బ్రాహ్మ‌ణాధిక్య‌త‌పై పోరాట‌మే ఫూలేకు నిజ‌మైన నివాళి

342

మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే..ఆ పేరులోనే ఉంది అదొక జ్వాల‌..అదో చీక‌టిని పార‌దోలే జ్యోతి అని.ఆ పేరును సార్ధ‌కం చేసుకున్నాడు జ్యోతిరావు ఫూలే. ఫూలే తొలిత‌రం సామాజిక శాస్త్రవేత్త‌. కాదు..కాదు.. కొలిమిలో కాలిపోతున్న జీవితాల‌ను నిప్పు క‌ణాలుగా మార్చిన పోరాట యోధుడు. బ్రాహ్మ‌ణాధిక్య‌త‌లో న‌లిగిపోతున్న బ‌తుకుల్లో విద్య ద్వారా కొత్త వెలుగులు నింపిన మ‌హానీయుడు ఫూలే..బ్రాహ్మ‌ణుల ఎదురుగా నిల్చోవ‌డానికే సాహ‌సించ‌ని జాతిలో పుట్టిన ఆ వీర కిశోరం.. త‌ర‌త‌రాలుగా త‌మ‌ను అణ‌చివేస్తూ.. చ‌దువుకోకుండా అడుగడుగునా కుట్ర‌లు.. కుటిల య‌త్నాలు సాగించిన బ్రాహ్మ‌ణాధిక్య‌త‌ను కూక‌టి వేళ్ల‌తో పెకిలించేందుకు త‌న జాతిని అక్ష‌రాస్యులుగా మ‌లిచిన వైతాళికుడు ఫూలే.

కానీ దుర‌దృష్టం..వేల సంవ‌త్స‌రాలుగా మనువాదుల కుట్ర‌ల‌కు బ‌ల‌వుతూ వ‌చ్చిన శూద్రులు( నేటి బ‌హుజ‌నులు) వారి మాయ‌లో ప‌డి మ‌హాత్మా ఫూలే వ్య‌తిరేకించిన బ్రాహ్మ‌ణాధిక్య‌త‌కు బానీస‌లుగా మారిపోయారు. దేవుడు.. దెయ్యాల పేరిట అమాయ‌కుల‌ను భ‌యం గుప్పిట్లోకి నెట్టి వారి క‌ష్టాన్ని దిగ‌మింగే ప‌రాన్న‌భుక్కులైన‌ భ్రాహ్మ‌ణులు..శూద్రులు.. అతిశూద్రులుగా పిల‌వ‌బ‌డే వెనుక‌వేయ‌బ‌డ్డ కులాలు.. ద‌ళితుల‌నే అణ‌చివేయ‌బ‌డ్డ వ‌ర్గాలను త‌మ బానీస‌లుగా మార్చుకున్న తీరును ఫూలే త‌న క‌ళ్లారా చూశారు. బ్రిటీష్ పాల‌కులు మ‌న‌దేశాన్ని ఆక్ర‌మించే వ‌ర‌కూ అప్ప‌టి రాజ్యాల‌లో రాజుల‌ను మాయ‌మాట‌ల‌తో త‌మ గుప్పిట్లో పెట్టుకుని రాజులు త‌మ ఆదేశానుసార‌మే పాల‌న సాగించెలా మార్చివేశారు. ఆ రోజుల్లో శూద్ర శంభూకుడు జ్ఞానాన్ని పొందే ప్ర‌య‌త్నం చేయ‌డంతో జీర్ణించుకోలేని బ్రాహ్మ‌ణులు.. అప్ప‌టి రాజైన రాముడి వ‌ద్ద‌కు వెళ్లి.. శూద్ర శంభూకుడు చ‌దువుకుంటే రాజ్యంలో అరిష్టం మొద‌ల‌వుతుంద‌ని భ‌య‌పెట్టారు.
