రైతు వ్యతిరేక ప్రభుత్వం

292

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ రైతాంగం చేపట్టిన పోరాటానికి ఆరు నెలలు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన బ్లాక్‌డే విజయవంతమైంది. కరోనా వ్యాప్తి కారణంగా విధించిన ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ ప్రజానీకం రోడ్ల మీదకు వచ్చి ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయడం అపూర్వం. రైతులు, వ్యవసాయ కూలీలతో పాటు ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, శాంతియుతంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం సానుకూల పరిణామం. స్వతంత్ర భారత చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా పోరాటం సాగుతున్నా, అన్ని తరగతుల ప్రజానీకం నుండి మద్దతు లభిస్తున్నా నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఇసుమంత కూడా మార్పు రాకపోవడం విచారకరం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో వ్యవహరిస్తోంది. తమతో తిరిగి చర్చలు ప్రారంభించి, సమస్యను పరిష్కరించాలంటూ సంయుక్త కిస్తాన్‌ మోర్చా చేసిన విజ్ఞప్తిని బేఖాతరు చేయడం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి అద్దం పడుతోంది. దీంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేయక తప్పని స్థితి రైతు సంఘాలకు ఏర్పడింది.

నిజానికి గడిచిన ఆరు నెలలుగా రైతాంగ ఉద్యమాన్ని చీల్చడానికి కేంద్ర సర్కారు చేసిన ప్రయత్నాలు అన్నీ, ఇన్నీ కావు. పోరాడుతున్న రైతులను చీల్చడం దగ్గర నుండి, పోరాటంపై తప్పుడు ప్రచారం చేసే నీచపు ఎత్తుగడల వరకు అన్నింటిని అమలు చేసింది. రైతులను ఢిల్లీ సరిహద్దులకు రానీయకుండా రోడ్లపై గుంతలు తవ్వింది. బారికేడ్లు కట్టింది. లాఠీఛార్జీలు, వాటర్‌ కేనన్ల ప్రయోగాల వంటివి చెప్పనవసరం లేదు. రిపబ్లిక్‌ డే రోజు జరిగిన ప్రహసనం వీటికి పరాకాష్ట. ఒక్క మాటలో చెప్పాలంటే సామ, దాన, భేద, దండోపాయాలన్నింటిని కేంద్రం ప్రయోగించింది. చివరకు కరోనా పరిస్థితులనూ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించింది. అయినా, రైతాంగంలో ఐక్యత ఏమాత్రం చెక్కు చెదర లేదు. మరింత దృఢంగా నిలబడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ పెరుగుతున్న కర్షక వీరుల సంఖ్యే దీనికి నిదర్శనం. వ్యవసాయ పనుల కోసం స్వగ్రామాలకు వెళ్లిన రైతులు మళ్లీ వెనక్కి రావడంతో పాటు, కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ పోరాటం కొనసాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రైతు ఉద్యమం ఒకటి, రెండు రాష్ట్రాలకే పరిమితమైందంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచారమూ అవాస్తవమని తేలిపోయింది. కరోనా రెండవ ఉధృతికి ముందు రైతాంగానికి మద్దతుగా జరిగిన అన్ని ఆందోళనలు తెలుగు రాష్ట్రాల్లో సైతం విజయవంతమైనాయి. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే స్థితి.

సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ని ఓడించాలని ప్రచారం చేశారు. మోడీ, షాలు రెక్కలు కట్టుకుని విపరీతంగా బిజెపి గెలుపు కోసం ప్రయత్నించినా రైతు నేతల ప్రచారమే పై చేయి సాధించి ఎన్నికల్లో బిజెపి చతికిలపడింది. ఇక, బిజెపి ఏలుబడిలో ఉన్న గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోనూ రైతులు రోడ్ల మీదకు వస్తున్నారు. మరోవైపు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టేంత వరకు వెనక్కి తగ్గేది లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా స్పష్టం చేసింది.

గత మూడు దశాబ్దాలుగా దేశంలో అమలైన నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పాలక వర్గాలను కార్పొరేట్ల చేతుల్లో బంధీలను చేశాయి. నరేంద్రమోడీ, ఆయన పరివారం కార్పొరేట్ల కీలుబొమ్మలుగా మారి రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారు. తమ యజమానుల ప్రయోజనాల కోసం బరితెగిస్తున్నారు. అందుకే, రైతాంగ పోరాటాన్ని బలపరచడమంటే ఉదారవాద ఆర్థిక విధానాలకు, కార్పొరేట్‌ దోపిడి కి వ్యతిరేకంగా చేసే పోరాటమే! ఈ పోరాటాన్ని మరింత ఐక్యతతో, మరింత ఉధృతంగా కొనసాగించాల్సిన బాధ్యత అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులపై ఉంది.

                         (ప్రజాశక్తి – సంపాదకీయం  )