ఈటలకు సొంత ఇలాకాలో మద్దతు కరవు!

641

బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న వలసలు
సొంత పార్టీ పెడితే నే ఉంటామంటున్న మద్దతుదారులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ ఉనికి గందరగోళంలో పడింది. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఈటలకు సొంత ఇలాకాలో మద్దతు కరవవుతోంది. ఆయన బీజేపీలో చేరేలోగా హుజూరాబాద్‌లోని బీజేపీ ప్రతినిధులను కారెక్కించే ఏర్పాట్లను, స్థానిక టీఆర్‌ఎస్ నాయకత్వం ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన 11, 18వ వార్డు కౌన్సిలర్లు, సింగిల్‌విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన సింగిల్‌విండో డైరక్టర్లు ప్రతాప ఆంజనేయులు, దండ భాస్కరరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈటల కమలం కండువా కప్పేసుకునే లోపు ఆ నియోజక వ ర్గంలోని బీజేపీ ప్రముఖులను కారెక్కించే వ్యూహానికి టీఆర్‌ఎస్ పదునుపెడుతోంది.

అటు ఈటలతో మొదటి నుంచి ఉన్న ద్వితీయ స్థాయి నేతలు, మద్దతుదారులకు సైతం ఆయన కమల తీర్థం తీసుకోవడం రుచించడం లేదు. ఈ విషయంలో వారంతా బీజేపీ కంటే కాంగ్రెస్‌లో చేరడమే మంచిదని వాదిస్తున్నారు. అసలు ఈటల ఏ పార్టీలో చేరకుండా సొంత పార్టీ పెట్టాలని ఆయన మద్దతుదారులు, బీసీ సంఘాలు మొదటినుంచీ ఒత్తిడి చేస్తున్నాయి. మాజీ ఎంపి విశ్వేశ్వర్‌రెడ్డి, కోదండరామ్ వంటి నేతలు కూడా ఈటలకు సొంత పార్టీ స్థాపించి, టీఆర్‌ఎస్ వ్యతిరేకవర్గాన్ని ఒక తాటిపైకి తీసుకురావాలని సూచించారు. పోనీ ఏ పార్టీలో చేరకుండా ఇ,డిపెండెంట్‌గా పోటీ చేసినా, ప్రజలు ఆయనైపే ఉంటారని ఆయన మద్దతుదారులు నేరుగా ఈటలకే స్పష్టం చేశారు.

కానీ బీజేపీలో చేరితే కేసీఆర్‌కు భయపడి, ఆస్తుల పరిరక్షణ కోసమే పార్టీ మారారన్న చెడ్డపేరు వస్తుందని స్వయంగా ఈటలకు నచ్చచెప్పినా,  ఫలితం లేకుండా పోయిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. బీజేపీలో చేరితే ఉన్న ఇమేజ్ పోవడంతోపాటు, ఆయన కు ఆ పార్టీలో ఎలాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదని స్పష్టం చేస్తున్నారు. పైగా కేసీఆర్ చాలా విషయాల్లో కేంద్రంలోని బీజేపీతో మద్దతునిస్తున్నారని, భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ సంబంధాలు ఎలా ఉంటాయన్న దానిపై, బీజేపీ నాయకులకే  స్పష్టత లేని పరిస్థితి ఉందని ఈటల మద్దతుదారులు విశ్లేషిస్తున్నారు. ఇంత గందరగోళ పరిస్థితిలో ఈటల బీజేపీలో చేరడం, రాజకీయంగా ఆత్మహత్యాసదృశమే అవుతుందని ఆయన మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు.

అదీకాకుండా టీడీపీ, కాంగ్రెస్ నుంచి చేరిన మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు, చాడ సురేష్‌రెడ్డి, మోత్కుపల్లి నర్శింహులు, పెద్దిరెడ్టి, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి అగ్రనాయకులతో పాటు పలువురు మాజీ అధికారులకు  బీజేపీలో సరైన గుర్తింపు, ఆదరణ లేదని గుర్తు చేస్తున్నారు. అసలు ముందు,  స్థానికంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి వర్గమే ఈటలకు సహకరించకపోవచ్చని చెబుతున్నారు. ఈటల బీజేపీలో చేరితే, ఆయన ఆస్తులయితే రక్షణ ఉంటుందేమోగానీ,  ఇమేజ్ మాత్రం కచ్చితంగా డామేజీ అవుతుందని స్పష్టం చేస్తున్నారు. వామపక్ష విద్యార్ధి రాజకీయాల నుంచి ఎదిగి, ప్రాంతీయ పార్టీలో తనకంటూ సొంత గుర్తింపు సాధించిన ఈటల, బీజేపీ వంటి జాతీయ పార్టీలో ఇమడటం చాలా కష్టమని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు. పైగా జిల్లాలో బీజేపీకి పెద్దగా బలం కూడా లేదని, బలం లేని పార్టీలో చేరి తమ రాజకీయ మనుగడ దెబ్బతీసుకోవడం తమకు ఇష్టం లేదని ఈటల మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు.

రాజీనామానా? రణమా?
అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో నేరుగా చేరి ఆ పార్టీ కండువా కప్పుకోవడమా? లేక  రాజీనామా చేయకుండానే బీజేపీ నేతగా కొనసాగి కేసీఆర్ సర్కారుపై యుద్ధం సాగించాలా?  అన్న అంశంపై ఈటల రాజకీయ,సాంకేతిక సందిగ్థంలో పడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. బీజేపీ కండువా కప్పేసుకుంటే, ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిని చేసే ప్రక్రియను టీఆర్‌ఎస్ వేగవంతం చేస్తుంది. పోనీ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తే, శాసనపరమైన హక్కులు కోల్పోతాయి. మళ్లీ ఆరునెలల్లోగా జరిగే ఎన్నికల వరకూ నియోజకవర్గంపైనే పూర్తి స్థాయి దృష్టి సారించాలి. ఇప్పుడు అన్ని పార్టీలు, సంస్థల నుంచి వస్తున్న మద్దతు ఆ ఎన్నికల్లో లభించదు. ఒకవేళ రాజీనామా చేయకుండా శాసనసభలో బీజేపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలతో కలసి, ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి కూడికలు-తీసివేతలు, రాజకీయ సైద్ధాంతిక, సాంకేతిక సంకటంలో ఈటల ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే.. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి రావాలని ఢిల్లీ నేతలు షరతు విధించినట్లు చెబుతున్నారు.