అప్పులు… అవినీతిలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపారు

506

• 730 రోజుల పాలనలో 73 లక్షల కుటుంబాలకు ఉపాధి దూరం చేశారు
• సంక్షేమ పథకాల ముసుగులో ప్రజల్ని మాయ చేస్తున్నారు
• రెండేళ్లలో రూ. రెండు లక్షల కోట్లు అప్పులు… దుబారా ఖర్చులో దోపిడీలు
• దశలవారీ మద్య నిషేధం అన్నారు… మద్యం రాబడి మీదే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు
• కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టారు… రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదు
• వైసీపీ రెండేళ్ల పాలనపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

వైసీపీ ప్రభుత్వం తన రెండేళ్ల పాలనలో సాధించింది ఏమిటీ అంటే – అప్పులు చేయడం, అవినీతికి పాల్పడడంలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ముసుగులో ప్రజల్ని మాయ చేశారన్నారు. 730 రోజుల పాలనలో 73 లక్షల మంది సామాన్యులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారని తెలిపారు. జగన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే ఇసుక కొరత సృష్టించి 40 లక్షల మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు… ఆ సమస్య ఇప్పటికీ అలాగే ఉంది అన్నారు. ఆదివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో వైఫల్యాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా   పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “జగన్ రెడ్డి  రెండేళ్ల పాలన గురించి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేశామని చెబుతున్నారు. దమ్ముంటే రెండేళ్ల పాలనలో అడుగడుగునా మీ ప్రభుత్వ వైఫల్యాలపై కూడా మాట్లాడండి. అవినీతితో కూడిన పాలన, రెండు సంవత్సరాల్లో రెండు లక్షల కోట్ల రూపాయిలు అప్పులు చేశారు. దుబారా ఖర్చులు చేసి లక్ష కోట్ల రూపాయిలు దోచుకున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రం మొత్తం పాలన అస్తవ్యస్తంగా తయారయ్యింది. అభివృద్ధి అటకెక్కింది. మీ పాలన ఉదయించే సూర్యుడి మాదిరి లేదు అస్తమించడానికి సిద్ధంగా ఉన్న సూర్యుడిలా ఉంది. రాష్ట్రంలో ఏ మూలనైనా అభివృద్ది  జరుగుతోందా? నిరుద్యోగులకు ఏ మూలనన్నా ఉద్యోగాలు దొరుకుతున్నాయా? వీటన్నింటి గురించి వైసీపీ నాయకులు మాట్లాడరేం.

• ఇసుక… మట్టి దోచేస్తున్నారు
రైతుల రుణమాఫీ గురించి డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణ మాఫీ గురించ ఎందుకు మాట్లాడరు. 730 రోజుల మీ పాలనలో 73 లక్షల మందికి పైగా ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయిన మాట వాస్తవం కాదా. ఇసుక కొరతతో 40 లక్షల పైచిలుకు కుటుంబాలు ఉపాధికి దూరమయ్యాయి. వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి ఇసుక, మట్టి దోపిడీ సాగుతోంది. పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక అభివృద్ధి అట్టడుగుకు చేరింది. రాష్ట్రం నుంచి సుమారు లక్షా 50 వేల కోట్ల రూపాయిల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. మీ పాలనలో ఒక్క పరిశ్రమ వచ్చింది లేదు. రాష్ట్రంలో సుమారు 32 లక్షల మంది పైగా నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. దీని మీద వైసీపీ నాయకులు స్పందించాలి.

• రాజధాని లేకుండా చేశారు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని ఒక్క వైసీపీ నేత అయినా మాట్లాడుతున్నారా? పోలవరం ప్రాజెక్టుకు తగ్గించిన అంచనాలతో కేంద్రం కేటాయింపులు చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు. రాష్ట్రానికి రాజధాని ఎక్కడుందో తెలియని గందరగోళ పరిస్థితి సృష్టించిన మీ పాలన గొప్పది ఎలా అనిపించుకుంటుంది. దశలవారీ మద్య నిషేధం అని చెప్పారు. రాష్ట్రం మొత్తం మద్యం ఏరులైపారిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మద్యం ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదా?
నవరత్నాలు పేరు చేపట్టి ఫించన్ తీసుకోవాలంటే నిబంధనలు, ఇళ్ల పట్టాల విషయంలో నిబంధనలు అంటూ అర్హులయిన పేదవారిని పక్కన పెట్టేశారు. తెల్ల కార్డులు రద్దు చేశారు. నిబంధనల పేరిట ప్రతి పథకంలో కోతలు విధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల మీద సామాన్యుడు స్పందించినా ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. కేసులు పెట్టి వేధిస్తోంది. వైసీపీ 151 మంది ఎమ్మెల్యేల బలం ప్రజా క్షేత్రంలో ఆవిరైపోయే రోజులు దగ్గర పడ్డాయనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? ఒక వ్యక్తి స్పందిస్తే ప్రభుత్వం వణికిపోతోంది. మీ పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్ధం కావడానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలి?

