రెండేళ్లలో మహిళలకు రూ.88,040.29 కోట్ల లబ్ది

604

• వైఎస్సార్ ఆసరా ద్వారా 77,75,681 మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,310.68 కోట్ల లబ్ది

• వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 98,00,626 మహిళా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.2,354.22 కోట్ల లబ్ది

• వైఎస్సార్ చేయూత పథకం క్రింద 24,55,534 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,604.13 కోట్లు జమ

• వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్ల ఆర్థిక సాయం

• రూ.1,863.13 కోట్లు ఖర్చుతో 30,16,000 మంది అక్కచెల్లెమ్మలు, చిన్నపిల్లలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణతో లబ్ది

అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గత రెండేళ్లలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేసింది. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి లక్ష్యంగా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రతి తల్లి తన బిడ్డలను మంచి చదువులు చదివించే పరిస్థితి కల్పించాలన్న లక్ష్యంతో రెండేళ్లలో రూ.13,022.93 కోట్లతో జగనన్న అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15,000 వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో సుఖశాంతులు నింపేందుకు మద్య నియంత్రణ అమలు చేయడంతో పాటు 27 వేల కోట్ల ఖర్చుతో 30,76,000 ఇళ్ల పట్టాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇచ్చి  మహిళా అభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఒక మహిళకు ఉప ముఖ్యమంత్రిగా, మరో మహిళకు హోంశాఖ మంత్రిగా అవకాశం కల్పించడం ద్వారా  కేబినెట్ లో కీలక శాఖలను మహిళలకు అప్పగించి, మహిళా పక్షపాత ప్రభుత్వంగా నిలచింది. స్థానిక సంస్థల పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే గాక కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 61 శాతం పదవులు కేటాయించి అత్యధిక ప్రాధాన్యత కల్పించింది వైఎస్సార్ ప్రభుత్వం.

వైఎస్సార్ ఆసరా : గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలోని దాదాపు 8.7 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 87 లక్షల పైచిలుకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు వాణిజ్య, సహకార బ్యాంకులకు 3 వేల కోట్ల పైచిలుకు అపరాధ వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. పొదుపు సంఘాల దుస్థితిని గమనించిన ప్రభుత్వం ఎన్నికల నాటికి (ఏప్రిల్ 11, 2019) వాణిజ్య, సహకార బ్యాంకుల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉన్న అప్పులను తీర్చుతామని పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం క్రింద పొదుపు సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.27,168 కోట్ల రుణాలను 4 వాయిదాల్లో వారి ఖాతాలలో జమ చేస్తోంది. తొలి విడతగా 77,75,681 మంది అక్కచెల్లెమ్మలకు గత సంవత్సరం సెప్టెంబర్ 11న రూ.6,310.68 కోట్లు అందజేసింది.  డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఈ డబ్బులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద ఎటువంటి షరతులు విధించకుండా, వారికి ఇష్టం వచ్చిన అవసరాలకు లేదా వ్యాపారాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు, వ్యాపారవేత్తలుగా మారి స్వావలంబన సాధించడం కోసం ఇప్పటికే ప్రభుత్వం P&G, ITC, HUL, AMUL, ALLANA లాంటి దిగ్గజ సంస్థలతో, వివిధ బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది.

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం (మహిళలు) : బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలకు ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకం క్రింద ప్రభుత్వమే చెల్లిస్తోంది. 2019 ఏప్రిల్ 1 నుండి 2020 మార్చి వరకు 90,37,255 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.1,400 కోట్ల వడ్డీ బకాయిలు కూడా వారి తరపున ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించింది. ఈ ప్రభుత్వంపై నమ్మకం బలపడటం వల్ల అర్హులైన అక్కచెల్లెమ్మల స్వయం సహాయక సంఘాల సంఖ్య గత సంవత్సరం ఉన్న 8.71 లక్షల నుంచి 9.34 లక్షలకు పెరిగింది. స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మల సంఖ్య నేడు 1.11 కోట్లకు చేరింది. ఇప్పటివరకు  ఈ పథకం క్రింద 98,00,626 మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులకు మొత్తం రూ.2,354.22 కోట్లు లబ్ది చేకూరింది.

వైఎస్సార్ చేయూత: మహిళల ఆర్థిక స్వావలంబనకు, వారి పిల్లల చదువులు మరియు వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్.సి, ఎస్.టీ, బి.సీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ.18,750 ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయం  అందజేస్తోంది. తద్వారా కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకలు వంటివి కొనుగోలు చేసుకోవడం ద్వారా అనేక జీవనోపాధి మార్గాలను చూపిస్తూ వారికి తోడుగా నిలుస్తోంది. అక్కచెల్లెమ్మలకు సాంకేతిక, మార్కెటింగ్ సహకారాలు అందించి వ్యాపార అవకాశాలు పెంచేందుకు AMUL, ITC, HUL, P&G, RELIANCE లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో పాటు బ్యాంకులతో కూడా ఇప్పటికే అవగాహనా ఒప్పందాలు చేసుకుంది. అక్కచెల్లెమ్మల వ్యాపారాభివృద్దికి కావాల్సిన నైపుణ్యాలు, మార్కెటింగ్ లో శిక్షణ అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 69,000 షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. 2021 ఏప్రిల్ నాటికి వైఎస్సార్ చేయూత పథకం క్రింద 24,55,534 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,604.13 కోట్లు ప్రభుత్వం జమ చేసింది..

