నూతన చరిత్ర మొదలైంది: చంద్రబాబు

129

తెలుగు జాతి అంటే దివంగత ఎన్టీ రామారావు గుర్తుకు వస్తారని, సమాజ హితం కోసం తెలుగుదేశం పనిచేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. డిజిటల్ మహానాడు గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం రాకతో నూతన చరిత్ర మొదలైందన్నారు. మే 28 యుగపురుషుడు ఎన్టీఆర్ పుట్టినరోజని, ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచారని, ప్రపంచంలోని ఏ మూలన చూసినా తెలుగువారు ఉన్నారన్నారు. సమస్యలపై ప్రజా చైతన్యం తీసుకొచ్చేలా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. సమాజహితం టీడీపీ ధ్యేయమని అన్నారు. కోవిడ్‌తో పెనుమార్పులు వస్తున్నాయని, కరోనాను ఎదుర్కొంటూ పోరాడాలని చంద్రబాబు పిలుపుఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వం సరైన రీతిలో ప్రజల్ని ఆదుకునే చర్యలు తీసుకోలేదని చంద్రబాబు విమర్శించారు. ఆక్సిజన్ లేక, మందులు కొనలేక ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసి పని చేద్దామని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నా బాధ్యత లేకుండా వ్యవహరించారని విమర్శించారు. సలహాలు, సూచనలను ఎగతాళి చేసి పారాసిట్‌మాల్, బ్లీచింగ్‌తో పోతుందని మాట్లాడారన్నారు. కరోనాతో సహజీవనం చేయాలంటూ.. ప్రజలకు భరోసా ఇచ్చే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదని మండిపడ్డారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చనిపోయిన వారి సంఖ్యను దాచిపెట్టి అవాస్తవాలు చెప్పారన్నారు. మానవ హక్కుల సంఘం విచారణ చేపడితే 23మందికి పరిహారం ఇస్తామని లెక్క మార్చారన్నారు. ఆనందయ్య వైద్యంపైనా నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆనందయ్య వైద్యంపై తప్పు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా పరామర్శించే టీడీపీ నేతలపై చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా తోచిన సాయం చేస్తూ 4 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు శ్రీకారం చుట్టామన్నారు.

మాట్లాడే వారి నోరు మూసేయాలంటూ స్టేట్ టెర్రరిజానికి అధికారపార్టీ నేతలు పాల్పడతున్నారని చంద్రబాబు అన్నారు.  ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పతనం చేసే పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా తీసుకొచ్చారని ఆరోపించారు. న్యాయస్థానాల్ని కూడా బెదిరించే పరిస్థితికి వస్తే ప్రజా స్వామ్యం ఎటుపోతోందో అర్థం చేసుకోవాలన్నారు. అచ్చెన్నాయుడుతో మొదలు పెట్టిన అక్రమ కేసులు బీసీ జనార్థన్ రెడ్డి వరకూ కొనసాగించారని.. రఘురామ కృష్ణం రాజుపై తప్పుడు కేసులు పెట్టి పోలీసు కస్టడీలో హింసించారన్నారు. స్థానికంగా అంతా మేనేజ్ చేశారు.. కానీ సుప్రీం కోర్టులో అడ్డంగా దొరికి పోయారన్నారు. బెయిల్ రాకుండా ఉండేందుకు ఏడేళ్లు పైబడి శిక్షపడే కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు.

వైద్యుడు సుధాకర్, కోడెల శివప్రసాదరావు సహా ఎంతోమంది ప్రభుత్వ వేధింపులు భరించలేక చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పౌరహక్కులు, మాట్లాడే వాక్ స్వాతంత్ర్యం ఎక్కడుందని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిని వెంటాడుతున్నారని, రాష్ట్ర ఉగ్రవాదాన్ని అంతా ఖండించాలని పిలుపు ఇచ్చారు. చేయని తప్పుకు వేధిస్తున్న తెలుగుదేశం శ్రేణుల కుటుంబ సభ్యుల్ని తలచి నిద్రపోని రాత్రులు గడిపానని చంద్రబాబు అన్నారు.