భ‌విష్య‌త్‌లో మ‌రే శూద్రుడూ చ‌దువుకోకుండా ఉండాలంటే.. శంభూకున్ని న‌రికి చంపాల‌ని బ్రాహ్మ‌ణులు రాముడికి హుకుం జారీ చేశారు. బ్రాహ్మ‌ణుల సలహా..సంప్రదింపులతో పాల సాగింఛే క్ష‌త్రియ రాజైన రాముడు శూద్ర శంభూకున్ని న‌రికి చంపాడు. అంతే కాదు శూద్రుడైన‌వీర శివాజీ రాజు కావడాన్నీ బ్రాహ్మణ శక్తులు జీర్ణించుకోలేక పోయాయి. శివాజీ పట్టాభిషేకం జరిపించేందుకు
బ్రాహ్మణ పూజారులు నిరాకరించారు.  నిలువెత్తు బంగారం ఇస్తే.. తన కాలి బొటన వేలితో శివాజీ నుదుట తిలకం దిద్దిబతన బ్రాహ్మణ అహంకారాన్ని చాటుకున్నాడు పొరుగు రాజ్యానికి చెందిన పూజారి.
చాతుర్వర్ణం ప్రకారం  శూద్రులు బానీసలుగా పడి ఉండాలే తప్ప రాజ్యాలు ఏలరాదు. అయినా ఓ శూద్రుడైన శివాజీ రాజు కావడాన్ని బ్రాహ్మణులు తీవ్రంగా పరిగణించారు. ఈ కారణంగా నే అడుగడుగునా అవమానించి చివరకు కుట్రలతో వధించారు.
శివాజీ తదనంతరం పాలనా పగ్గాలు చేపట్టిన శంభాజీ తల నరికి కత్తికి వేలాడదీసీ ఊరేగించి గుడిపడవా ( ఉగాది) పండగను జరుపుకున్నారు. అటువంటి గడ్డమీద పుట్టిపెరిగిన మహాత్మా జోతిరావు పూలే బ్రాహ్మణాధిక్యతపై మడమతిప్పని ధీరుడిలా పోరాటం సాగించారు.
దీన్నిబ‌ట్టి బ్రాహ్మ‌ణులు ఎంత‌టి క‌ప‌ట‌ద్రోహులో అర్ధం చేసుకోవ‌చ్చు. జ్యోతిరావు ఫూలే కాలం నాటికి దేశంలో ఇదే ప‌రిస్థితి కొన‌సాగింది. అంటే ఇప్పుడు కొన‌సాగ‌డం లేద‌ని కాదు.బ్రాహ్మణ భావ‌జాలాన్ని స‌మాజం నుండి పార‌దోలేందుకు ..త‌న జాతిని చైత‌న్య‌వంతంగా తీర్చిదిద్దేందుకు.. త‌న జీవితాన్నే త్యాగం చేసిన మ‌హానీయుడు ఫూలే. 1827 లో జ‌న్మించిన ఫూలే 1890 ,వంబ‌ర్ 28న భౌతికంగా దూర‌మ‌య్యాడు. ఆ యోధుడు సాగించిన పోరాటాన్ని…బ‌హుజ‌నుల‌ను అక్ష‌రాస్యులుగా..చైత‌న్య‌వంతులుగా తీర్చిదిద్దేందుకు సాగించిన కృషిని ఆ త‌రువాతి త‌రాల‌కు తెలియ‌కుండా తొక్కిపెట్ట‌డం ద్వారా బ్రాహ్మ‌ణులు ఈ జాతికి మ‌రోసారి అన్యాయాన్ని త‌ల‌పెట్టారు.
