కులం లేదు..మతం లేదు..ప్రాంతం లేదు.. సంక్షేమం, అభివృద్దే..!!

331
 ( వై.వి.రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్  ) 

2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘ఒక్క ఛాన్స్‌’ నినాదం..ప్రతిపక్షాలకు ‘మరో ఛాన్స్‌’ లేకుండా చేస్తోంది..!!. రెండేళ్ల సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలోని ప్రతి తలుపు తట్టింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శమవుతున్నాయి.

ఈ రెండేళ్లలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలో రాజకీయ నాయకుడు కంటే రాజనీతిజ్ఞుడు కనిపించారు. కరోనా కష్ట కాలంలోనూ ఏమాత్రం బెదరక, ఎంతో అనుభవం ఉన్న పాలకుడిగా రాష్ట్రమనే రథాన్ని ఒడిదుడుకులు లేకుండా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన హామీలను ..గెలిచిన తరువాత మరిచి పోవడం భారత దేశ రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ..పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాటను గుర్తు పెట్టుకుని సీఎం జగన్‌  అమలు చేస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో 94.5 శాతం హామీలను నెరవేర్చారు. కరోనా కష్ట కాలంలో కూడా ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు. ఎక్కడా నిధులకు లోటు లేకుండా చూసుకుంటున్నారు.  కరోనాతో ఆర్ధికంగా బలోపేతమైన రాష్ట్రాలే దిక్కుతోచని స్థితిలో ఉంటే..ఏపీలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం ఆర్దిక వనరులు సమకూర్చుకోవడంలో ముందున్నారు. పరిస్థితులు కచ్చితంగా అంచనా వేయడం..వాటికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటూ ఆర్ధిక కష్టాలు రాకుండా పాలన చేస్తున్నారు.
అంతేకాదు..కరోనా పేరుతో ఈ రెండేళ్లలో  ఏ ఒక్క పథకం ఆగడం కానీ..అభివృద్ది ఆగడం చూడలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు  కేంద్రం నిధులు లేటవుతున్నా..రాష్ట్రం నిధులు కేటాయిస్తూ పనులు ఆగకుండా చూసుకుంటున్నారు. పాదయాత్రలో చిందిన ప్రతి చెమట చుక్క..ప్రతి ఇంటిలో సంక్షేమ హరివిల్లై కనిపిస్తోంది.

మే30, 2019 వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు.  ఆ రోజున ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అనుకుని ఉంటారు. జగన్‌కు పాలన అనుభవం లేదు కదా అని. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని జగన్ రాజకీయ ప్రత్యర్ధులు సంబర పడి ఉంటారు. 2019లో ఎటూ గెలవలేమని ..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు ధ్వంసం చేశారని చెప్పడానికి భయ పడాల్సిన అవసరం లేదు. “ఏపీ ఆర్థిక రథం చక్రాలనే కాదు..ఆ రథం మొత్తాన్ని చంద్రబాబు ధ్వంసం చేశాడు .సీఎంగా వైఎస్ జగన్‌ బాధ్యతలు తీసుకున్న తరువాత ధ్వంసమైన  ఏపీ ఆర్ధిక రథాన్ని రోడ్డెక్కించారు. దీర్ఘకాల వ్యూహంతో  భవిష్యత్తులో అన్ని రంగాలు బంగారు గుడ్లు పెట్టే విధంగా తీర్చిదిద్దుతున్నారు”.  ఆర్థిక , పాలనా రంగంల్లో సీఎం  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తోన్న అద్భుతాలు చూసి ఆయన రాజకీయ ప్రత్యర్ధులకు నోటమాట రావడం లేదు. ప్రజాస్వామ్య బద్దంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కుతున్నారు. అను కుల మీడియాను అడ్డుపెట్టుకుని బురద జల్లుతున్నారు. రెండేళ్లలోనే  ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ ‘దేశం’ కూడా ఆశ్చర్యపోయేలా నిర్ణయాలు తీసుకుంటాడని చంద్రబాబు కూడా ఊహించి ఉండరు.

