నకిలీ విత్తనాల విక్రయదారులపై పీడీ యాక్ట్‌ నమోదు

246

నకిలీ విత్తనాల విక్రయదారులను గుర్తించి వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టే అంశంపై శనివారం పోలీసు ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల విక్రయదారులను ఉక్కుపాదంతో అణచివేయాలని అన్నారు.

నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసుశాఖ, వ్యవసాయశాఖ సంయుక్తంగా కృషి చేయాలని చెప్పారు. ఈ విషయంలో పోలీసులకు తగు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో గత ఐదేండ్లలో నకిలీ విత్తనాలు విక్రయించి అరెస్టయినవారి వివరాలు, నష్టపోయిన రైతులు, పంట నష్టం, విక్రయదారుల సమాచారాన్ని సేకరించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

ఈ అంశంపై రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి వ్యవసాయ శాఖ సహకారంతో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల తయారీదారులు, వారి మార్కెటింగ్, స్థానిక నెట్‌వర్క్ తదితర వివరాల నిర్వహణ విధానాన్ని (మోడస్ ఆపరెండీ) రూపొందించి తగు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. వెంటనే సంబంధిత జిల్లా, డివిజన్, మండల స్థాయిలో అధీకృత, గుర్తింపు పొందిన విత్తన విక్రయదారులు, డీలర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని తెలిపారు.

నకిలీ విత్తనాల విక్రయదారులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసు శాఖకు అందించాలని విత్తన కంపెనీలు, డీలర్లను కోరాలని సూచించారు. ఈ అంశంపై ఏర్పాటుచేసే పోలీస్ నోడల్ అధికారులు తప్పనిసరిగా టాస్క్‌ఫోర్స్‌ విభాగం నుండే ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏవి నకిలీ విత్తనాలు, ఏవి సరైన విత్తనాలు, వాటిని గుర్తించే విధానంపై పోలీసు అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని అన్నారు.

గతేడాది రాష్ట్రంలో 104 మంది నకిలీ విత్తన విక్రయదారులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాల్లో అధికంగా నకిలీవి ఉంటాయని, రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించడంతో ఇతర రాష్ట్రాల్లో తయారుచేసి అక్రమంగా ఇక్కడ విక్రయిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి వాటిని నిరోధించడంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.