ఎక్కువ భూమిని చూపిస్తే మేము ముక్కు నేలకు రాస్తాము:జమునా రెడ్డి

379

హైదరాబాద్: తెలంగాణలో ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం రాష్ట్రంలో హీట్ పుట్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈటల భార్య జమునా రెడ్డి స్పందించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మేము ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. బడుగు బలహీన వర్గాల 100 ఎకరాల భూములు కాజేశామని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాసాయిపేటలో మోడ్రన్ హ్యాచరీస్ పెట్టాలని 46 ఎకరాలు కొనుగోలు చేశామని తెలిపారు. 46 ఎకరాల కంటే ఎక్కువ భూమిని చూపిస్తే మేము ముక్కు నేలకు రాస్తాము.. లేకుంటే అధికారులు ముక్కు నేలకు రాస్తారా.. అని సవాల్ విసిరారు. ప్రభుత్వమే ఇలా చేస్తే పేద ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని విమర్శించారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలబడవు.. ఏదో ఒక రోజు నిజాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేము ఆస్తులు అమ్ముకున్నామని తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనేందుకేనా ఉద్యమంలో పాల్గొన్నది అని ఆవేదన వ్యక్తం చేశారు.
నమస్తే తెలంగాణ పత్రిక బిల్డింగ్ కట్టేందుకు మా భూమిని బ్యాంకులో (భూ కబ్జా వ్యవహారంలో ఉన్న భూమి) తనఖా పెట్టి డబ్బులు ఇప్పించింది మేము కాదా అని కేసీఆర్ ను జమున ప్రశ్నించారు. అలాంటిది ఆ పత్రిక ఇప్పుడు మా మీదనే తప్పడు ప్రచారాలు చేస్తూ వార్తలు రాస్తున్నదని ఫైర్ అయ్యారు.