యుగకర్త ‘పండిట్ నెహ్రూ’

596

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలి ప్రధాని అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన మిశ్రమ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టాయి. ముఖ్యంగా, నీటిపారుదల వ్యవసాయం పారిశ్రామిక రంగాలను ప్రాధాన్యతగా ఎంచుకొని చేపట్టిన కార్యక్రమాలు దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించడంలో గణనీయమైన పాత్ర పోషించాయి.

దేశ ప్రధాని కాగానే నెహ్రూ రెండు ప్రధాన సమస్యల పై దృష్టి సారించాల్సి వచ్చింది. అందులో మొదటిది కాందిశీకుల సమస్య. స్వాతంత్ర్యం లభించిన ఒక్క ఏడాదిలోనే పాకిస్థాన్ నుంచి 50 లక్షల మంది, తూర్పు పాకిస్తాన్ నుంచి 30 లక్షల మంది కాందిశీకులు దేశంలోకి వరదలా వచ్చిపడ్డారు. అందులో మెజారిటీ ప్రజలు హిందువులే. వారందరికీ యుద్ధ ప్రాతిపదికన పునరావాస సౌకర్యాలు కల్పించడం కేంద్ర ప్రభుత్వానికి అతి పెద్ద సవాలుగా పరిణమించింది. ఇక, రెండో సమస్య.. ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం తదితర సమస్యలు పెనుసవాళ్లుగా మారాయి.

అయితే, ఈ సమస్యల పరిష్కారానికి.. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారత పార్లమెంట్ ను విశ్వాసంలోకి తీసుకొన్నారు. దేశ పురోగతికి దోహదం చేసే అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలను కోరారు. దేశ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అయిన సందర్భం అది. 1950 మార్చి నెలలో ప్రధాని నెహ్రూ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడంతో దేశ గతి ఓ మేలి మలుపు వైపు పయనించడానికి అంకురార్పణ జరిగింది. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడాన్ని లక్ష్యంగా చేసుకొన్నారు. అప్పటి వరకు ప్రజలకు అవసరమైన తిండి గింజలను నౌకల ద్వారా దిగుమతి చేసుకొనే దుస్థితి నెలకొని ఉంది. ఇక, దేశంలో రోడ్లు, విద్యుత్, మంచినీరు తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ చూపారు. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడానికి రెండు రంగాలను సృష్టించారు. అవి.. పబ్లిక్ రంగం, ప్రైవేట్ రంగం. ఈ విధానాన్నే తర్వాత రోజుల్లో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పిలిచారు. నిజానికి, ఆనాడు ప్రపంచంలో రెండు రకాలైన విధానాలు అమలవుతున్నాయి.

అందులో ఒకటి కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం. యూరప్ దేశాల్లో దాదాపు దశాబ్దకాలం పాటు ఉన్నత చదువుల నిమిత్తం ఉన్న సమయంలో నెహ్రూను ‘జార్జి బెర్నార్డ్ షా ప్రతిపాదించిన ‘ఫేబియన్ సోషలిజం’, అదేవిధంగా ‘ఐరిష్ నేషనలిజం’ ఆకర్షించాయి. పేదరికం, నిరక్షరాస్యత, సాంఘిక అసమానతలు గలిగిన భారతదేశానికి మిశ్రమ ఆర్థిక విధానాలు మాత్రమే మేలు చేస్తాయని గట్టిగా నమ్మడం వలనే.. ప్రభుత్వ రంగంలో అతిగొప్ప సంస్థలు వెలిశాయి, అవి కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలిగాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో బహుళార్ధక సాధకాలైన నీటిపారుదల, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చారు. వాటిల్లో ప్రధానంగా పంజాబ్ లోని బాక్రానంగల్, ఒరిస్సాలోని హీరాకుడ్, పశ్చిమబెంగాల్ లో దామోదర్ లోయ ప్రాజెక్టు, బీహార్ లోని కోసి ప్రాజెక్టు, ఆంధ్రాలో తుంగభద్ర ప్రాజెక్టు, మహారాష్ట్రలో కోయినా ప్రాజెక్టు, తమిళనాడులో కుందాలోయ ప్రాజెక్టు మొదలైనవి ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్ని నెహ్రూ ఆధునిక దేవాలయాలు అనేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జునసాగర్ మొదలుకొని.. దేశంలోని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న 18 సంవత్సరాలలో నిర్మాణం చేసినవే. ఈ ప్రాజెక్టుల శంకుస్థాపన సమయంలో నెహ్రూ మాట్లాడుతూ “ఇదొక భగీరధ యత్నం. వాస్తవిక పరిస్థితులను ఆధారం చేసుకొని ప్రాధాన్యత క్రమంలో వీటిని మొదలుపెట్టాం” అని అన్నారు. ప్రాధాన్యతలను ఎంచుకోవడంలో నెహ్రూ కనబర్చిన దూరదృష్టి దేశానికి ఎంతో మేలు చేసింది. అనుకొన్న సమయానికి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తికాగలిగాయి. సాగునీటి ప్రాజెక్టుల వల్ల లక్షలాది ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చాయి.

