450 ఎకరాల భూములను కేటాయించిన దివంగత వైఎస్సార్, సీఎం జగన్

184

– పట్టణంలో 258 ఎకరాల భూమిని సేకరించాం
– పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చుతున్నాం
– మధ్యతరగతి కోసం 400 ఎకరాలు సేకరిస్తున్నాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, మే 28: గుడివాడ నియోజకవర్గంలో పేదల ఇళ్ళపట్టాల కోసం తండ్రీ కొడుకులు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉండగా దాదాపు 450 ఎకరాల భూములను కేటాయించారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలోని ఒక నియోజకవర్గంలో ఇంత పెద్దఎత్తున భూములను కొనుగోలు చేసి ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహానుభావులుగా దివంగత వైఎస్సార్, సీఎం జగన్మోహనరెడ్డిలు చరిత్ర పుటల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు గుడివాడ పట్టణంలోని పేదల కోసం 181 ఎకరాల భూమిని సేకరించామని చెప్పారు. 2008 లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 77 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారన్నారు. వైఎస్సార్ ఇచ్చిన భూమిలో 8,912 టిడ్కో ఇళ్ళను నిర్మిస్తున్నామని చెప్పారు. గుడివాడ పట్టణంలోని దాదాపు 16 వేల మంది పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చుతున్నామని చెప్పారు. అలాగే గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరులో 30 ఎకరాలు, నందివాడ మండలం జనార్ధనపురంలో 14 ఎకరాలు, తమిరిశలో 7.5 ఎకరాలు, పోలుకొండలో 7.5 ఎకరాలు ఇలా ప్రతి గ్రామంలోనూ పేదల ఇళ్ళపటాల కోసం అవసరమైన భూములను సేకరించామన్నారు.
అలాగే గుడివాడ పట్టణంలో బ్రిటీషు హయాంలో 47 ఎకరాల మంచినీటి చెరువును తవ్వారని చెప్పారు. పట్టణ జనాభా 1.20 లక్షలకు చేరినప్పటికీ ఈ చెరువు ద్వారానే తాగునీటి అవసరాలను తీర్చుకోవడం జరిగేదన్నారు. దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రి ఉండగా పెద ఎరుకపాడులో 106 ఎకరాల విస్తీర్ణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను నిర్మించారని చెప్పారు. గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లో కూడా మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మల్టీవిలేజ్ స్కీంను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 120 ఎకరాల భూసేకరణకు నాబార్డ్ నుండి నిధులు ఇవ్వరని, ఈ విషయాన్ని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగా రూ. 50 కోట్ల నిధులు ఇవ్వడానికి ఆమోదం తెలిపారన్నారు.
ప్రాజెక్టు నిర్మాణానికి రూ.300 కోట్ల నాబార్డ్ నుండి నిధులు మంజూరు చేయిస్తానని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి హామీ ఇచ్చారని తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు కూడా తక్కువ ధరకు ఇళ్ళపట్టాలను కేటాయించేందుకు మరో 400 ఎకరాల భూములను సేకరిస్తున్నామన్నారు. గుడివాడ పట్టణాన్ని ఆనుకుని ఇంత పెద్దఎత్తున భూములను సేకరించి పేదల కోసం దివంగత వైఎస్సార్ ప్రభుత్వం తర్వాత సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం మాత్రమే పనిచేస్తోందని మంత్రి కొడాలి నాని చెప్పారు.