కోవిడ్ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న జిల్లా యంత్రాంగం

107

– రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి
– ఎంఎన్వో , ఎఫ్ఎంవో, స్టాఫ్ నర్స్ ల భర్తీకి చర్యలు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

జిల్లాలో నెలకొన్న కోవిడ్ -19 విపత్కర పరిస్థితులను జిల్లా యంత్రాంగం ఎంతో సమన్వయంతో సమర్ధవంతంగా ఎదుర్కొంటోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.  గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ పై జరిగిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశానికి మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జిల్లా ఆసుపత్రి మచిలీపట్నంలో ఉండడం వల్ల అత్యవసర కేసులను గుడివాడ నుండి తరలించి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని, రాష్ట్ర రవాణా, సమాచార శాఖ పేర్ని వెంకట్రామయ్య (నాని) పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో 25 ఆక్సిజన్ బెడ్స్ తో కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామన్నారు. కోవిడ్, నాన్ కోవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు సిబ్బంది కొరత ఉందని, ఎంఎన్‌వో, ఎఫ్ఎంవో, స్టాఫ్ నర్స్ లను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు. జిల్లాలో కోవిడ్ మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపుతోందన్నారు. దీన్ని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం దృష్టిసారించి ఆసుపత్రులకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తోందన్నారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణే లక్ష్యంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ విధానాల్లో ముందుకు వెళ్తున్నామన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ లో మే నెల్లో 11 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, గత నాలుగైదు రోజుల్లో 10 శాతం లోపే నమోదై తగ్గుముఖం పడుతోందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 9 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేశామన్నారు. గుడివాడ డివిజన్లో 20 వేల 093 మందికి వ్యాక్సిన్ అందించామన్నారు. జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రుల్లో రద్దీని తగ్గించేందుకు తిరువూరు, గుడివాడ, కైకలూరు, అవనిగడ్డ, నందిగామ, గూడూరు ప్రాంతాల్లోని కేర్ ఆసుపత్రులతో పాటు కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు సకాలంలో వైద్య సేవలందిస్తున్నామన్నారు. గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో పల్మనాలజిస్ట్ ప్రతిరోజూ నిర్దేశించిన సమయంలో కోవిడ్ రోగులను పరీక్షించి వారి ఆరోగ్య స్థితిగతులపై నివేదిక అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవిని ఆదేశించారు. డిప్యూటి డీఎంహెవో సుదర్శనబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు గుడివాడ డివిజన్లో 862 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఇంటింటి సర్వే ద్వారా ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ ఆయా పీహెచ్సీల్లో సేకరించిన శాంపిల్స్ రిపోర్ట్స్ ను 24 గంటల్లో సంబంధిత వ్యక్తులకు అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవి మాట్లాడుతూ రోగుల సౌకర్యార్ధం లిఫ్ట్, వెంటిలేటర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, డీసీహెచ్వో జ్యోతిర్మయి, గుడివాడ ఆర్డీవో జీ శ్రీనుకుమార్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, మండల తహసీల్దార్ శ్రీనివాస్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ రాణి శిరీష, డాక్టర్ గోవర్ధన్, డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.