మేధావుల‌మ‌ని చెప్పుకునే ఎంతోమందికి ఫూలే ఎవ‌రో కూడా తెలియ‌కుండా ఉండేందుకు అనేక కుట్ర‌లు ప‌న్నారు. ఈ కార‌ణంగానే ఫూలే సాగించిన పోరాటంతోనే త‌మ‌కు విద్యా జ్ఞానం అందింద‌నే అక్ష‌ర స‌త్యాన్ని మ‌న‌లో చాలామంది గ్ర‌హించ‌లేక‌పోయారు. అంతేకాదు ఏ బ్రాహ్మ‌ణాధిక్య‌త‌ను ఫూలే ఎదురించాడో..ఆ బ్రాహ్మ‌ణాధిక్య‌త పాదాల కింద బ‌హుజ‌నులు నలిగిపోవ‌డం అత్యంత దుర‌దృష్ట‌క‌రం. ఆ మ‌హాయోధుడు న‌డిపించిన పోరాట మార్గంలో బ‌హుజ‌నులు అడుగులు వేసిన‌ట్ల‌యితే ఎప్పుడో బ్రాహ్మ‌ణాధిక్య‌త‌కు నూక‌లు చెల్లి ఉండేవి. కానీ… నేటికీ క‌ర్మ‌కాండ‌లు.. పూజ‌లు.. వ్ర‌తాలు.. పెళ్లిల్లు అన్నీ తమ ఆధీనంలో పెట్టుకుని బ‌హుజ‌నుల‌ను చైత‌న్య‌ర‌హితులుగా మార్చి త‌మ పాదాల‌కింద నలిపేస్తోంది బ్రాహ్మ‌ణాధిక్య‌త‌. బ్రాహ్మ‌ణ కుతంత్రాల కార‌ణంగానే దేశంలో 85 శాతంగా ఉన్న బ‌హుజ‌నులు నేటికీ వంద శాతం అక్ష‌రాస్య‌త‌కు చేరుకోలేక పోయారు. దేశానికి సంప‌ద‌ను అందిస్తూ కడుపునిండా తిండికి నోచుకోలేక ఆగ‌ర్భ దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతోంది ఈ జాతి. రాజ్యాంగం క‌ల్పించిన అనేక హ‌క్కులు కూడా ఈ జాతికి పూర్తిగా తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు.
కానీ.. ఇది నిజం.రాజ్యాధికారంతోనే ఈ జాతి బాగుప‌డుతుంద‌ని గౌత‌మ బుద్ధుడు.. మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే.. డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్‌.. మాన్య కాన్షీరామ్ వంటి ఎంద‌రో మ‌హానీయులు ఉద్భోధించారు. అయినా.. ఈ వ‌ర్గాల‌కు నేటికీ రాజ్యాధికారం అంద‌నేలేదు. ఎంగిలిమెతుకుల్లా  ఏవో కొన్ని మంత్రి ప‌ద‌వుల‌ను విసిరి వేసి ఈ జాతిని త‌న గుప్పిట్లోంచి జారిపోకుండా కుట్ర‌లు ప‌న్నుతోంది. అంతే త‌ప్ప ఈ జాతికి మంత్రి వ‌ర్గంలో స‌రైన ప్రాతినిధ్యం కూడా క‌ల్పించ‌డంలేదు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌లో.దీనంత‌టికీ కార‌ణం బ్రాహ్మ‌ణాధిప‌త్యం..దేవుడి త‌రువాత తామే దేవుళ్ల‌మ‌ని బ‌హుజ‌నులు సృష్టించిన గుళ్ల‌ను ఆక్ర‌మించి ..ఆల‌యాలే కేంద్రంగా త‌మ ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తున్నారు బ్రాహ్మ‌ణులు. దేశానికి ప్ర‌థ‌మ పౌరుడైన రాష్ట్ర‌ప‌తి సైతం గ‌ర్భ‌గుడిలోకి అడుగు పెట్టేందుకు గ‌జ‌గ‌జ వ‌ణికిపోయే ప‌టిష్ట‌మైన వ్య‌వ‌స్థ‌ను రూపొందించారు బ్రాహ్మ‌ణులు.
