రెండేళ్లలో మెరుపులెన్నో…మరకలన్ని!

690

– బాబు బాటలోనే జగన్
– పార్టీని మరిచి ప్రభుత్వానికే పరిమితం
– అపాయింట్‌మెంట్లపై మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీల అసంతృప్తి
– కక్ష సాధింపులు నచ్చని విద్యాధికులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

సుదీర్ఘ పాదయాత్ర.. నాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం.. వీటికి మించి బృహస్పతి వంటి ప్రశాంత్‌కిశోర్ వ్యూహం.. అన్నీ కలగలసి వైఎస్సార్‌సీపీ దళపతి వైఎస్ జగ న్మోహన్‌రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా అవతరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన నవర త్నాల హామీతోపాటు..  ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానన్న హామీ కూడా ఇచ్చారు. ఇంకో 30 ఏళ్లపాటు తానే సీఎంగా ఉండటంతో పాటు, తాను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన ఫొటో ఉండాలని కోరుకుంటున్నానన్న కోరిక కూడా వ్యక్తీకరించిన యువనేత జగన్!  కులం చూడ ం. మతం చూడం. ప్రాంతం చూడం. అందరికీ న్యాయం చేస్తాం. అని ఎన్నికల ముందు ఆయనిచ్చిన హామీపై సొంత పార్టీ నేతలు, శ్రేణులు ఏమంటున్నారు? పార్టీకి సంబంధించి జగన్ కూడా బాబు బాటలోనే నడుస్తున్నారా? తండ్రి బాటకు భిన్నంగా వెళుతున్నారా? లేక తనదైన శైలిలో పయనిస్తున్నారా? పార్టీకి-ప్రభుత్వానికి విభజనరేఖ కలసి వెళుతుందా? లే క రెండూ భిన్న ధృవాలుగా పయనిస్తున్నాయా? అసలు ఆ విభజనరేఖనే చెరిగిపోయిందా? పార్టీని ఆ నలుగురికే వదిలేశారా? ఈ రెండేళ్ల జగన్ పాలనపై వారి మనోగతం ఇది.  ఇది కూడా చదవండి.. ఏపీలో.. ఏం జరుగుతోంది?

151 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని విజయదరహాసంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జగన్ సాధించిన విజయం అపూర్వం, అనన్యం, అనితర సాధ్యం. కానీ తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన పార్టీని పట్టించుకోవడం లేదన్నది కార్యకర్తల ఆవేదన. వాదన కూడా. ఈ విషయంలో తమ నేత అచ్చం చంద్రబాబునాయుడు దారిలోనే వెళుతున్నారన్నది, పార్టీ వర్గాల్లో వినిపించే బహిరంగచర్చ. ఈ రెండేళ్ల కాలంలో పార్టీ అత్యున్నత విధాయక నిర్ణాయకమమయిన  పొలిటికల్ ఎడ్వయిజరీ కమిటీగానీ, ప్లీనరీ గానీ జరిగిన దాఖలాలు లేవంటున్నారు. కీలకమైన నిర్ణయాల సమయంలో కూడా జగన్ తమ అభిప్రాయాలు తెలుసుకోవడం లేదని సీనియర్లు సైతం పెదవి విరుస్తున్నారు. గతంలో కేసీఆర్ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన దాఖలాలు లేవని, తమ నేత కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నారని వైసీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. కనీసం కేసీఆర్ అప్పుడప్పుడయినా మంత్రులు, ఎంపీలను పిలిపించుకుని మాట్లాడతారు గానీ, తమ నేత అది కూడా చేయడం లేదని ఓ ఎమ్మెల్యే వాపోయారు.

