జననం..మరణం…అదే జీవితం

309

ఓరోజు ఓ రాజు ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు బుద్ధుడు తన  శిష్యగణంతో కలిసి బయలుదేరి వెళ్ళాడు. రాజ మందిరంలో రాజకుటుంబీకుల సందేహాలకు సమాధానమిస్తూ… సుఖదుఃఖాలకు.. కష్టాలు..కన్నీళ్లకు..శాంతి..సౌక్యాలకు మనిషి ప్రవర్తనే కారణమని హిత బోధ చేస్తాడు.‌ ఆ సమయంలో  బుద్ధుడు రాజ మందిరంలో ఉన్నాడని తెలిసి…విగత జీవిగా మారిన తన చంటి పాపను చేతుల్లో ఎత్తుకుని రోదిస్తూ ఓ స్త్రీ బుద్ధున్ని కలిసేందుకు వచ్చింది.

రాజ భటులు ఆ స్త్రీ ని అడ్డుకున్నారు. అయినా ఆ స్త్రీ కన్నీరు కారుస్తూనే…భటులను విదుల్చుకుని బుద్ధుడు ఆసీనుడైన వైపు పరుగెత్తి వస్తుండగా…భటులు తిరిగి అడ్డుకోబోయారు. దూరం నుండి విషయాన్ని గమనించిన బుద్ధుడు “ఆ మహిళను పంపించండి” అని భటులను కోరుతాడు. ఆ స్త్రీ గుండెలవిసెలా రోదిస్తూ… తన చేతుల్లోని  విగతజీవిగా మారిన తన పాపను చూపిస్తూ” హే భగవాన్ మీరే నా పాపను బ్రతికించాలి” అంటూ విలపిస్తుంది.‌ఆమె గర్బ శోఖాన్ని అర్థం చేసుకున్న బుద్ధుడు ” తప్పకుండా బ్రతికిస్తాను” అని బదులిస్తాడు. బుద్ధుడి మాటలకు అక్కడ ఉన్న రాజు..రాజ కుటుంబీకులు… బ్రాహ్మణులు విస్మయానికి లోనవుతారు. ” చనిపోయిన వారిని బుద్ధుడు బ్రతికించగలడా” , ” ఇది సాధ్యమవుతుందా? . మరి మాట తప్పని బుద్ధుడు ఆ స్త్రీకి చనిపోయిన బిడ్డను బ్రతికిస్తానని ఎలా మాటిచ్చాడు” బుద్ధుని ఆలోచన ఏమిటో అర్థం కాక…ఏం జరుగుతుందా? అని ఒకింత ఆశ్చర్యంతో ఊపిరిబిగపట్టి ఎదురు చూస్తున్నారు. బుద్ధుని పరివారం మాత్రం ఏం జరుగుతుందో తెలిసినా…బుద్ధుని ఆలోచనను మరోసారి అర్థం చేసుకునే అవకాశం కోసం మౌనంగా నిరీక్షణలో ఉండి పోయారు. అక్కడున్న ప్రతి ఒక్కరి ఆలోచన  మస్తిష్కంలో  సుడులు తిరుగుతూ..ఏం జరుగుతుందనే ఉత్కంఠ ను రేకెత్తిస్తోంది.‌ బుద్ధుడు కొద్దిసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.

వాతావరణం గంభీరంగా మారిపోయింది. బుద్ధుని సమాధానం కోసం ప్రతీ ఒక్కరూ మౌన ముద్ర దాల్చడంతో సూదిపడితే వినిపించేంత నిశబ్ధం ఆవరించింది. నిశబ్దాన్ని చీలుస్తూ ” అమ్మా నీ బిడ్డను నేను తిరిగి బ్రతికిస్తాను” అంటూ బుద్ధుడు ఆ స్త్రీని ఓదార్చాడు. ” బ్రతికించండి భంతే..బ్రతికించండి” అంటూ ఆ స్త్రీ కన్నీటి పర్యంతమవుతూ బుద్ధుడిని వేడుకుంది.‌” అమ్మా నువ్వు ఎవరింటి నుంచైనా పిడికెడు ధాన్యాన్ని దానంగా తీసుకు వస్తే , నీ బిడ్డను తప్పకుండా బ్రతికిస్తాను” అంటూ అభయమిస్తాడు బుద్ధుడు. బుద్ధుని మాటలతో ఆ స్త్రీ చనిపోయిన తన బిడ్డ తిరిగి బ్రతికి వచ్చినంతగా ఆనందపడుతుంది. అంతలో బుద్ధుడు సంభాషణ కొనసాగిస్తూ ” అయితే ఎవరూ మరణించని కుటుంబం నుండి మాత్రమే ధాన్యాన్ని దానంగా సేకరించి తీసుకుని వస్తేనే నీ బిడ్డను బ్రతికించడం సాధ్యమవుతుంది ” అని బుద్ధుడు బదులిస్తాడు.

