తెలుగులో కావ్యాలు వ్రాసిన మైసూరు మహరాజులు.

489

1687 లో ఔరంగజేబు గోల్కొండ బీజాపూర్ షియారాజ్యాలను జయించిన తరువాత కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని శిరాకోటను ఒక సుబాగా ఏర్పాటుచేశాడు. అందులో శిరా, దొడ్డబళ్ళాపురం, పెనుకొండ, కోలారు, బసవపట్నం, బూదిహాలు, హొసకోటలను పరగణాలుగా విభజించాడు. ఈ పరగణాలలోనే ఆదోని, ఆలూరు, గుత్తి, తాడిపత్రి, మడకశిర, ధర్మవరం, బళ్లారి, గూళ్యం, హడగల్లి మొదలైన తెలుగు ప్రాంతాలుండేవి.

మైసూరు రాజధానిగా రాజ్యాన్ని పాలించిన యాదవఒడయారులలో కొందరు సంస్కృత కన్నడ తెలుగు భాషలలో కవిత్వం చెప్పడమేకాకుండా కవులను పండితులను పోషించారు.
అలాంటి వారిలో ప్రథముడు చిక్కదేవరాజు.ఇతను ప్రతిరోజూ ఎంతోకొంత సొమ్ము ఖజానాలో జమకానిదే ముద్దముట్టేవాడు కాదు. అందుకే ఇతనికి నవకోటి నారాయణుడనే బిరుదు పొందాడు. అలాగని పిసినారి కాదు. ప్రజాసంక్షేమకార్యక్రమాలు కూడా చేశాడు.

మధుర తెలుగు నాయక రాజులతో వైరం వహించి వారినిఓడించినాడు. ఔరంగజేబు ఆస్థానంలో ఇతని రాయభారి వుండేవాడు. ఔరంగజేబు ఇతనికి చిక్కదేవరాజు మహ్మద్ షాహి బిరుదునిచ్చాడు. యథారాజా తథాప్రజా అన్నట్లుగా కొందరు దండనాయకులు దళవాయిలు కూడా స్వయంగా కవిత్వం చెప్పడమేకాకుండా కవులను పోషించారు.

తెలుగును పోషించిన మొదటి మైసూరు ప్రభువు చిక్కదేవరాజని చెప్పుకున్నాం కదా ! ఇతని పాలనాకాలం 1672 నుండి 1704 వరకు.ఇతను తెలుగులో చిక్కదేవరాయ విలాసమనే కావ్యాన్ని వ్రాశాడు. ఇతనోసారి వాహ్యాలికి వెళ్ళినపుడు చంద్రలేఖ అనే వారకాంత రాజును చూచి మరులుగొని అతనివద్దకు రాయభారాన్ని పంపినది. ఆ వేశ్య కోరికను మన్నించి రాజమెను ఏలుకొన్నాడు. ఈ సందర్భంగా వెలసిందే చిక్కదేవరాయ విలాసం.

ఈ కావ్యమకుటం ఇతని పేరుమీదుగా వున్నప్పటికి, మధురను జయించినపుడు తెలుగుకవులు కొందరు ఇతనిని ఆశ్రయించారని వారెవరో కావ్యాన్ని ఇతనిపేర వ్రాశాడంటారు. ఎలాగంటే ఆముక్తమాల్యదను శ్రీకృష్ణరాయడు వ్రాయలేదని అల్లసాని పెద్దనే శ్రీకృష్ణదేవరాయల పేరు మీదుగా వ్రాశాడని అనేంతగా.
కళులె వీరరాజు చిక్కదేవరాజు వద్ద సైనికాధికారిగా వుండేవాడు. మహరాష్ట్రులను మధురలను జయించి ధనరాసులను రాజ్యానికి చేర్చిన వీరుడు. ఆంజనేయభక్తుడు. దైవానుగ్రహంచేత సంస్కృత కర్ణాటక ఆంధ్రభాషలలో కవిత్వం చెప్పగలని చెప్పుకొన్నాడు. మధుర దండయాత్రలో తుపాకుల అనంతయ్య అనే యువకవి, యుద్ధవీరుడిని తనతో తెచ్చుకొన్నాడు. వీరరాజు తెలుగువచనంలో మహాభారతరచనకు ఉపక్రమించి సభాపర్వం వరకు పూర్తిచేశాడు. రాజకీయ మార్పుల వలన తీరికలేని యుద్ధాల వలన అదే సమయంలో కన్నడంలో సకల వైద్యసంహిత సారార్ణవం వంటి గ్రంథాలు వ్రాయడం వలన తెలుగు వచన భారతాన్ని పూర్తిచేయలేకపోయాడు. ఇతని ఆశ్రయించిన కవి ఒకరు వీరభూపాలీయం పేరుతో సంస్కృత ఆంధ్రశబ్దచింతామణిని తెలుగులోనికి అనువదించాడు.