వైఎస్సార్ కాపు నేస్తం : 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న పేద కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల పేద అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15,000 ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్ల ఆర్థిక సాయం అందించడం జరిగింది.

వైఎస్సార్ సంపూర్ణ పోషణ : గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించి సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన భావి భారత పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా ప్రతి రోజు మెనూ మార్చి మెరుగైన మధ్యాహ్న భోజనం, మెరుగైన నెలవారీ పౌష్టికాహారం ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలకు పోషకాహారం అందించడానికి గత ప్రభుత్వ హయాంలో సగటున ఏడాదికి రూ.500 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఈ ప్రభుత్వం నాలుగు రెట్లు ఎక్కువగా రూ.1,863.13 కోట్లు ఖర్చు చేస్తోంది. తద్వారా 30,16,000 మంది అక్కచెల్లెమ్మలు, చిన్నపిల్లలు లబ్ది పొందుతున్నారు.

వైఎస్సార్ ఈబీసీ నేస్తం : 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసున్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఏటా        రూ. 15,000 చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు ప్రభుత్వం అందించనుంది. ఇందుకుగాను ఏడాదికి రూ.670 కోట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.2,011 కోట్లు ఖర్చు చేయనుంది. తద్వారా 4 లక్షల మంది లబ్ది పొందనున్నారు.

• జగనన్న జీవ క్రాంతి పథకం క్రింద మేకలు /గొర్రెలకు సంబంధించి ప్రభుత్వం 72,179 యూనిట్లు కొనుగోలు చేయించి మహిళలకు ఆదాయం పెంచింది. పాల ఉత్పత్తిలో అమూల్ తో ఒప్పందం చేసుకొని లీటర్ పాలకు అక్కచెల్లెమ్మలకు 5 నుండి 15 రూపాయల వరకు అదనపు ఆదాయం లభించే విధంగా చేసింది. “జగనన్న అమూల్ పాలవెల్లువ” పథకం క్రింద ఆవులు, గేదెలకు సంబంధించి 1,12,008 యూనిట్లు కొనుగోలు చేయించి తద్వారా మహిళలను మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారిని వాళ్ల కాళ్లపై నిలబడేటట్లు చేస్తోంది.

• అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం  రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోంది
.
• మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది.

• బాలికలు, మహిళల రక్షణ కోసం ఏపీ దిశ చట్టం తీసుకొని వచ్చి కేంద్ర ఆమోదానికి పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాల్లోనూ దిశ పోలీస్ స్టేషన్లు ఉండే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాల్లోనూ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది.

• మహిళలు, చిన్నారుల భద్రత, రక్షణే లక్ష్యంగా అభయం యాప్ రూపకల్పన చేసింది. గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్ల నియామకం కూడా చేపట్టింది.

• వైఎస్సార్ నేతన్న నేస్తం క్రింద 25,112 మంది అక్కచెల్లెమ్మలకు రూ.115.12 కోట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుక క్రింద 36,70,425 మందికి  రూ.19,306.20 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా క్రింద 17,27,249 మందికి  రూ.5,615.66 కోట్లు, వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 2,294 మందికి రూ.6.96 కోట్లు, వైఎస్సార్ వాహన మిత్ర క్రింద 24188 మంది అక్కచెల్లెమ్మలకు రూ.45.69 కోట్లు, వైఎస్సార్ లా నేస్తం క్రింద 721 మందికి రూ.3.21 కోట్లు, జగనన్న విద్యా దీవెన క్రింద 10,88,439 మంది తల్లులకు రూ.2,477.89 కోట్లు, జగనన్న వసతి దీవెన క్రింద 15,56,956 మంది తల్లులకు రూ.2,269.93 కోట్లు, జగనన్న చేదోడు క్రింద 1,36,340 మంది అక్కచెల్లెమ్మలకు రూ.136.64 కోట్లు, జగనన్న గోరుముద్ద క్రింద 18,20,196 మంది బాలికలకు రూ.789.54, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా క్రింద 1,69,516 మందికి రూ.115 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ క్రింద 3,51540 మందికి రూ.1,177.23 కోట్లు, జగనన్న విద్యాకానుక క్రింద 21,86,972 మంది బాలికలకు రూ. 334.61 కోట్లు …మొత్తంగా రెండేళ్లలో 4,36,60,516 మంది మహిళా లబ్దిదారులకు ఈ ప్రభుత్వం  రూ.88,040.29 కోట్ల లబ్ది చేకూర్చింది.