తెలంగాణలో నీలి విప్లవం:తలసాని

157

– ఈ ఏడాది కూడా ఉచిత చేపపిల్లల పంపిణీ

తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ  కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకు మరింత పకడ్బందీ చర్యలను చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకురావాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు ప్రభుత్వం మత్స్య రంగ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. మత్స్యకారుల అభివృద్ధి ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం రాష్ట్రంలోని 28 వేలకు పైగా నీటి వనరులలో 89 కోట్ల రూపాయల వ్యయంతో 93 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు.
అదేవిధంగా రొయ్యల పెంపకానికి అనువుగా ఉండే చెరువులను గుర్తించి 25 కోట్ల రూపాయల వ్యయంతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పంపిణీకి అవసరమైన చేపపిల్లల కొనుగోలు విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న చేప పిల్లలను మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా మార్గదర్శకాలు రూపొందించాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ను మంత్రి ఆదేశించారు. 10 రోజులలలో టెండర్ లు ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.  టెండర్ ప్రక్రియ పూర్తయిన అనంతరం తప్పనిసరిగా చేప పిల్లల సరఫరా దారులకు చెందిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను సందర్శించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అనే విషయాన్ని నిశితంగా పరిశీలించాలని, తనిఖీ లను తప్పని సరిగా వీడియో, ఫోటోగ్రఫీ చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో చేపల పెంపకం చేపట్టేందుకు అనువుగా 34,024 చెరువులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, వాటిలో ఇప్పటి వరకు 28,704 చెరువులకు జియోట్యాగింగ్ చేయడం జరిగిందని, మిగిలిన 5,056 చెరువులకు జియోట్యాగింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతనంగా పెద్ద ఎత్తున నీటి వనరులు పెరిగాయని, అన్ని నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేయడం ద్వారా మత్స్య సంపదను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పెరుగుతున్న మత్స్య సంపదకు విస్తృత మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు అనేక చర్యలను ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. ప్రజల వద్దకే నాణ్యమైన చేపలు, చేపల వంటకాలను తీసుకెళ్ళాలనే లక్ష్యంతో  GHMC పరిధిలో 150 మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను ప్రారంభించాలని నిర్ణయించి 60 శాతం సబ్సిడీ పై 100 వాహనాలను అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన వాహనాల పంపిణీ ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ ఔట్ లెట్ లతో సత్ఫలితాలు వస్తున్నాయని, ప్రజల నుండి కూడా మంచి స్పందన లభిస్తుందని అన్నారు. విజయ పాలు, పాల ఉత్పత్తుల ఔట్ లెట్స్ తరహాలో త్వరలో తెలంగాణా బ్రాండ్ పేరుతో చేపలు, మరియు సముద్ర చేపలు, చేపల వంటకాల విక్రయాలను పెద్ద ఎత్తున చేపట్టన్నునట్లు తెలిపారు. ఇందుకోసం నూతనంగా 500 ఔట్ లెట్  లను ఏర్పాటు చేసేందుకు చర్యలను చేపట్టడం జరుగుతుందని అన్నారు.  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో సైజ్ కు వచ్చిన చేపలను ఆయా జిల్లాల మత్స్య శాఖ అధికారుల సమన్వయంతో మత్స్య ఫెడరేషన్ చేపలను కొనుగోలు చేసి మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ కు, రిటేల్ విక్రయదారులకు సరఫరా చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీని వలన దళారులకు చేపలను తక్కువ ధరకు విక్రయించుకొని నష్టపోతున్న మత్స్య కారులకు మంచిధర చెల్లించి ఆదుకునే అవకాశం ఉంటుందని, ఇటు ప్రజలకు నాణ్యమైన చేపలను తక్కువ ధరలకు విక్రయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్వహణ కోసం అనువైన స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. నూతన ఔట్ లెట్ లను  ఏర్పాటు చేయడం వలన అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. గతంలో మత్స్యకారులు సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే చేపల వేట కొనసాగించే వారని, తెలంగాణా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నందున సంవత్సరం పొడవున చేపల వేట కొనసాగిస్తూ మత్స్యకారుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని చెప్పారు. మత్స్యకార వృత్తి పై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలలో వెలుగులు నింపాలి అనేది ముఖ్యమంత్రి లక్ష్యం అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.