ఈ విషయంలో చంద్రబాబునాయుడు కనీసం ప్రజాస్వామ్యయుతంగా ఉన్నట్లు కనిపించేవారని, తమ నేత అది కూడా చేయడం లేదని సీనియర్లు వాపోతున్నారు. చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ పార్టీని విస్మరించి, ప్రభుత్వానికే పరిమితమయ్యారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు జగన్ మాదిరిగా ఎమ్మెల్యేలు, ఎంపీల, సీనియర్లతో వన్‌టువన్ మాట్లాడకపోయినా.. వెళ్లే సమయంలోనో, వచ్చే సమయంలోనో మాట్లాడే వారని, టీడీపీ నుంచి వైసీపీలో చే రిన ఓ మాజీ మంత్రి గుర్తు చేశారు. కానీ జగన్ అది కూడా పాటించడం లేదని, మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమవుతుందంటే, తమ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగన్ నియమించిన సమన్వయకర్తల్లో వైవి సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మినహాయించి, మిగిలిన వారిని కలవడం కష్టమయిపోరతందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకున్న ఎంపి విజయసాయిరెడ్డి నిత్యం బిజీగా ఉంటారని, ఆయనకు ఢిల్లీలో కూడా బాధ్యతలు ఉండటంతో ఎక్కువగా సమయం కేటాయించకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని ఎక్కువగా కలిసే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని అంశాల్లో ఆయన సిఫార్సులు కూడా పనిచేయడం లేదన్న వ్య్యాఖ్యలు కూడా వినిపించకపోలేదు.  150 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటివరకూ జగన్‌కు సగంలో సగం మంది కూడా వన్‌టు వన్ కలిసిన దాఖలాలు లేవన్న ప్రచారం, పార్టీ వర్గాల్లో చాలాకాలం నుంచి జరుగుతోంది. నలుగురిని పార్టీ సమన్వయకర్తలుగా నియమించినందుకే తమకు ఈ సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్ క్యాంపు ఆఫీసుకు వచ్చినప్పటికీ, వారికి ఆయన దర్శనం లభించడం దుర్లభమన్న అభిప్రాయం పార్టీలో బలంగా నాటుకుపోయింది. ఎమ్మెల్యేలు ఎంత సీనియర్లయినా.. సీఎంఓ అధికారులయిన ధనుంజయరెడ్డి లేదా ప్రవీణ్‌ప్రకాష్‌కే తమ కష్టాలు మొరపెట్టుకోవలసి వస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసమే, ఎక్కువగా క్యాంపు ఆఫీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యవహారాన్ని సీఎంఓ అడిషనల్ సెక్రటరీ ధనుంజయరెడ్డికే సీఎం అప్పగించారు. పైగా జగన్ తన ప్రాధాన్యతాపరమైన కీలక శాఖలు కూడా ఆయనకే అప్పగించడంతో, సీఎంఓలో ధనుంజయరెడ్డిపైనే ఎక్కువ పనిభారం కనిపిస్తోంది.

ఇప్పటివరకూ సీఎం జగన్ బయటకు రాకుండా తాడేపల్లి నుంచే వ్యవహారాలు చక్కదిద్దుతున్నప్పటికీ, కేంద్రంతో సత్సంబంధాలు నిర్వహిస్తుండటం ప్రస్తావనార్హం. కరోనా కష్టకాలంలో బీజేపీపై దేశవ్యాప్తంగా  వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో.. చత్తీస్‌గఢ్ సీఎం చేసిన ట్వీట్‌ను ఖండిస్తూ, మోదీకి వెనుకేసుకువచ్చిన జగన్ వైఖరి పార్టీలో చాలామందికి నచ్చలేదు. కేంద్రం కూడా తెలంగాణతో పోలిస్తే ఏపీకే ఎక్కువ సాయం చేస్తోంది. బహుశా ఇలాంటి లాభాలున్నందుకే జగన్, మోదీకి జైకొడుతున్నారన్న అభిప్రాయం లేకపోలేదు. ఇదికూడా చదవండి.. మెరుపులే కాదు… మరకలూ భరించాలి!

ఇక ఈ రెండేళ్లలో జగన్ సీఎంగా ఎన్ని ప్రశంసలు అందుకున్నారో.. అదే స్థాయిలో విమర్శలూ, ఆరోపణలూ ఎదుర్కొంటున్నారు. సంక్షేమం పేరుతో అనేక వర్గాల ప్రజలకు నేరుగా డబ్బులు వస్తున్నందున, ఆ వర్గాలు సానుకూలంగానే ఉన్నాయి. అవినీతి గతంలో కంటే చాలా తగ్గిందన్న భావన కూడా లేకపోలేదు. వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత, తమ సమస్యలు చాలావరకూ పరిష్కారమవుతున్నాయన్న భావన జనంలో ఉంది. ఒకరకంగా జగన్ సర్కారుకు వాలంటీర్లే పెద్ద బలంగా కనిపిస్తోంది. ప్రధానంగా పాఠశాల పరిస్థితి, గతంలో కంటే ఎన్నో రెట్లు మెరుగుపడ్డాయన్న భావన అందరిలోనూ ఉంది. గత ప్రభుత్వంలో అధికారులు మీటింగుల పేరుతో అందుబాటులో ఉండేవారు కాదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు.

అయితే తటస్థ వర్గాలు మాత్రం వ్యతిరేక భావనతో కనిపిస్తున్నాయి. వీరిలో విద్యావంతులతోపాటు, అగ్రకులాల వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే ఎక్కువ లబ్థి చేకూరుతోందన్న భావన,  వైసీపీకి ఓట్లేసిన అగ్రకులాల్లోనూ కనిపించడం ప్రస్తావనార్హం. గ్రామాలను శాసించే రెడ్డి వర్గంలో ఈ అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక తొలి నుంచీ వర్గ రాజకీయ నేపథ్యంలో టీడీపీని రాజకీయంగా, స్థానిక వర్గరాజకీయ కోణంలో  వ్యతిరేకించే కమ్మవర్గానికి చెందిన నాయకులు.. తమ వర్గాన్ని కావాలనే జగన్ అణగదొక్కుతున్నారన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తోంది. వీరు ప్రస్తుతం అసంతృప్తితో, మరో ప్రత్యామ్నాయం లేక వైసీపీలో కొనసాగుతున్నట్లు అర్ధమవుతోంది.
రాష్ట్రంలో గత రెండేళ్ల నుంచి విచ్చలవిడితనం, అధికార దుర్వినియోగం పెరిగిందని మధ్యతరగతి, విద్యావంతులు భావిస్తున్న పరిస్థితి.

ప్రధానంగా పోలీసుల పనితీరు మితిమీరిన స్థాయికి చేరిందని, రూల్  ఆఫ్ లా లేదన్న హైకోర్టు వ్యాఖ్యలు కూడా వారి పనితీరును స్పష్టం చేస్తున్నాయి. కక్ష సాధింపు చర్యలు పెరిగాయని, పరిపాలనలో కేవలం రెడ్లకే అగ్రతాంబూలం దక్కుతోందన్న భావన మిలిగిన   వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రతి పోస్టింగుల్లోనూ వారికే పెద్దపీట వేస్తున్నారన్న అసంతృప్తి మిగిలిన కులాల్లో కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు సరిగ్గా ఇలాంటి భావనే కమ్మ వర్గంపై మిగిలిన కులాల్లో కనిపించింది. దానిని ప్రముఖంగా ప్రస్తావించి, రెచ్చగొట్టింది కూడా వైసీపీనే. ఇప్పుడు అది రెడ్డి సామాజికవర్గానికి బదిలీ అయినట్లు కనిపిస్తోంది.
హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జగన్  ప్రభుత్వం తిన్నన్ని ఎదురుదెబ్బలు గతంలో ఏ ప్రభుత్వమూ తినకపోవడం బట్టి, తమ నేత ఎంచుకున్న న్యాయవాదులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో స్పష్టమవుతోందని వైసీపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక్క రూపాయి జీతం తీసుకుని అందరికీ ఆదర్శంగా ఉన్న జగన్, కోర్టు వాదనల పేరుతో కోట్లాదిరూపాయల దుర్వినియోగం జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

ఇక చంద్రబాబు మాదిరిగానే జగన్ కూడా పార్టీ నాయకులను విస్మరించి, అధికారులకు పెద్దపీట వేస్తున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జగన్ బలహీనతను, ఉత్తరాది అధికారుల లాబీ బాగా వాడుకుంటోందని సీనియర్ నేతలు చెబుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్ర బేరసారాలు ఆడారంటూ ఎంపి విజయసాయిరెడ్డి అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత విచిత్రంగా.. ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు వేసి, కొద్దికాలం తరాత సతీష్‌చంద్రకు కీలక పోస్టింగ్ ఇవ్వడం వెనుక సీఎంఓలో చక్రం తిప్పుతున్న ఓ ఉత్తరాది అధికారి ఉన్నారని పార్టీ నేతలే చెబుతున్నారు.

