రెండేళ్లలోనే 15 ఏళ్ల అభివృద్ధి సాధించాం

250

చరిత్రలో నిలిచిపోయే సువర్ణ ఘట్టాన్ని రెండు సంవత్సరాల పాలనలోనే ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలందరి బాగు కోసం రెండేళ్లలోనే 15 ఏళ్ల  అభివృద్ధిని చేసి చూపారన్నారు. వైయ‌స్ జగన్  ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో  పార్టీ జెండాను మున్సిపల్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి, కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా  సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం  వైయ‌స్ జగన్ నెరవేరుస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి సీఎం వైయ‌స్ జగన్ ప్రతిక్షణం పేదల బాగోగుల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం  వైఎస్ జగన్ ఒక గుణాత్మక మార్పు తీసుకువచ్చారు.  ఏది చేసినా విమర్శించే శక్తులు, వారి వెంట నడిచే వారు తప్ప, రాష్ట్రంలో మార్పు అందరికీ కనిపిస్తోంది. సంక్షేమం, అభివృద్ది వేరు వేరు కాదని జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. మహమ్మారిలా విజృంభిస్తోన్న కరోనా విపత్తును ఎదుర్కొంటూ కూడా మరోవైపు సంక్షేమ యజ్ఞం కొనసాగించారు.

పాలన, సంక్షేమంతో అన్ని రంగాల్లో గుణాత్మక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మార్పును అంగీకరించక తప్పని పరిస్థితి. వైఎస్ రాజశేఖరరెడ్డిగారు ఏ విధంగా పాలనలో తనదైన ముద్ర వేశారో… ఆ పునాదులపై అంతకు 10 రెట్ల వేగంగా జగన్ గారు పరిపాలన చేస్తున్నారన్నారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా..  గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. రాజ్యాంగ నిర్మాతలు కన్న కల నేడు నిరూపితం చేసి దేశానికి ముఖ్యమంత్రి జగన్  ఆదర్శంగా నిలిచారు.

అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందాలి.. నిర్దిష్ట సమయంలో వారి సమస్యలు పరిష్కారం కావాలని ప్రయత్నం చేశారు. నూతన వ్యవస్థలను రూపకల్పన చేయడమే కాకుండా ప్రజల్లో ఒక భాగమయ్యేలా చేశారు.

ఇంతటి పారదర్శకపు పరిపాలన గతంలో ఎప్పుడైనా ఊహించామా…? జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలు నడుస్తున్నారు. ఈ రోజు ఆయన చేస్తున్న పరిపాలన వల్ల పార్టీ కార్యకర్తలకు కూడా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. కేవలం ఒక రైతు భరోసా కిందే రూ. 17వేల కోట్లు రైతులకు ఇచ్చాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేసి నేరుగా ప్రజలకు గడువు ప్రకారం ఫలాలు అందించాం. చంద్రబాబు రుణమాఫీ పేరుతో చేసిన మోసం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీని వల్ల రైతులు 2 లక్షల కోట్ల మేర నష్టపోయి ఉంటారు. చెప్పిన మాట చేయకపోవడం వల్ల ఇలాంటి నష్టాలే జరుగుతాయి. అందుకే బీమా సొమ్ము తొలిసారిగా అదే ఏడాదిలో అందించాం. గతంలో విత్తనాలు, ఎరువులు, మద్దతు ధర కోసం రైతులు రోడ్డు ఎక్కని రోజు ఉందా…?

అభివృద్ది అంటే నిన్నటికి ఈ రోజుకి మార్పు రావాలి.. రేపు బాగుంటుందనే భరోసా ఉండాలి. విద్యా రంగంలో సమూల మార్పులు చేపట్టాం… స్కూళ్ల రూపు రేఖలు మార్చాం. సిలబస్ మార్చాం..ఇంగ్లీష్ మీడియం పెట్టాం.. కార్పొరేట్ విద్యతో పోటీ పడేలా చేశాం.

ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ నా కుటుంబ సభ్యులని సీఎం  వైఎస్ జగన్ అనుకున్నారు. వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే రీతిలో నిర్ణయాలు తీసుకున్నాం. వైద్యం విషయంలోనూ అనేక సంస్కరణలు చేపట్టాం… ఆరోగ్య శ్రీ విస్తరణ గొప్ప నిర్ణయం. పేద కుటుంబాలు అప్పులు పాలు కాకుండా ప్రభుత్వం విద్య, వైద్యంలో ఎన్నో మార్పులు తెచ్చింది. సాగునీటి వ్యవస్థలో ఎన్నో మార్పులు చేపట్టాం. రాయలసీమ కరువు నివారణకు  కాల్వల వెడల్పునకు శ్రీకారం చుట్టారు. ఫిషింగ్ హార్బర్లు, కొత్తగా పోర్టులు వస్తున్నాయి.
పరిశ్రమలు రావడానికి అనువైన వాతావరణం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆయన మదిలో ఇవన్నీ ఎప్పటినుంచి ఉన్నాయో కానీ…అవి ఇప్పుడు కనిపిస్తున్నాయి. తండ్రి లక్షణాలు పుణికి పుచ్చుకుని ఆయనకంటే పదిరెట్లు ఎదిగి మహాశక్తిగా మారారు. ప్రజల జవసత్వాలు పెరిగేలా చేశారు… ప్రజలంతా ఈ సిస్టం ఓన్ చేసుకోవాలి. ప్రజలు తమ సొంత ఆస్తిగా భావించి ఉపయోగించుకుంటే ఈ సిస్టమ్ విజయవంతం అవుతుంది. అన్ని వర్గాలు అభివృద్ధి, మహిళల సాధికారత కోసం  జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి ఆదర్శంగా ఉంటుంది. ఈ సంక్షేమ ఫలాలు ప్రజలు ఉపయోగించుకునేలా పార్టీ కార్యకర్తలు వారిలో చైతన్యం తీసుకురావాలి.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మా పార్టీ తన వంతు భాగస్వామ్యం తీసుకుంటుంది. నేరుగా అకౌంట్స్ లో వేసిందే 1 లక్షా 31 వేల కోట్లకు పైగా ఉంది.  పారదర్శకంగా మా పరిపాలన సాగుతోంది… మాకు ఎంత ఆదరణ పెరిగిందో మొన్నటి ఎన్నికలు నిరూపించాయి.  ప్రజల్ని నమ్ముకోవడమే జగన్  రాజకీయం… ప్రజలను వాడుకోవడమే చంద్రబాబు రాజకీయం. మహానాడు తీర్మానాలు చూస్తే నవ్వొచ్చింది… ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలే చేశారు. ఇంకా చేస్తున్నారు. షార్ట్ కట్స్ లేవని మా నాయకుడు నమ్ముతున్నారు… అడ్డదారులతో ముందుకు వెళ్లొచ్చని చంద్రబాబు అండ్ టీమ్  అనుకుంటున్నారు.

ఈ కార్యక్రమం లో  పార్టీ రాష్ర్ట ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కేంద్ర కార్యాల‌య ప‌ర్య‌వేక్ష‌కులు  లేళ్ళ అప్పిరెడ్డి, ఆకుల సత్యనారాయణ (మాజీ ఎమ్మెల్యే), స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.