బుద్ధుడికీ.. బాలాజీకి సంబంధమేమిటీ?

707

బౌద్ధం దేశవ్యాప్తంగా ఉన్న రోజుల్లో అంటే భారతదేశం బౌద్ధ భారతావనిగా ఉన్న కాలంలో, దేశంలోని బహుజనులు, దళితులు అందరూ ఆదిబౌద్ధులేనన్నది వాస్తవం! తిరుపతి వెంకటేశ్వరుని గుడి మొట్టమొదట ఆ ఆదిబౌద్ధులకు చెందినదై ఉంటుందని ఆర్‌.సి.థేరే ప్రకటించాడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న రెండు బావులూ ఒక శూద్రుడు తవ్వినవేనన్నది ఆయన అభిప్రాయం. అంతేకాదు, తొడుగులు లేని వేంకటేశ్వర విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అది ముమ్మాటికీ బోధిసత్వుని విగ్రహమేనని ఆయన తేల్చారు. దేశ విదేశాల చరిత్రకారులు చెప్పినదాన్ని బట్టి, దొరికిన కొన్ని శాసనాలను బట్టి కూడా ఈ విషయం స్పష్టమౌతూ ఉంది. టిబెట్‌, చైనా, తైవాన్‌ దేశాల బౌద్ధ భిక్షువులు ఈ తిరుమల క్షేత్రాన్ని దర్శించినట్టు ఆధారా లున్నాయి. మరి వారు ఇతర వైష్ణవాలయాలకు ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడికే ఎందుకు వచ్చారు? అంటే తిరుమలలో ఉన్నది బుద్ధ విగ్రహమని తెలుసుకునే వచ్చారన్నమాట!డా|| జమనాదాస్‌ రాసిన TIRUPATHI BALAJI WAS A BUDDIST SHRINE అనే పుస్తకం ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఈ ఇంగ్లీషు పుస్తకాన్ని ఎ.ఎన్‌. నాగేశ్వరరావు తెలుగులోకి అనువదించారు.

వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్‌ జమనాదాస్‌ చరిత్ర పరిశోధకుడు కూడా! అందుకే ”క్షీణదశలో బౌద్ధం – ప్రాచీన భారతంలో విషాదం” అనే మరో పరిశోధక గ్రంథం ప్రకటించగలిగారు. చరిత్ర పరిశోధకుడు బౌద్ధ రచయిత అయిన రైస్‌ డేవిడ్స్‌ కూడా తిరుపతిలో బౌద్ధానికి సంబంధించిన ఆధారాల గురించి చర్చించాడు. జె. రఘుపతిరావు రచించిన ”ఆలయాలైన ఆరామాలు” పుస్తకం కూడా తిరుపతి ఒకనాటి బౌద్ధ క్షేత్రమని నిర్ధారించింది. సవేరా – అంటే సరెళ్ళ వేంకట రత్నం అనే బౌద్ధ రచయిత 7వ బౌద్ధ మహాసభల సందర్భంగా ప్రచురించిన ”నేటి వేలాది దేవాలయాలు ఒకనాటి బౌద్ధ క్షేత్రాలు!” అనే పుస్తకంలో కూడా అనేక వివరాలు ఇచ్చారు. ఇందులో సీతాపతి అనే పరిశోధకుడి పరిశోధనల సారాంశం కూడా వివరించారు. కిందికి చాచి ఉన్న బాలాజీ అరచేయి – పూర్తిగా బుద్ధుడి ముద్రేనన్నది పరిశోధకులు వివరించారు.

