మూగమనసులభాష్యం..

569

అవసాన దశలో నేను
ఆరంభ దశలో నీవు
అనుభవాలతో నేను
అమాయకత్వంతో నీవు

వడలిన మేనుతో నేను
చిగురాకు కాయంతో నీవు
చదివిన పుస్తకం నేను
తెరవని గ్రంథం నీవు

పుట్టెడు జ్ఞాపకాలతో నేను
తెల్లని కాగితంలా నీవు
బాధ్యతల చెరలో నేను
బంధాల కౌగిట్లో నీవు

పండిపోయిన తలతో నేను
పండు వెన్నెల నవ్వుతో నీవు
బరువైన బంధంగా నేను
ప్రియమైన బాధ్యతగా నీవు

ఊసులు చెప్తూ నేను
ఊ కొడుతూ నీవు
బోసి నవ్వులతో నేను
పాల బుగ్గలతో నీవు

ఆరిపోయే దివ్వె నేను
వెలిగే దీపం నీవు
రాలిపోయే పువ్వు నేను
వికశించే కుసుమం నీవు