ద్వారాకా చేతికి ఆర్టీసీ పగ్గాలు!

247

( మార్తి సుబ్రహ్మణ్యం)

సమర్థుడయిన కొద్దిమంది ఐపిఎస్ అధికారుల్లో ఒకరయిన ద్వారకా తిరుమలరావు చేతికి జగన్ ప్రభుత్వం ఆర్టీసీ పగ్గాలు అప్పగించింది. ప్రస్తుత ఆర్టీసీ ఎండి ఠాకూర్ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో, ఆయన స్థానంలో ద్వారకా తిరుమలరావును ఆర్టీసీ ఎండిగా నియమిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది.  డిజిపి స్థాయి అధికారి అయిన ద్వారకా తిరుమలరావుకు, ఎలాంటి ముద్ర లేని  వివాదరహితుడన్న అధికారిగా పేరుంది. ఆయన పనిచేసిన విభాగాల్లో ఎక్కడా వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించారు.  రైల్వేస్ డీజీగా ఉన్న ఆయన, ప్రస్తుతం ఏపీ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేన్ బాధ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.

సీఐడీ చీఫ్‌గా పనిచేసిన ఆయన కాలంలోనే, తుని అల్లర్ల కేసుపై విచారణ జరిగింది. విజయవాడ నగర కమిషనర్‌గా పనిచేసిన కాలంలో సమర్థవంతంగా వ్యవహరించారన్న పేరుంది. ప్రధానంగా ఫిర్యాదుల విభాగాన్ని పటిష్టపరిచారు. 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా, సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు డొమెస్టిక్ వయిలెన్స్ యాక్ట్-2005 పేరిట ఒక నివేదిక సమర్పించారు. ఆయన విజయవాడ పోలీసు కమిషనర్‌గా చేసినప్పటికీ, ఉమ్మడిరాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గానే చాలామందికి తెలుసు. నిజానికి బెజవాడ కమిషనర్ కంటే, సైబరాబాద్ సీపీగా పనిచేసినప్పుడే ఆయన ఎక్కువ చురుకుగా పనిచేశారన్న పేరుంది.

అప్పటిపభుత్వం ఆయన సమర్థతను గుర్తించే, ఏరికోరి సైబరాబాద్ సీపీ బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలోనే, సైబరాబాద్ కమిషనరేట్ పరిథిలో ఐటి కంపెనీలు తామరతంపరగా ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఆర్టీసీ ఎండీ పగ్గాలందుకున్న ద్వారకా ముందు.. ఆర్టీసీని లాభాల బాటలో నడపించే పెను బాధ్యత పెద్ద సవాలుగా నిలిచింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీం చేయడంతో, సంస్థాగతంగా పెద్దగా సమస్యలు లేనప్పటికీ.. సంస్థను నష్టాల నుంచి బయటవేసి, లాభాల బాట పయనింపచేయడమే ఆయన ముందున్న పెను సవాల్. సహజంగా పాజిటివ్ థింకింగ్, మానవతావాదం  ఉన్న కొద్దిమంది అధికారుల్లో ఆయనొకరయినందున, ఆ సవాల్‌ను అధిగమిస్తారన్న అంచనా ద్వారకా సహచరుల్లో లేకపోలేదు. లాక్‌డౌన్ ఫలితంగా పూర్తిగా నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీని లాభాలబాటలో తీసుకువెళ్లడమే.. ప్రస్తుతం ద్వారాకా ముందున్న పెద్ద సవాల్. ఆల్‌ది బెస్ట్ ద్వారకా సాబ్!