భారతదేశంలో తొలి విష్ణురూపం శేషశయునిగా పడుకుని ఉన్నట్టు రూపొందించారు. మరి తిరుమల విగ్రహం అలా ఎందుకు లేదూ? ఎక్కడ లేని విధంగా విగ్రహం నిలువుగా ఎందుకుందీ? అనే విషయాలు చరిత్ర పరిశోధకులు చర్చించారు. బౌద్దారామాల్లో, బౌద్ధ మందిరాలలో బుద్ధుడి విగ్రహం ఒక్కటే ఉంటుంది. వైష్ణవాలయా లలో దేవుడు పరివార గణంలో ఉంటాడు. ఇక్కడ బాలాజీ ఒక్కడే ఎందుకున్నాడంటే, అది మార్పు చేసిన బుద్ధ విగ్రహం గనుక! ‘ఆంధ్రదేశంలో బౌద్ధవైభవం’ గ్రంథంలో బౌద్ధ రచయిత పిల్లి రాంబాబు చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. బౌద్ధ సారస్వతంలో తిరుమల కొండకు ‘తిరుణ్హమి’ అనే పేరుందని, ఇక్కడ ‘బాల’ అనే మహిళా బౌద్ధాభిమాని ఒక చైతన్య గృహాన్ని నిర్మించి భిక్షువులకు దానమిచ్చిందనీ, తర్వాత కాలంలో అది ఆమె పేరుతో ‘బాలా రామం’గా ప్రసిద్ధి కెక్కిందనీ – ఆమెపేరుతోనే ఇప్పటి వేంకటేశ్వరుణ్ణి ‘బాలాజీ’ అని పిలుస్తున్నారని ఈ రచయిత వివరించారు. ఇది క్రీ.శ.88(సీ.ఈ) నాటి పరిస్థితి. క్రీ.శ.966 (సీ.ఈ) వరకు అక్కడ నిత్య పూజలేవీ జరగలేదని పరిశోధకుడు డాక్టర్‌ జమనాదాస్‌ నిర్ధారించారు. అంటే క్రీ.శ 966(సీ.ఈ) తర్వాతే తిరుమల – హిందూ దేవాలయంగా మారిపోయి ఉంటుంది. ఒక దశలో శైవులూ.. వైష్ణవలు ఆ దేవాలయం మాదంటే మాదని పోటీపడి కోర్టుకెక్కారు. (బౌద్ధక్షేత్రం ముందు శైవక్షేత్రంగా మార్చబడి, రామానుజునిడి ప్రోద్బలంతో వైష్ణవ క్షేత్రమయ్యిందనడానికి ఆధారాలు దొరికాయి). ఉద్రేకాలు చల్లబడ్డాక శైవులూ – వైష్ణవులూ రాజీపడ్డారు.కారణమేమంటే, ఈ ఇరువురి కొట్లాటలో అసలు నిజం బయటపడి – అసలది హిందూ దేవాలయమే కాదని కోర్టు చెపితే పరువు పోతుందని గ్రహించుకున్నారు. దానివల్ల బ్రాహ్మణాధిక్యత తగ్గిపోతుందని తెలుసుకున్నారు. ఇదే రకమైన కొట్లాట శబరిమల క్షేత్రం గురించి కూడా జరిగిందని మనకు తెలుసు. శైవులూ – వైష్ణవులూ రాజీపడి ‘అయ్య- అప్ప’ను సృష్టించుకున్నారన్నది కూడా తెలిసిన విషయమే!

బాలాజీ – అనే పదం గానీ, వేంకటేశ్వరుడు అనే పదంగానీ ఏ హిందూ పురాణాలలో లేకపోవడం గమనించాలి. ఇక తిరుమలలోని బాలాజీ విగ్రహానికొస్తే – ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. జైనుల దేవత అయిన ‘బాలాశ్రీ’ విగ్రహాన్ని మార్చి శివుడిరూపంగా చెక్కించారన్నది ఒకటైతే, మహిళా బౌద్ధాభిమాని ‘బాలా’ నిర్మించిన బాలారామంలోని బుద్ధ విగ్రహాన్ని ముందు శివుడిగా తర్వాత బాలాజీగా మార్పించారన్నది మరో వాదన. ఏమైనా ఈ రెండు వాదనల్లో ‘బాలా’ అనేది ప్రముఖంగా ఉంది కాబట్టి – తెలిసేదేమంటే అది కొల్లగొట్టబడిన జైన మందిరమో, లేక బౌద్ధ మందిరమో తప్ప, వైష్ణవాలయంగా దాని నిర్మాణం జరగలేదని! అక్కడ ఉన్న విగ్రహం ‘స్వయంభూ’ కూడా కాదు. జైన / బౌద్ధ క్షేత్రాన్ని శంకరాచార్యులు శైవక్షేత్రంగా మారిస్తే, దాన్ని రామానుజాచార్యులు వైష్ణవక్షేత్రంగా తీర్చిదిద్దారు.

ఆ క్రమంలో వెనుకటి ఈశ్వరుడే – వేంకటేశ్వరుడిగా స్థిరపడింది. వేంకటేశ్వరుడు స్వయంభూ – అని అక్కడి అర్చక గణం చెప్పుకునేది ఎందుకంటే వారి మనుగడకోసం. దేవుణ్ణీ, దేవుడి మహిమను నిలబెట్టడం కోసం మాత్రమే! దైవభావన ఒక ఊహ అయినప్పుడు ఇంక ‘స్వయంభూ’ అంటే నమ్మేదెట్లా? బంగారం, వజ్ర వైఢూర్యాలతోనే స్వయంభూ అయ్యాడా? అవలేదు కదా? తిరుపతి వెంకటేశ్వరుడికి కృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలున్నాయని చరిత్ర చెపుతోంది. ఇటీవల మనకండ్లముందే గనులవీరుడు గాలి జనార్ధనరెడ్డి వజ్రాల కిరీటం సమర్పించాడు. అలా ఎంతోమంది ధనవంతులు తమ నల్లధనాన్ని మార్చుకునే పనిలో దేవునికి కానుకలు సమర్పిస్తూ వస్తున్నారు. అంటే ఆ వైభవమంతా ‘స్వయంభూ’ విగ్రహానిది కాదు. కాలక్రమంలో మనుషులు అలంకరిస్తున్న ఆభరణాల వల్లనే ఆ వైభవం సమకూరింది. కానీ ఏ మహాత్మ్యం వల్లా కాదు.