వ్యవసాయ రంగంలో పండిట్ నెహ్రూ తెచ్చిన సంస్కరణల ఫలితంగానే.. త్వరితగతిన దేశంలో ఆహారోత్పత్తుల స్వయం సమృద్ధి సాధ్యపడింది. ముఖ్యంగా ఆహారధాన్యాల వ్యాపారాన్ని జాతీయం చేయడం, సహకార సేద్యానికి అంకురార్పణ చేయడం మొదలైనవి సత్ఫలితాలు అందించాయి.

విదేశాంగ విధానంలో నెహ్రూ అనుసరించిన అలీన (తటస్థ) విధానం కారణంగా భారత్ కు ఎంతో ప్రయోజనం కలిగింది. సోవియెట్ రష్యా సహకారంతో బిలాయ్ ఉక్కు కర్మాగారం, పశ్చిమ జర్మనీ సాయంతో రూర్కెలా ఉక్కు కర్మాగారం, బ్రిటిష్ సహకారంతో దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం నిర్మాణాలు జరిగాయి. ఇనుము, ఉక్కు విద్యుత్, గనులు వంటి జాతి సంపదను పబ్లిక్ రంగంలోనే వృద్ధి చేస్తామని నెహ్రూ భారత ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని విస్పష్టంగా ప్రకటించారు. అదే సమయంలో ప్రైవేటు రంగానికి ఓ హెచ్చరిక కూడా చేశారు. ప్రైవేటు పరిశ్రమలను జాతీయం చేయబోమని చెబుతూనే.. నూతన సామ్యవాద ఆర్థిక వ్యవస్థ చట్రం పరిధికి లోబడి అవి పని చేయాలన్నారు. అంటే, అందులో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు తగిన భద్రతతోపాటు వేతనాలు, ఇతరత్రా ప్రోత్సాహకాల విషయంలో దోపిడీ చేస్తే సహించమని పరోక్షంగా తెలిపారు. తమది రూళ్లకర్ర సిద్ధాంతం కాదని, అలాగని ప్రజా దోపిడీకి పాల్పడితే సహించమని చెప్పినందునే పండిట్ నెహ్రూ దేశ ప్రజలకు ఆరాధనీయుడయ్యారు. జీవిత బీమా వ్యాపారాన్ని 1956లో జాతీయం చేసిన ఘనత కూడా నెహ్రూదే.

దేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకువెళ్లాలని నెహ్రూ నిరంతరం తలపోసేవారు. ప్రాశ్చాత్య దేశాలలో ఎక్కువకాలం ఉన్నందువల్లనే కాకుండా.. మొదట్నుంచీ ఆయనకు విజ్ఞానశాస్త్రం, సాంకేతికాభివృద్ధి రంగాలలో అమితమైన ఆసక్తి ఉండేది. వ్యవసాయం, ఇంధనం, ఔషధాలు, తోళ్లు, గ్లాసు, పింగాణీ మొదలగు రంగాలలో పరిశోధనలు జరపడానికి దేశవ్యాప్తంగా 12 జాతీయ ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే దేశం అణు శాస్త్ర పరిశోధనలో తొలి అడుగు వేసింది. రెండు అణు పరిశోధనశాలలను – ఒకటి బొంబాయిలో, రెండోది కలకత్తాలో ఏర్పాటు చేయించారు. ఆయన చొరవతోనే దేశంలోని తొలి అణు రియాక్టర్ ‘అప్సర’ నిర్మాణం జరిగింది. గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే చర్యలను ముమ్మరం చేశారు.

నెహ్రూ ప్రధానిగా ఉండగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. పరిపాలనా సౌలభ్యం, సంస్కృతీ వికాసానికి దోహదం చేసేందుకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరం అని అది శాస్త్రీయమైనదేనని భావించిన నెహ్రూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (మొదటి ఎస్ఆర్ సి) నియమించారు. దాని సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ తో సహా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.

దేశ ప్రధానిగా పండిట్ నెహ్రూ సాధించిన విజయాలు అనన్యసామాన్యం. ఆయన జీవితాన్ని రెండు పార్శ్వాలుగా చూడాలి. స్వాతంత్రోద్యమంలో ఆయన పోషించిన పాత్ర, ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న నిర్భంధాలు, చేసిన పోరాటాలు, దేశ ప్రజలను ఏకత్రాటి పైకి తేవడంలో చేసిన కృషి ఒక ఎత్తు అయితే, దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత.. దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపర్చడం మరో ఎత్తు. దేశంలో భాషాపరంగా సంస్కృతి, సామాజిక, ఆర్థికపరంగా ఎన్నో అసమానతలు ఉన్నప్పటికీ.. దేశ ప్రజలలో సమైక్యత, దేశభక్తి పెంపొందించడంలో నెహ్రూ గొప్ప విజయం సాధించారు. నెహ్రూ నాయకత్వంలో అంతర్జాతీయ సమాజంలో భారత్ కు పెరిగిన ప్రతిష్టను చూసి తట్టుకోలేని పొరుగు దేశాలయిన చైనా, పాకిస్థాన్లు అనేక సమస్యలు సృష్టించాయి. చైనాతో స్నేహాన్ని కోరుకోవడమేకాక ఆసియా ప్రాంతంలో శాంతి కోసం ‘పంచశీల’ ను ప్రతిపాదించి – అందుకు అనుగుణంగా పొరుగు దేశాలతో పరస్పర సహాయ సహకారాలు, శాంతి సాధించినప్పటికీ టిబెట్ మతగురువు దలైలామకు భారత్ ఆశ్రయం కల్పించడాన్ని చైనా సహించలేక లేకపోయింది. 1962లో భారతదేశంపై చైనా దండయాత్ర చేసి భారత్ లోని అధిక భూభాగాన్ని ఆక్రమించడాన్ని పండిట్ నెహ్రూ తట్టుకోలేకపోయారు. తీవ్రంగా కలత చెందారు. ఆయన ఆరోగ్యం క్షీణించింది. 1964 మే 27న నవభారత నిర్మాత ‘పండిట్ జవహర్లాల్ నెహ్రూ పరమపదించారన్న వార్త దేశ ప్రజలనే కాక యావత్ ప్రపంచాన్ని శోకసముద్రంలో ముంచింది. భౌతికంగా ‘నెహ్రూ’ దూరమై 57 సంవత్సరాలు అయినప్పటికీ.. ఆయన వేసిన విశిష్ట ముద్రలు ప్రతి రంగంలో కనబడతాయి. భారత దేశాన్ని ప్రగతి మార్గంలో ఒడివడిగా నడిపించిన దార్శనికుడిగా, ఆధునిక యుగకర్తగా పండిట్ నెహ్రూ దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు.

గిడుగు రుద్రరాజు మాజీ ఎమ్మెల్సీ,
సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి)