ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన ద్వారకా తిరుమలరావు

396

విజయవాడ: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఎండీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎండీకి అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రజలకు ఆర్టీసీ ద్వారా మరింత  మెరుగైన రవాణా సేవలు అందిస్తానని తెలిపారు. కోవిడ్ తో విపత్కర పరిస్థితిల్లోనూ  ఆర్టీసీ సిబ్బంది  సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని ద్వారకా తిరుమలరావు అభినందించారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం ద్వారకా తిరుమలరావు ఇలా మాట్లాడారు. ‘‘ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నన్ను నియమించినందుకు చాలా సంతోషపడుతున్నా. ప్రభుత్వం నాపై గురుతర బాధ్యతలు అప్పగించింది. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తా. ఆర్టీసీ ఆర్థిక  స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేస్తా. ఆర్టీసీని లాభాల బాటలో  నడిపేందుకు  నా వంతు ప్రయత్నాలు చేస్తా. దీనికోసం  తగిన ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తా. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రయత్నిస్తా’ అని ద్వారకా తిరుమలరావు తెలిపారు.