వేల ఏళ్లుగా బ్రాహ్మ‌ణ భావ‌జాలం  పాదాల కింద వంద‌ కోట్ల భార‌తీయులు న‌లిగిపోతున్నారంటేనే అర్ధం చేసుకోవ‌చ్చు బ్రాహ్మ‌ణీయ కుట్ర‌.. కుతంత్రం. అందుకే వీరిని తేనెపూసిన క‌త్తులుగా పిలుస్తారు. తేనెపూసి క‌త్తుల‌ను గొంతులోకి దించినా తేనెలోని తియ్య‌ద‌నం మాటున ఆ క‌త్తి వాడికి మ‌న‌కు తెలియ‌కుండా ఉంటుంది. కానీ గొంతును చీల్చుకుంటూ మ‌న ప్రాణాల‌ను తియ్య‌డం మాత్రం ఖాయం.. ఇది బ్రాహ్మ‌ణ భావ‌జాలం. నేటి హైటెక్ యుగంలో కూడా కొత్త ఇంట్లో అడుగుపెట్టాల‌న్నా.. కృత్రిమ ఉప‌గ్ర‌హాన్ని క‌క్ష్య‌లోకి పంపాల‌న్నా..ఓ ఆడామ‌గా జంట‌గా మారాల‌న్నా..భార‌సాల జ‌ర‌పాల‌న్నా..పుట్టిన గుడ్డుకు పేరు పెట్టాల‌న్నా..చివ‌ర‌కు ఏ ప‌ని చేయాల‌న్నా ముహుర్తాలు పెట్టాల్సిందే.. పూజ‌లు..పున‌స్కారాలు చేయాల్సిందే. ఈ పూజ‌ల వల్ల జ‌నాల‌కు ఎటువంటి ప్ర‌యోజ‌నాలు ఒన‌గూడ‌వు.. చ‌రిత్ర‌లో ఎక్క‌డా కూడా మేలు జ‌రిగిన దాఖ‌లాలు లేవు. ఉండ‌వు కూడా.  పూజ‌లు చేయ‌డం వ‌ల్ల బ్రాహ్మ‌ణుల‌కు మాత్ర‌మే ఆదాయ వ‌న‌రులు స‌మ‌కూరుతాయి. ఎటువంటి ప‌నీపాటా చేయ‌కుండా శ్రామికుల ఆస్తుల‌ను కైంక‌ర్యాల పేరిట దోచుకోవ‌డ‌మే వీరి ప‌ని. పూజ‌ల త‌రువాత భ్రాహ్మ‌ణుల‌కు ద‌క్షిణ చెల్లించ‌డంతోపాటు..కాళ్ల‌కు దండం పెట్ట‌డ‌మూ నేటికీ కొన‌సాగుతూనే ఉంది.
తిరుమ‌ల వంటి పెద్ద ఆల‌యాల వ‌ద్ద కూడా అణచివేయ‌బ‌డ్డ కులాలు ప‌ల్ల‌కిని భుజాల‌పై మోస్తూ ఉంటే.. బ్రాహ్మ‌ణులు ప‌ల్ల‌కి ఎక్కి ఊరేగుతుంటారు. పూజారులు లేకుండా పెళ్లిళ్లు.. గృహ ప్ర‌వేశాలు జ‌ర‌గ‌వా అంటే అమ్మో..ఎంత‌టి అప‌చార‌మంటూ రెండు చెంప‌లు వాయించుకునెలా బ‌హుజ‌న జాతిని గొర్రెల మంద‌ల్లా మార్చేసిన వైనాన్ని ఫూలే బ‌తికి ఉండి ఉంటే త‌ట్టుకునేవారు కాదు. ఇదా నేను సాధించాల‌న‌కున్న ల‌క్ష్యం..ఇదా నేను క‌ల‌లు క‌న్న స‌మాన‌త్వ స‌మాజమ‌ని ఫూలే ఎంత‌గా క్షోభించేవారో. ఫూలే క‌ల‌లు క‌న్న స‌మాన‌త్వం రావాల‌న్నా..బ‌హుజ‌నులు రాజ్యాధికారాన్ని చేప‌ట్టాల‌న్నా..బ్రాహ్మ‌ణాధిప‌త్యాన్ని త‌రిమి కొట్ట‌డ‌మే ఏకైక ప‌రిష్కారం. అప్పుడే త‌ర‌త‌రాలుగా అణ‌చివేత‌కు గుర‌వుతూ వ‌స్తున్న బ‌హుజ‌నులు విద్యావంతులై.. రాజ్యాధిపాల‌కులై.. స‌మాజంలో స‌మాన‌త్వాన్ని పొంద‌గ‌లుగుతారు.