బుద్ధుని మాటలతో కన్నీటిని దిగమింగుకుంటూ…ధాన్యాన్ని దానంగా తీసుకు రావడానికి బయలుదేరి వెళ్తుంది. కానీ..చనిపోయిన చిన్నారిని బ్రతికించడానికి, ధాన్యాన్ని దానంగా తీసుకు రావడానికి సంబంధం ఏమిటో ఎవరికీ అంతు పట్టలేదు. బుద్ధుడిని ఆ విషయం అడగాలని ప్రతీ ఒక్కరి మనసు కుతూహలంతో పాలపొంగులాగ, ఎగిసిపడే కెరటాల మాదిరిగా అలజడిలో ఊగిసలాడుతోంది. మరోపక్క ధాన్యం కోసం బయలుదేరిన ఆ స్త్రీ ఆ రాజ్యంలోని ఓ ఇంటి తలుపు తట్టింది…కొద్ది సేపటికి ఓ నడివయస్కుడు తలుపు తీసి బయటకు వచ్చి ” ఏమి కావాలి మీకు” అంటూ ప్రశ్నిస్తాడు.  ” తనకు కొంత ధాన్యాన్ని దానంగా ఇవ్వాలని” ఆ స్త్రీ కోరుతుంది. దానికి ఆ నడివయస్కుడు ” అదేం భాగ్యం” అంటూ ధాన్యాన్ని తేవడానికి ఇంట్లోకి వెళ్లబోతుండగా,  బుద్ధుడు అన్న మాటలు గుర్తుకు వచ్చి..” ఆగండి..మీ కుటుంబంలో ఎవరైనా మరణించారా?” అంటూ ప్రశ్నిస్తుంది. ఆ నడి వయస్కుడు బదులిస్తూ ” ఎందుకు” అని అడుగుతాడు. మళ్ళీ తనే “అవును నా జీవన సహచరిని నన్ను వీడి శాశ్వతంగా దూరమైంది ” అంటూ కంట్లో ఉబికి వస్తున్న నీటిని తుడుచుకుంటూ బదులిస్తాడు.

ఆమాటలకు ” క్షమించండి మానవుల మరణం సంభవించిన గృహం నుండి దానం స్వీకరించలేనని” ఆ స్త్రీ అక్కడి నుండి మరో ఇంటికి వెళ్తుంది. అక్కడ తలుపు తట్టగానే లోపలి నుండి భర్తను కోల్పోయిన ఓ విధవరాలు బయటకు రావడంతో.. చలించిపోయిన స్త్రీ దానం గురించి ప్రస్తావించకుండానే వేగంగా వెనుతిరిగి వెళ్లిపోయింది. అలా మరో గృహానికి వెళ్లి ధాన్యాన్ని దానంగా అడిగి..” మీ గృహంలో ఎవరైనా మరణించారా” అంటూ ప్రశ్నిస్తుంది. దానికి ” చేతికి అంది వచ్చిన నా కుమారుడు మరణించి మాకు దూరమయ్యాడు” అంటూ ఆ గృహస్థు బదులిస్తాడు. చేతుల్లోని చిన్నారి మృతదేహాన్ని భుజాన వేసుకుని, కన్నీటి పర్యంతమవుతూ..వెళ్తుండగా.. ఊరిలో ఓచోట జనాలు గుంపుగా కనిపిస్తారు. వీరిలో ఏ ఒక్కరైనా తనకు ధాన్యాన్ని దానం చేసే అర్హత కలిగిన వాళ్లు ఉండక పోతారా? అనే ఆశతో గుంపు వద్దకు చేరుతుంది.

ఆమె అలికిడికి గుంపులోని కొందరు పక్కకు వైదొలగగా, అక్కడ కనిపించిన దృశ్యం ఆమెలోని ఆశలు నీరుగారిపోతాయి. కారణం అక్కడ ఓ వ్యక్తి అంత్యక్రియల ఏర్పాట్లు సాగుతుండటమే. ఆ దృశాన్ని చూసి నోటమాట రాక…అక్కడి నుంచి కదిలి మరో ఇంటికి వెళ్ళి తలుపు తడుతుంది. కానీ బదులు రాకపోవడంతో… మరోసారి తలుపు గొళ్లెం పట్టుకుని చప్పుడు చేస్తుంది. అయినా బదులు రాకపోవడంతో… ఓ చేతిలో తన గారాల పట్టి మృతదేహాన్ని ఎత్తకుని, మరోచేత్తో తలుపును బలంగా తోయడంతో, కిర్ర్ర్ ర్ ర్ ర్ మంటూ తలుపులు తెరుచుకుంటాయి.

“ఇంట్లో ఎవరైనా ఉన్నారా?” అంటూ పిలుస్తుంది. ఆమె పిలిచాననుకుంటుందే కానీ… ఆమె నోటినుంచి  అరుపుల శబ్దం బయటకు వచ్చింది. చిన్నారి మరణం బాధలో ఉన్న ఆమెకు ఆ విషయం తెలియదు. లోపల ఎటువంటి అలికిడి లేకపోవడంతో మెల్లిగా ఇంట్లోకి అడుగుపెట్టి ఒక్కో గదిని కలియతిరుగుతూ…శయన మందిరంలోకి ప్రవేశిస్తుంది. పట్టు పాన్పుపై కనిపించిన దృశ్యం, ఆ స్త్రీ మనసులో తుపాను రేపుతుంది. అక్కడి పరిస్థితి చూసి ” నా బిడ్డ తిరిగి బతకడం అసాధ్యం ” అని  కుమిలి కుమిలి శోకిస్తుంది. ఆమె శోకించడానికి, పట్టుపాన్పుపై రక్తం మడుగులో ఓ తల్లీపిల్ల విగత జీవులుగా పడి ఉండటమే. ఎవరో వారిద్దరినీ నరికి చంపినట్లు అక్కడి పరిస్థితిని చూసిన వారికి  అవగతమవుతుంది.  ఆమెకూ అట్లాగే అనిపించింది. వాళ్లను ఎవరు చంపారనే సందేహం  ఆమెకు ఏ కోశానా కలగలేదు. ఆమె కళ్లముందు ఆ తల్లీ కూతుళ్ళ శవాలు… అంతకుముందు తనకు ఎదురైన అనుభవాలు కళ్లముందు గిర్రున తిరిగాయి. అప్పడామెకు అర్థం అయింది. ఈ విశ్వంలో ప్రతీ ఒక్కరికి మరణం తప్పదని. ఎవరూ మరణించని ఇంటి నుండి ధాన్యాన్ని దానంగా తీసుకు రావాలని బుద్ధుడు ఎందుకు అన్నాడో, ఆమెకు బోధపడింది. విగత జీవిగా మారిన తన చిన్నారి ఇక ఎప్పుడూ కళ్లు తెరవదని, ” మాతా” అంటూ తనను పిలవదనే విషయం అవగతమవడంతో…కన్నీళ్ళు దిగమింగుకుంటూ తన గారాల పట్టిని సమాధి చేసి…ఎటు వెళ్లాలో తెలియక ఆ శ్మశానంలో నక్కల ఊలల్లో కలిసిపోతున్న రోధనలో అలసిసొలసి ..కదలలేక..తన బిడ్డ  సమాధిని వదలలేక..వదలలేక వదిలి వెళ్తుంది.