• దేవతా విగ్రహాలకు అపచారం
రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దేవాలయాల మీద దాడులు జరిగాయి. దేవతా విగ్రహాలను పడగొట్టారు. రథాలు దగ్దం చేశారు. ఇప్పటి వరకు ఒక్క కేసులో అయినా పురోగతి ఉందా దర్యాప్తు చేసి నింధితుల్ని శిక్షించిన సందర్భం ఉందా. దాని గురించి వైసీపీ నాయకులు మాట్లాడరేం.
ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాలు బయటపెడుతున్నారంటే ప్రకృతి వెంటనే స్పందిస్తుంది. విశాఖపట్నం వెళ్దామంటే గ్యాస్ లీక్ అయ్యింది. నాగార్జునసాగర్ వెళ్దామంటే టర్బైన్లు పేలిపోయాయి. అమ్మవారి గుడికి వద్దామంటే కొండరాళ్లు కూలిపోయాయి. ప్రజలు స్పందించకున్నా ప్రకృతి మాత్రం జగన్ రెడ్డి గారి కదలికల్ని నియంత్రిస్తోంది. ఆ విషయం తెలిసే ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాలు బయటపెట్టకుండా పాలన సాగిస్తున్న మాట వాస్తవం కాదా.

• కరోనా నియంత్రణలో చేతులెత్తేశారు
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు ఇష్టానుసారం దోపిడికి పాల్పడుతున్నారు. ఒక మంత్రి బెంజికార్లు కొంటే ఇంకో మంత్రి వాల్వోలు కొంటారు, మరో మంత్రి కియా కార్లు తీస్తారు. ఇవన్నీ వాస్తవాలు కాదా. ఒకరు పేకాట క్లబ్బులు నడుపుతారు. ఇంకొకరు దేవాలయాల మీద పడి దోచుకుంటారు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలంతా పేదల ఇళ్ల పట్టాల ముసుగులో పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఇసుక అక్రమ తరలింపులో వైసీపీ భాగస్వామ్యం లేదా? అడుగడుగునా మీ పార్టీ నేతల అవినీతి నిజం కాదా. దీనిపై ఏ ఒక్కరూ ఎందుకు స్పందించడం లేదని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం.

మీ పాలనలో బీసీ, ఎస్సీ, ముస్లిం మైనారిటీలు ఇలా అన్ని వర్గాల దాడులు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించగలిగారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పిన విషయం వాస్తవం కాదా? రాష్ట్ర డీజీపీ, సీఎస్ కోర్టు మెట్లెక్కిన మాట వాస్తవం కాదా? కరోనా ఉదృతిని నియంత్రించలేక ప్రభుత్వం చేతులెత్తేసిన మాట వాస్తవం కాదా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేక, ఆక్సిజన్ సరఫరాపై శ్రద్ధపెట్టకుండా రోగులను అగచాట్ల పాలయ్యేలా చేశారు. తిరుపతి రుయాలో ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోతే తప్పుడు లెక్కలు చెప్పారు.  మీ వైఫల్యాలన్నింటినీ పక్కదారి పట్టించడానికి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. మీ పరిపాలనలో ఏ ఒక్క వర్గానికి అండగా నిలిచింది లేదు. అభివృద్ధి పూర్తిగా అటకెక్కించేశారు.

సంక్షేమ పథకాల ముసుగులో ప్రజల్ని ఎల్లకాలం మోసగించలేరు. మీకు మిగిలిన మూడేళ్లలో పాలన తీరు మార్చుకోవాలి. అవినీతి, అన్యాయం, అక్రమాలను నియంత్రించాలి. రాజధాని అమరావతినే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది. మీ పాలనకు మాయని మచ్చలా మిగిలిపోతుందని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.

• ప్రజల పక్షాన నిలబడుతున్న అసలైన ప్రతిపక్షం జనసేన
రాష్ట్రంలో ప్రతిపక్షం ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ మాత్రమే. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద మా పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  స్పందిస్తూనే ఉన్నారు. ప్రజల కోసం నిత్యం  పోరాడుతూనే ఉన్నారు. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గుర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయనకు అండగా నిలబడాలి. ఇసుక పాలసీ వ్యవహారంలో గానీ, నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి అండగా నిలచిన వ్యవహారంలో గానీ, రైతుల మద్దతు ధర, రాజధాని అమరావతి కోసం, ప్రజారోగ్యం విషయంలో, మాతృభాష వ్యవహారంలో నిరంతరం స్పందిస్తున్న ఏకైక నాయకుడు   పవన్ కళ్యాణ్ . ప్రజలంతా ఆయనకు అండగా నిలబడి ఈ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని కోరుతున్నాం” అన్నారు.