ఒక చారిత్రక సందర్భం చేజార్చుకుంటున్న ఈటెల రాజేందర్

565

ఈటెల వ్యవహారం మొదలైన రోజుల్లో అతను బిజెపిలో చేరడని ఆశిద్దాం అని ఒక పోస్ట్ రాశాను. మా DBS నాయకుల  బృందంతో వెళ్లి తనకు అదే విషయం చెప్పాము. బిజెపిలో చేరితే ఆత్మగౌరవం అనే మీ మాటకు అర్థం వుండదని కూడా చెప్పాము. ఆయన నిజానికి ఏ విషయాన్ని తేల్చి చెప్పలేదు. కానీ ప్రజల పక్షాన వుంటానని చెప్పాడు. మీరు పార్టీ పెడితే బాగుంటుంది.

మాలాంటి చాలా వాళ్లం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పాము. ఆయన పార్టీ పెట్టే విషయాన్ని తోసిపుచ్చాడు. ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయి కదా అన్నాడు. కుల సంఘాలు, ప్రజా సంఘాలు గతంలో కొంతమందిని ