చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పగటి కలలు కంటున్నారు

119

– 2024 లో తుప్పు, పప్పులకు మూతి పగిలేలా తీర్పు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

చంద్రబాబు ప్రజలను నమ్మరని, ఆయన మాత్రం రామోజీరావును, రాధాకృష్ణను నమ్ముతాడని, ఇప్పుడు కొత్తగా బీఆర్ నాయుడును కూడా నమ్ముతున్నాడని, వీళ్ళంతా ఏం చెప్పినా చంద్రబాబు అదే చేస్తుంటాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను దించేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పగటి కలలు కంటున్నారని, వాళ్ళకున్న నాలెడ్జ్ అంతవరకే పరిమితమైందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. యువకుడు, కొత్తగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహనరెడ్డి కుల, మతాలకతీతంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకందించాలని తాపత్రయపడుతున్నారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, అట్టడుగున ఉన్న వర్గాలను రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకురావాలని కార్పోరేషన్లు, నామినేటెడ్ పదవులను కేటాయిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన 74 మున్సిపాలిటీలు, 12 కార్పోరేషన్ల ఎన్నికల్లో భాగంగా విజయవాడ మేయర్ ఓసీ వర్గానికి రిజర్వ్ అయినా బీసీ వర్గానికి కేటాయించారన్నారు. మచిలీపట్నం కార్పోరేషన్ కూడా ఓసీకి రిజర్వ్ కాగా అక్కడ కూడా బీసీ మహిళకు కేటాయించారన్నారు. అట్టడుగున్న బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను పైకి తీసుకురావాలని సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని, పార్టీ ఇచ్చే పదవుల్లో కూడా అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ అగ్రవర్ణాల్లోని పేదలను కూడా భాగస్వాములుగా చేస్తున్నారని, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు తన రాజకీయం కోసం కులాలను సైతం విడగొడుతూ ఉంటాడన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, 2024 లో మళ్ళీ తుప్పు, పప్పునాయుడులకు మూతి, ముఖం పగిలేట్టు తీర్పు ఇస్తారని, వేచి చూడాలని మంత్రి కొడాలి నాని అన్నారు.