ఈ రెండేళ్ల వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో విద్య, వైద్య రంగాలకు అత్యంత  ప్రాధాన్యం ఇచ్చారు.  నాడు – నేడు పథకంలో బాగంగా బడులు, ఆస్పత్రుల స్వరూపాలు మారుతున్నాయి. పల్లె ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించారు. రైతన్న అడుగులో అడుగయ్యారు. ఆర్థిక రంగంలో ఎంతో నిష్ణాతుడ్ని సీఎం వైఎస్‌ జగన్‌లో చూడొచ్చు.  ఏపీలో పాలనా తీరుతెన్నులు చూస్తుంటే అమర్త్యసేన్ మాటలు గుర్తుకొస్తున్నాయి. ప్రజల జేబులు నిండా డబ్బులు ఉండాలి, ప్రతి ఇంటా సంక్షేమం పండాలి అంటే పాలకుల చేతులు ఉదారంగా ఉండాలి. అన్న అర్థశాస్త్రంలో నోబెల్ బహూమతి గ్రహీత అమర్త్య సేన్ మాటలు గుర్తుకు రాకమానవు. కార్పొరేట్ శక్తుల కంటే..కర్షకులే ముఖ్యమని నమ్మే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. ఈ రెండేళ్లలో ఏపీలో  గ్రామాలు పాలనా సంస్కరణలే కాదు, ఆర్థిక సంస్కరణలకు కూడా నిలయాలయ్యాయి.
ఈ రెండేళ్లలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వివిధ పథకాల ద్వారా ఇచ్చిన రూ.1.25 లక్షల కోట్లలో 70శాతానికిపైగా నిధులు గ్రామాల జేబుల్లోకే వెళ్లాయి. దీంతో పల్లె బతుకులు ఆర్థికంగా బలోపేతమయ్యాయి. దీనికితోడు..గ్రామీణ ఉపాధి హామీ పథకం పల్లె కూలీల జీవితాల్లో కరోనా కష్టకాలంలోనూ కాంతులు నింపింది. దేశంలోనే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీలోనే సమర్ధవంతంగా అమలు అయ్యేలా చేయడంలో సీఎం వైఎస్ జగన్‌ కృషి వెలకట్టలేనిది. కరోనా సమయంలో ఆర్థిక రంగానికి ఊతమిచ్చే అనేక చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో గృహ నిర్మాణ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ 1 నుంచి పల్లె, పట్టణ పేదలకు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని వైఎస్ జగన్‌ సంకల్పించారు.  గృహ నిర్మాణానికి తొలి దశలో రూ.46,084 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ డబ్బులు మార్కెట్‌లోకి వస్తే..ఆర్ధిక రంగానికి ఊతమిచ్చినట్లు అవుతుంది. వేల మందికి  ఉపాధి  దొరుకుతుంది. పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు సీఎం వైఎస్ జగన్‌.
వైఎస్ జగన్‌ రెండేళ్ల పాలనలో దాదాపు ఏడాది కరోనా కాటుతోనే పోయింది. కానీ..ఏనాడు కూడా ఆర్దికంగా పరిస్థితి  బాగోలేదని అనలేదు. పథకాలు ఆగలేదు. అభివృద్ది ఆగలేదు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేదు. కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటూనే..ఆర్ధిక వ్యవస్థ కూలిపోకుండా చూసుకున్నారు. రాబడి తీసుకుంటూనే..కరోనాపై యుద్ధం ప్రకటించి విజయం సాధించారు. అభివృద్ది చెందిన అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే..
కరోనాను ఎదుర్కోవడంలో, ఆర్ధిక వ్యవస్థను గాడి తప్పకుండా చూసుకోవడంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయం సాధించారనే చెప్పాలి.
కరోనాపై ఇప్పటి వరకు దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేశారు.  కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి దేశానికి ఆదర్శమయ్యారు. అంతేకాదు..2400 వ్యాధులను ఆరోగ్య శ్రీలో చేర్చి పేదల ప్రాణాలకు  భరోసా ఇచ్చారు. 108,104తో ప్రజల ప్రాణాలకు సంజీవని అయ్యారు.  కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే..వారి పిల్లలకు బ్యాంకుల్లో రూ.10 లక్షలు డిపాజిట్ చేసి ఆదుకునే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. కేరళ ప్రభుత్వం వైఎస్ జగన్‌ బాటలో నడుస్తోంది. విజయన్ ప్రభుత్వం కూడా…కరోనాతో అనాథలైన పిల్లలకు బ్యాంకులో రూ.3 లక్షలు డిపాజిట్ చేయాలని  పాలనాపరమైన నిర్ణయం తీసుకుంది.