కళులె వీరరాజు పోషించిన వారిలో తుపాకుల అనంతయ్య వున్నాడు. ఇతను కుడా కవేకాదు కత్తిపట్టిన యోధుడు. పూర్వీకులు చంద్రగిరివాసులు. తండ్రి తుపాకుల వెంకటప్ప చంద్రగిరినుండి వెళ్ళి చెంజి (జింజి) నాయకరాజులను ఆశ్రయించాడు. ఇతని వంశస్తుడే తుపాకుల కృష్ణప్ప నాయకుడు. కృష్ణప్ప గోల్కొండ సేనాని మీర్ జూమ్ల కొలువులో వుండేవాడు. ఔరంగజేబు గోల్కండపై దాడి చేస్తాడని మీర్జుమ్లా తెలుసుకొని స్వామి ద్రోహం చేసి, తన సైన్యాన్ని కృష్ణప్పకు అప్పగించి మొఘలు సుబేదారుగా వెళ్ళిపోయాడు. ఆ వంశస్తుడే అనంతయ్య.

అనంతయ్య కృష్ణభక్తుడు. ఇతను కూడా మహాభారతాన్ని, విష్ణుపురాణాన్ని, రామయణంలోని సుందరకాండలను తెలుగు వచనంలో వ్రాశాడు.
ఇంతకు ముందు మనం చెప్పుకొన్న చిక్కదేవరాజు 1704 లో మరణించాడు. అతని కుమారుడు12 సంవత్సరాల వయస్సుగల కంఠీరవ నరసరాజును రాజమాత దేవాజమ్మ, ప్రధాని తిరుమలయ్యలు రాజుగా సింహాసనాన్ని ఎక్కించారు.

కంఠీరవ నరసరాజు మూగవాడు, మూగవాడికి సహజంగా చెవులు కూడా వినబడవు కదా ! మూగచెవిటివాడైనవాడు మైసూరుకు రాజైనాడు.ఇతను తంజావూరి విజయరాఘవుడిలా విలాసపురుషుడు. కన్నడ, తెలుగు, సంస్కృత కవులను పోషించాడు.
కంఠీరవ నరసరాజు తెలుగులో ఎనిమిది గ్రంథాలను వ్రాశాడు. అవి (1) అష్టదిక్పాలక విలాసం (2) కలవాణీవిలాసం (3) కొరవంజికట్లె. (4) నాట్యవిద్యావిలాసం (5) పంచాయుదకట్లె. (6) వసంతోత్సవవిలాసం (7) లక్ష్మివిలాసం (8) విభక్తికాంతావిలాసం.

ఇతను పుట్టుకతో మూగచెవుటివాడు కనుక ఇతనేం రచనలు చేసివుంటాడు. ఈ రాజు పేరు మీదుగానే ఆస్థానకవులెవరో ఇతని పేరు మీదుగా రచనలు చేసివుంటారనే విమర్శవుంది. అతను వ్రాసినాడని భావించినా,ఇతర కవులు వ్రాసినా ఆ కాలంలో మైసూరులో తెలుగుకవిత్వం వెలువడిందనేది వాస్తవం.

ముందు చెప్పుకొన్న కళులె వీరరాజుకు ఇద్దరు కుమారులు. మొదటివాడు దేవరాజు, రెండవవాడు నంజరాజు. హైదరాలీ మైసూరురాజ్యంలో ఓ సామాన్యసైనికుడు. దేవరాజు, నంజరాజులు ఇతనిని చేరదీసి వున్నతికి పాల్పడినారు. సోదరులిద్దరికి అప్పటి రాజైన చామరసుకు సరిపోదు. అందువలన హైదరాలీని చేరదీసి ప్రముఖుడిని చేసారు. తమ మాట వింటాడని అనుకొన్నారు.కాని హైదరాలి ఏకైమేకై ,చేరదీసిన అన్నదమ్ములకు, ఉన్నతపదవులిచ్చిన రాజుకు రాజద్రోహం చేసి మైసూరు రాజైనాడు.

నంజరాజు తెలుగు కన్నడభాషలలో కవి. కన్నడలో నంజరాజవాణి విలాసమనే మహభారత వచనాన్ని, శివభక్తివిలాసం, భద్రగిరి మహత్మ్యమనే గ్రంథాలను, కన్నడ తెలుగులలో ఒకేపేరుతో హాలస్యచరిత్రమనే గ్రంథాలను వ్రాశాడు. మైసూరు సంస్థానంలో ఆలూరి నరసింహమనే సంస్కృతకవి వుండేవాడు. ఇతనికి నవీనకాళిదాసనే బిరుదు వుండేది. ఇతను సంస్కృతంలో వ్రాసిన నంజరాజయశోభూషణాన్ని అక్కడి తెలుగుకవెవరో తెనిగించాడు. ఆ అనువాదకుడి పేరు తెలియరాలేదు.వడయారుల రాజధానైన మైసూరు ఆస్థానంలో లెక్కలేనంతమంది తెలుగు కవులుండేవారు. పరిశోధకులు సాహిత్యాభిమానులు లేక వారంతా మరుగున పడ్డారు.

(మూలం.. ఆరుద్రగారి సమగ్రాంధ్ర తెలుగు సాహిత్యం, రెండవ విభాగం.)
– జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.