 బీసీ మేధావులు ఈ బాధ్య‌త‌ను తమ భుజాల‌పై మోయాల్సిన అవ‌స‌రం ఉంది. ఏదో ఊక‌దంపుడు ఉప‌న్యాసాల‌తో స‌రిపెట్ట‌డం కాదు.. ఎస్సీ, ఎస్టీల‌తో పాటు బీసీల‌ను విద్యావంతులుగా మార్చ‌డానికి ఫూలే ప‌డ్డ క‌ష్టాలు.. ఆయ‌న త్యాగాలను
బీసీలు అనుక్ష‌ణం గుర్తు చేసుకోవాల‌సిన అవ‌స‌రం ఉంది. నేడు బీసీలు ఉన్న‌త విద్యావంతులై అత్యున్న‌త స్థానాల‌కు చేరుకోవ‌డానికి కార‌ణం.. ఫూలే సాగించిన పోరాటాల ఫ‌లిత‌మే. ఒక‌వేళ ఫూలే మ‌న‌లాగే త‌న ఇళ్లు.. త‌న కుటుంబం అంటూ స‌రిపెట్టుకుని ఉండి ఉంటే..ఈ రోజు బీసీలు ఎక్క‌డ ఉండేవారో . కొంత‌మంది బీసీలు అంటారు.. నేను చాలా క‌ష్ట‌ప‌డి ఎదిగాన‌ని..అయ్యా కుహ‌నా బీసీ గారూ..మీరు చ‌దువుకోవ‌డానికి కార‌ణం.. ఫూలే గారే.. బ్రాహ్మ‌ణులు బ‌హుజ‌నుల‌ను చ‌దువుకోకుండా పన్నిన కుట్ర‌ల‌ను ఎదురించి మ‌రీ మ‌న‌కు చ‌ద‌వు నేర్పాడు ఆ మ‌హానుభావుడు.
ఆ మ‌హానీయుని స‌తీమ‌ణి సావిత్రీ ఫూలే భ‌ర్త భాట‌లో మ‌హిళ‌ల‌కు విద్యాబుధ్దులు నేర్పి చ‌రిత్ర‌లో తొలి మ‌హిళా టీచ‌ర్‌గా నిలిచిపోయింది.సో.. ఫూలే జ‌యంతులు.. వ‌ర్ధంతుల స‌మ‌యాల్లో విగ్ర‌హాల‌కు దండ‌లు వేసి.. దండాలు పెట్టి.. నినాదాలు చేసి.. ఆ త‌రువాత య‌ధావిధిగా గుళ్ల‌కు వెళ్లి రాతిబొమ్మ‌ల‌కు..ప‌నిలో ప‌నిగా పూజారుల కాళ్ల‌కు దండాలు పెట్టే విధానాన్ని మార్చుకోండి. లేదంటే మేం బీసీ నాయ‌కులం.. మేం ఫూలేకు వార‌సుల‌మ‌ని చ‌వ‌ట‌ల్లా మాట్లాడ‌కండి. మీరు మార‌కుంటే చ‌రిత్ర మిమ్మ‌ల్ని ఎన్న‌టికీ క్ష‌మించ‌దు.
– జంగిటి వెంకటేష్
                                                       సీనియర్ జర్నలిస్ట్.
                                                              – 9052889696