిప్త ధోరణినే అవలంభించింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా పోతుంది అన్న మాటలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ముఖ్యమంత్రి మాటలు నమ్మి ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల చాలా కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయాయి.
రాష్ట్రానికి గుండెకాయ వంటి పోలవరం ప్రాజెక్టుపై కూడా ప్రభుత్వం ధోరణి నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వం తీసుకోవాల్సినంత శ్రద్ధ తీసుకోవడం లేదు. పోలవరం ఏపీ ప్రజల హక్కు. దానిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.

రాజ్యాంగ సంస్థలైన ఎలక్షన్ కమిషన్, న్యాయవ్యవస్థలతో ఈ ప్రభుత్వం ఘర్షణాత్మక ధోరణి అవలంభించింది. దీంతో రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంక్షేమ రంగంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం… మిగిలిన రంగాలైన పారిశ్రామిక, ఆర్థిక, ఉపాధి రంగాలను నిర్లక్ష్యం చేసింది. సంక్షేమ రంగం అమలు కూడా లోపభూయిష్టంగా సాగుతోంది. సంక్షేమ పథకాలకు ఎస్సీ,ఎస్టీ, బీసీ కమిషన్ల నుంచి నిధులు మళ్లించి.. ఆ కమిషన్ల వాస్తవ ప్రయోజనాలను దెబ్బ తీస్తోంది. సంక్షేమ పథకాలను కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు ముడిపెట్టి అమలు చేస్తున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చి… ఇప్పుడు దానిపై వచ్చిన సొమ్ముతోనే ప్రభుత్వం నిలబడుతోంది. ఆ సొమ్మునే గ్యారెంటీగా చూపించి అప్పులు కూడా తెచ్చుకోవడం బాధాకరం. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప.. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం లేదు. వాలంటీరు వ్యవస్థను తీసుకొచ్చి.. అందులో 90 శాతం వైసీపీ కార్యకర్తలనే నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లను ఎలా ఉపయోగించుకున్నారో, ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికి తెలిసిన విషయమే. ఇండస్ట్రీయల్ పాలసీకి అతిగతీ లేకపోవడంతో ప్రతి ఏడాది లక్షలాది మంది యువత నిరుద్యోగులుగా మారుతున్నారు.

వ్యాక్సినేషన్ విషయంలో కూడా ప్రభుత్వానికి సరైన అవగాహన లేదు. కేంద్రం వ్యాక్సిన్ పంపిస్తేనే వేస్తాం లేకపోతే లేదు అన్న ధోరణి మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.  వ్యాక్సిన్ కు అవసరమైన రూ. 1600 కోట్లు వెంటనే కేటాయించాలి. అలాగే థర్ట్ వేవ్ కు పౌర కమిటీని వేయాలి. అన్ని రాజకీయ పార్టీలను, ఎన్జీవోలను కలుపుకొని వెళ్లాలి. పక్కరాష్ట్రం అయిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని చూసి ఎలా కలుపుకొని వెళ్లాలో నేర్చుకోవాల”ని అన్నారు.