కరోనా సెకండ్ వేలో గుడివాడ డివిజన్లో 720 మంది రికవరీ

78

– గత ఏప్రిల్ నుండి 1,617 కేసుల నమోదు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, మే 29: కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో గత ఏప్రిల్ 1 వ తేదీ నుండి ఇప్పటి వరకు గుడివాడ డివిజన్లో 1,617 మందికి వైరస్ సోకిందని, వీరిలో 720 మంది రికవరీ అయినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

 కరోనా వైరస్ మొదటి వేవ్ లో జిల్లాలో గుడివాడ ప్రాంతంలో తక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పారు. సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతోందన్నారు. శనివారం ఒక్కరోజే గుడివాడ డివిజన్‌లోని పామర్రు మండలంలో 14, ముదినేపల్లి మండలంలో 5, నందివాడ మండలంలో 8, గుడ్లవల్లేరు మండలంలో 6, మండవల్లి మండలంలో 7, గుడివాడ పట్టణ, రూరల్ మండలంలో 7, పెదపారుపూడి మండలంలో 9, కలిదిండి మండలంలో 3 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుతం గుడివాడ డివిజన్లో 829 యాక్టివ్ కేసులు ఉన్నాయని , బాధితులందరికీ మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని చెప్పారు.
సెకండ్ వేవ్ లో 68 మరణాలు సంభవించాయని తెలిపారు. గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్, నాన్ కోవిడ్ సేవలను అందజేస్తున్నామన్నారు. కోవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు 25 ఆక్సిజన్ బెడ్స్ తో కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. వీరికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతోనూ వైద్యం అందిస్తున్నామన్నారు. కోవిడ్ విభాగంలో అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకం, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ కొరత, సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా సిలిండర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. కోవిడ్ బాధితులకు సత్వర వైద్య సేవలందేలా ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, మండల తహసీల్దార్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించామన్నారు.
 రాష్ట్రంలో కోవిడ్ -19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్మోహనరెడ్డి సమీక్షలు నిర్వహించడం ద్వారా అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలను కలుగజేస్తున్నారన్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందన్నారు. రాష్ట్రంలో ఈ నెల 18 వ తేదీ నాటికి 2.11 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని, 26 వ తేదీ నాటికి 1.86 లక్షలకు తగ్గాయన్నారు. అలాగే రికవరీ రేటు కూడా తగ్గుతోందన్నారు. ఈ నెల 7 వ తేదీ నాటికి రికవరీ రేటు 84.3 శాతం ఉండగా 27 వ తేదీ నాటికి 87.99 శాతానికి చేరిందన్నారు. ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్మోహనరెడ్డి దృష్టి పెట్టారని, ఎటువంటి కొరత లేకుండా అవసరమైన చర్యలు చేపట్టారని తెలిపారు. కోవిడ్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలను విధించడం జరుగుతుందన్నారు. కరోనా వైరస్ సోకి తల్లిదండ్రులు మరణించిన కారణంగా ఇప్పటి వరకు అనాథలైన 78 మంది పిల్లలను గుర్తించామని, వీరందరికీ ప్రభుత్వం రూ. 10 లక్షలు చొప్పున డిపాజిట్ చేయనుందని మంత్రి కొడాలి నాని చెప్పారు.