బాబు సీఎంగా ఉన్న సమయంలో పరిశ్రమ శాఖలో అవినీతి జరుగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ సన్నిహితుడైన కార్తికేయ మిశ్రాకు ఆ శాఖలో పోస్టింగ్ ఇచ్చారని వైసీపీ సొంత మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు అదే లోకేష్ మిత్రుడయిన కార్తికేయమిశ్రాకు కీలకమైన కలెక్టర్ పోస్టింగు రావడానికి, బాబు హయాంలో టీటీడీ ఈఓగా ఉన్న సింఘాల్‌కు ఇప్పుడు మరో కీలకమైన పోస్టింగ్ రావడానికి కారణం,  సీఎంఓలో ఉన్న ఉత్తరాదికి చెందిన అధికారేనని వైసీపీలో బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఉత్తరాదికి చెందిన అధికారులకు మంచి పోస్టింగులు దక్కుతున్నాయన్న అసంతృప్తి తెలుగు అధికారుల్లో బలంగా నాటుకుపోయింది. బాబు హయాంలో ఒక్కసారి కూడా కలెక్టరు కాని వారు వివిధ హోదాల్లో రిటైరయిపోగా, జగన్ కూడా అదే విధానం పాటిస్తున్నారన్న విమర్శ లేకపోలేదు. ఇక ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు విలువ లేదన్న భావన,  ఆలిండియా ఐఏఎస్ సంఘం వరకూ విస్తరించింది.

టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపి రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్, కేంద్రమాజీ మంత్రి అశోక్‌గజపతి రాజును సింహాచలం ట్రస్ట్ నుంచి తొలగించడం, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్, ఒక కులానికి చెందిన వారికి పోస్టింగులివ్వకపోవడం, డాక్టర్ సుధాకర్‌పై దాడి వంటి అంశాల్లో జగన్ ప్రభుత్వం ప్రత్యర్ధులపై కక్ష సాధిస్తోందన్న భావనకు కారణమయింది. రాజధాని అమరావతి అంశంపై జగన్ వైఖరిని సమర్థించినట్లు.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రుజువుచేసినందున, దానిపై విపక్షాల  విమర్శలను ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇసుక విధానం మరింత సరళీకృతం చేయాలన్న అభిప్రాయం సొంత పార్టీలోనూ వ్యక్తమవుతోంది. అయితే… గత చంద్రబాబు సర్కారు పెండింగ్‌లో పెట్టిన వేల కోట్ల రూపాయల బిల్లులను, తమ ప్రభుత్వం క్లియర్ చేస్తున్నందునే అప్పుల భారం పెరిగిందన్న విషయాన్ని మంత్రులు చెప్పడంలో విఫలమయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇక ఇతర పార్టీల నుంచి చేరిన కీలక నేతలకు పార్టీలో కనీస గౌరవం లేదన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఏదో తమ అవసరం కోసం చేరడం తప్ప, రాజకీయంగా ఎలాంటి గుర్తింపు లేదని, అసలు తమ సమస్య ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు. గతంలో తమకు ఇంత దయనీయ పరిస్థితి లేదని గుర్తు చేస్తున్నారు. మంత్రులుగా పనిచేసిన వారు, అవసార్ధమే పార్టీలో కొనసాగవలసి వస్తోందని చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి కూడా దాదాపు అంతే ఉంది. తమకు సీఎం అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమవుతోందని దాదాపు ప్రతి ఎమ్మెల్యే వాపోయే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాల్లో కలెక్టర్లు తమ మాట వినడం లేదని, లోకల్‌గా పోస్టింగుల వరకూ తమ సిఫార్సులు చెల్లుబాటవుతున్నాయని చెబుతున్నారు.