తిరుమల అంత ప్రశస్తమైన క్షేత్రమే అయితే ఒక్క వందేండ్ల క్రితం… దేశం బ్రిటిష్‌ పాలనలో ఉన్నప్పుడు దానికి ఇప్పటి ఆ ప్రశస్తి ఎందుకులేదు? రామానుజుడి కాలంలో – వేంకటేశ్వరుడు విష్ణురూపమని, విగ్రహానికి ఆయుధాలు అతికించి మహాత్మ్యాలు ప్రచారం చేశారనీ పరిశోధకులు ఎందుకు తీర్మానించారు? విగ్రహానికున్న శంఖు చక్రాలు ఆగమశాస్త్రాల ప్రకారం సరిపోవని సీతాపతి అధ్యయనం ఎందుకు తెలిపింది? విశ్లేషించుకోవాల్సిన విషయాలు. అలవేలు మంగ ఆదిబౌద్ధుల (నిమ్నకులాల) శక్తిస్వరూపిణి. ఆమెను బ్రాహ్మణీకరించి పద్మావతిని చేశారు. బహుజన – దళిత దేవతలను తమకు అనుకూలంగా సంస్కృతీకరించి, కొన్ని విషయాలు ఉన్నతీకరించి, మరికొన్ని మరగుపరిచి, పురోహిత వర్గం ప్రచారం చేసుకున్నట్టు – ఇంకా చేసుకుంటూనే ఉన్నట్టు మనం నిత్యజీవితంలో కూడా గమనిస్తూనే ఉన్నాం.

ఉదాహరణకు అతిసాధారణ జీవితం గడిపిన షిరిడిసాయికి వెండి, బంగారు కిరీటాలు పెట్టి బ్రాహ్మణవర్గమంతా పూజలు చేస్తూ ఆ గుళ్ళను స్వాధీనం చేసుకోవడం మనకండ్లముందే జరిగింది. గ్రామ దేవత, నిమ్నకులాల దేవత అయిన పోచమ్మను బ్రాహ్మణులు ‘పోచమాంబాదేవి’ అని సంబోధిస్తూ పూజలు చేయడం కనిపిస్తూనే ఉంది. మన కండ్ల ముందే మార్పులు జరిగిపోతూ ఉంటే వేల ఏండ్లుగా కుట్రలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు జరగకుండా ఇప్పుడున్న ఈ దేవాలయ వ్యవస్థ అనాదిగా ఇలాగే ఉందని మనం నమ్మేదెట్లా? దేవతలు మారిపోయారు. స్త్రీదేవతలు పురుష దేవుళ్ళయిపోయారు. గుళ్ళు మారిపోయాయి. మతాలు మారాయి – అనే దానికి ఆధారాలు దొరుకుతున్నాయి. మారకుండా ఒకేలా ఉన్నాయి అనడానికి ఆధారాలేవీ? ప్రచారం చేసిన కట్టుకథలు ఆధారాలు కాలేవు కదా?

ఇక్కడ నేను చర్చించిన విషయాలేవీ నా సృజనాత్మక రచనలోనివి కావు. ముందుతరం అనుభవజ్ఞులు ఆయా విషయాల మీద విశేషంగా పరిశోధనలు చేసి చెప్పిన విషయాలను మాత్రమే నేను పాఠకుల ముందుకు తెస్తున్నాను. నాణేనికి మరోవైపు ఉందని తెలుసుకున్నవారే విషయాన్ని సమగ్రంగా గ్రహించగలుగుతారు.

మనోభావాలు దెబ్బతింటున్నాయని మనసు కష్టపెట్టుకునే మహానుభావులు ఒక చిన్న విషయం ఆలోచించాలి. ఇతర మతాలను లేదా జీవన విధానాలను అనుసరిస్తున్న వారికి అలాంటి మనోభావాలు ఉండకూడదా? ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న బౌద్ధాన్ని సర్వనాశనం చేసి, ఆరామాల్ని ఆలయాలుగా మార్చుకుని, బుద్ధ విగ్రహాల్ని ధ్వంసం చేసి హిందూ దేవత విగ్రహాలుగా మార్చుకుంటే – అప్పుడు మరి బౌద్ధుల మనోభావాలు దెబ్బతినలేదా? వారి సానుభూతి పరుల మనోభావాలు దెబ్బతినలేదా? సమ్యకీ దృష్టితో చరిత్రను అర్థం చేసుకుంటున్న ప్రపంచ మానవ వాదుల మనోభావాలు దెబ్బతినడం లేదా? ఆలోచించాలి!

– డాక్టర్‌ దేవరాజు మహారాజు
వ్యాసకర్త:సుస్రిద్ధ సాహితీవేత్త,
బయాలజీ ప్రొఫెసర్‌,