గ్రామ సచివాలయ వ్యవస్థతో  పాలనా రంగంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారు సీఎం జగన్‌.  544 సేవలు ఇంటి ముందుకే వస్తున్నాయి. మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటి ముందే వాలంటీర్‌ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌లో పనులు అయిపోతున్నాయి. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండాలే కానీ..ఆలోచనలు వాటంతటకవే వస్తాయి. సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.
సీఎంగా వైఎస్ జగన్‌ చిరునవ్వుతో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. అధికారులతో చనువుగా  ఉంటూ తనకు కావాల్సిన ఫలితాలు రాబట్టుకుంటున్నారు.
ఈ రెండేళ్లలో చంద్రబాబు ఆయన గ్యాంగ్ సీఎం జగన్‌ మీద  వేయని రాయి లేదు. కులం పేరుతో రాయి వేశారు. ప్రాంతం పేరుతో రాళ్లు వేయించారు. మతం పేరుతో అడ్డమైన వాళ్లతో రాళ్లు వేయించారు. కానీ..ఎక్కడా కూడా వైఎస్ జగన్ నోరు జారలేదు. ప్రజల తనకిచ్చిన బాధ్యతను చేసుకుంటూ వెళ్తున్నారు.  వైఎస్ఆర్ సీపీకి ఓటు వేయని వారు కూడా నిర్హయంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు అవుతున్నారు. పింఛన్ దగ్గర నుంచి ఇళ్ల పట్టాల వరకు అందుతున్నాయి. ఎన్నికలకు ముందు ” కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం” అంటూ ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అందిస్తున్నారు. ‘పాలకుడికి ప్రజలందరూ సమానమే’ ఈ సూత్రం విలువ బాగా తెలిసినవాడు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. అధికారులకు, వాలంటీర్లకు, స్థానిక నాయకులకు సీఎం వైఎస్ జగన్‌ చెబుతోంది ఇదే. మన పాలనా ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని ప్రతి రోజూ చెబుతారు. చెప్పడమే కాదు..చేతల్లో చేసి చూపిస్తున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు 40 ఏళ్ల ఇండస్ట్రీకి తనపై తనకే నమ్మకం పోయేలా చేశారు. దీనిలో రాజకీయ వ్యూహం ఏమీ లేదు. ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చుకుంటూ పోతుంటే..ప్రజలు కూడా ఎన్నికల సమయంలో వారి పని వారు చేసుకుంటూ వెళ్తారు. స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచన తీరుకు నిదర్శనం.  స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తన  కంచుకోటల్లో కూడా  జెండా ఎగరేయలేకపోయింది. చంద్రబాబు తాను ఇచ్చిన మాటను తన చెప్పు కిందే పడేసి తొక్కేస్తాడు..వైఎస్ జగన్‌  ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చే వరకు తపిస్తాడు. అందుకే..రెండేళ్లలోనే  వైఎస్ జగన్‌ బెస్ట్‌ సీఎంగా దేశంలోనే రెండో ర్యాంక్‌లో నిలిచారు.
  రాజకీయ పార్టీ అనేది అధికారంలోకి రావడానికి ఒక మార్గం మాత్రమే.  ఆ మార్గంలో నడిచేటప్పుడే అన్ని నేర్చుకుంటూ, తెలుసుకుని నడిస్తే  పాలన చేపట్టిన తరువాత సమస్యలు ఉండవు. కరోనా లాంటి సమస్యలు ఎదురైనా తొణకకుండా, బెణకుండా పాలన చేయవచ్చు. ఓదార్పు యాత్ర, 3,648 కి.మీ  పాదయాత్రలో అనేక విషయాలు నేర్చుకున్నారు , చూశారు. దివంగత సీఎం వైఎస్ఆర్ చనిపోయిన తరువాత వచ్చిన కన్నీళ్లు ఇప్పుడు లేవు. ఎందుకంటే..ఆయన బిడ్డ జగన్ తమకు తోడుగా ఉన్నాడనే భరోసా వారి గుండె చప్పుడులో వినిపిస్తోంది. మాకు  మా అన్న ఉన్నాడనే ధైర్యం ఏపీలో కనిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ రెండేళ్ల పాలన కరోనా కాటు నుంచి తప్పించుకుంటూ , రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ఉత్తేజ పరుస్తూ.. పల్లె ప్రగతికి  ప్రాణం పోస్తూ..రైతన్నకు అండగా ఉంటూ..వృద్దులకు ఊతకర్రై  సాగింది. “పాలకుడిగా నీవు ఓ నిర్ణయం తీసుకునే ముందు నీ  కళ్ల ముందు పేదవాడిని ఊహించుకో” అన్న మహాత్మ గాంధీ  మాటలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫాలో అవుతూ పాలన చేస్తున్నారడంలో ఎటువంటి సందేహం లేదు.  అందుకే.. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రజలు సీఎం జగన్‌కు జై కొడుతున్నారు.