ఇక ఈ రెండేళ్లలో ఒక్కసారి కూడా జగన్ మీడియాతో ముచ్చటించిన దాఖలాలు లేవు. విజయవాడలో ఉన్న జర్నలిస్టులంతా, చంద్రబాబు మనుషులేనన్న దురభిప్రాయమే దానికి కారణంగా అర్ధమవుతోంది. నిజానికి జర్నలిస్టులు గౌరవాన్నే కోరుకుంటారు. అది దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న  చంద్రబాబు దగ్గర కనిపించేది. ఇప్పుడు జగన్‌లో అది కనిపించడం లేదని భావించవచ్చు. దురదృష్టవశాత్తూ ఈ వ్యవహారం చూసే పబ్లిక్ రిలేషన్ వర్గాలు కూడా జగన్‌కు నచ్చచెప్పకపోవడం.. వారు కూడా పార్టీ కోణంలోనే ఆలోచించడం విచారకరం. విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు తరచూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆ విధానమే లేదు. బహుశా తనకూ ఓ సొంత మీడియా ఉన్నందున, మిగిలిన మీడియా సంస్థల అవసరం తనకు లేదన్న భావన కూడా దానికి కారణం కావచ్చు. ఇక బాబు సీఎంగా ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతికే సింహభాగం ప్రకటనలిచ్చారని విమర్శించిన జగన్ మీడియా.. ఇప్పుడు తానూ అదే దారిలో పయనిస్తోంది. జగన్ విపక్షంలో ఉండగా, టీడీపీపై పోస్టింగులు పెట్టింగులు పెట్టిన వారిపై కేసులు పెట్టినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించడం నేరమా అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అదే పని టీడీపీ చేస్తుంటే మాత్రం రాష్ట్ర సరిహద్దులు దాటి, పోస్టింగులు పెట్టిన వారిని అరెస్టు చేస్తోంది. ఇదొక విచిత్రం!

మొత్తానికి పాలనాపరంగా ప్రజలపై విశాల హృదయం, మానవతాకోణం ప్రదర్శిస్తున్న జగన్ రెండేళ్ల పాలనలో, పార్టీ యంత్రాంగం మాత్రం అసంతృప్తితో కనిపిస్తోంది. ప్రభుత్వం-పార్టీని ప్రజాస్వామ్యయుతంగా కాకుండా, ఓనర్‌షిప్‌తో నడిపిస్తున్నారన్న భావన నెలకొంది. వైఎస్‌తో పనిచేసిన వారు సైతం జగన్ వైఖరిపై పెద వి విరుస్తున్నారు. తమ జిల్లాకు సంబంధించిన వ్యవహారాల్లో వైఎస్ తమ అభిప్రాయం అడిగేవారని, ఇప్పుడు జగన్  అసలు తమను సంప్రదించడమే మానేశారని ఓ సీనియర్ మంత్రి వాపోయారు. వైఎస్‌కూ- జగన్‌కూ ఇలాంటి విషయాల్లో అసలు పోలికే లేదని ఆ మంత్రి చెప్పారు. వైఎస్ నుంచి కిరణ్ వరకూ మంత్రిగా పనిచేసిన తనకు, జగన్ వద్ద పనిచేయాలంటే చిన్నతనంగా ఉన్నా ఉనికి కోసం తప్పడం లేదని వాపోయారు.

అయితే..  ఎన్టీఆర్ అంతటి జనసమ్మోహన నాయకుడే ఇలాంటి తప్పిదాల వల్ల పతనమయ్యారని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. తరచూ మారే జనాభిప్రాయాన్ని కనిపెట్టకపోతే, వచ్చిన ఫలితాలు నిలబెట్టుకోవడం కష్టమంటున్నారు. ఎన్నికల్లో సొంత నిధులతో అభ్యర్ధులను గెలిపిస్తాము కాబట్టి,  గెలిచిన వారికి ఎలాంటి అభిప్రాయాలు ఉండకూడదన్న భావన ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏపీలో ఇప్పటి పరిస్థితి, రాజకీయ వాతావరణం ప్రకారం జగన్‌కు తిరుగులేదన్నది అందరి అభిప్రాయం. అయితే 30 ఏళ్లపాటు తానే సీఎంగా ఉండాలని కోరుకునే జగన్,  ఈవిధంగా పాలించకూడదన్నదే మెజారిటీ ప్రజల అభిప్రాయం. నల్లేరుమీద నడకలా సాగాల్సిన పాలనను… తన మొండి వైఖరి, అవగాహనా రాహిత్యం, లెక్కలేనితనం, తనకు ప్రజలు  151 సీట్లు ఇచ్చారు కాబట్టి ఏమైనా చేయవచ్చన్న ఏకపక్ష నిర్ణయాలే జగన్ ఇమేజీని డామేజీ చేస్తున్నాయన్నది ఆయన అభిమానుల ఆవేదన. నిజం ‘జగన్నా’ధుడికెరుక?!