రాజప్రసాదంలో రాజ దంపతులు..వారి పరిహారం… బ్రహ్మణులు..బౌద్ధ భిక్షువులు ఆ స్త్రీ రాక కోసం ఎదురు చూసీ…చూసీ ఇక ఆగలేక ” భగవాన్…ఆ స్త్రీ ఇంకా తిరిగి రాలేదు, పిడికెడు ధాన్యం కూడా ఆమెకు దొరక లేదా” అని రాజు సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. మౌన ముద్రలో ఉన్న బుద్ధుడు కళ్లు తెరిచి..” మీరేమి అనుకుంటున్నారు” అని ప్రశ్నించి అక్కడున్న వారి కళ్ల లోకి చూస్తాడు. ” ప్రతీ మనిషికి జననం… మరణం.. ఈ రెండు తప్పవు” అంటూ బదులిస్తాడు. ” పుట్టుక ఎంత నిజమో…చనిపోవడం కూడా అంతే నిజం”. మరణించిన వారు తిరిగి బ్రతకడం అనేది అసంభవం, అది ఎవరి వల్లా కాదు” అని సమాధానమిస్తాడు బుద్ధుడు.

”  భగవస్వరూపులైన మీవల్ల అవుతుంది కదా?  భగవాన్” అని రాజు తన మనసులోని మాటను ఏకరువు పెడతాడు. దానికి ” నేను భగవంతుడిని కాదు, మీ అందరిలాంటి మనిషినే, నిజానికి ఉనికిలో లేని దైవం గురించి ఆలోచించడమే అవివేకం, ఇక  లేని దేవుడికి శక్తులు ఎక్కడి నుండి వస్తాయి” అని సమాధానం ఇస్తాడు బుద్ధుడు. ”  ఎవరిదాకో ఎందుకు! నేనుకూడా ఏదో ఒకనాడు ఈ మట్టిలో కలిసిపోవలసిన వాడినే, నేనేమీ అతీతశక్తులను కలిగి లేను, ఇదే సత్యం… ఇదే నిజం.”.

” నిజం నిష్టూరంగా ఉంటుంది, అసత్యం అద్భుతంగా అనిపిస్తుంది, అంత మాత్రాన అసత్యాన్ని ఆచరించడం అంటే వాస్తవానికి దూరంగా అవివేకిలా జీవించడమే” అని బుద్ధుడు వివరిస్తాడు. ” తన చిన్నారిని కోల్పోయిన ఆవేదనలో ఉన్న ఆ స్త్రీ నన్ను దైవంగా భావిస్తుంది, నాకు అతీత శక్తులు ఉన్నట్లు భ్రమిస్తోంది. ఆ కారణంగా తన చిన్నారిని నేను తిరిగి బ్రతికిస్తాననే నమ్మకంతో నా వద్దకు వచ్చింది ” అని బుద్ధుడు సెలవిస్తాడు. ” అయితే పుట్టిన ప్రతీ మనిషి మరణించడమూ ఖాయమనే సత్యాన్ని ఆమె స్వయంగా గ్రహించేందుకే, మరణం లేని ఇంటి నుంచి ధాన్యాన్ని దానంగా తీసుకువరావాలని సూచించాను” అంటాడు బుద్ధుడు.

”  ధాన్యం కోసం అనేక ఇళ్ళు తిరిగిన ఆ స్త్రీకి ప్రతీ జీవికీ మరణం తప్పదనే సత్యం అవగతమైంది, ఆ కారణంగానే ఆ స్త్రీ తన చిన్నారిని బ్రతికించాలని తిరిగి అడగడానికి రాలేదు” అని వివరిస్తాడు బుద్ధుడు. ” అంతేకాదు మనిషి చనిపోయి..తిరి మళ్లీ జన్మిస్తాడని చాలామంది భ్రమిస్తుంటారు. ” .మనిషికే కాదు, ప్రతీ జీవికీ పునర్జన్మ అనేది ఉండదు. పునర్జన్మ అనేది అభూత కల్పన” ప్రతివారూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని” బుద్ధుడు హితబోధ చేస్తాడు..బుద్ధుడి బోధనలతో రాజుతో పాటు అక్కడున్న ప్రతీ ఒక్కరికీ జీవిత సత్యం బోధపడి…బుద్ధుడికి నమస్కరిస్తారు.

– జంగిటి వెంకటేష్,
సీనియర్ జర్నలిస్ట్, సామాజిక విశ్లేషకులు,
9052889696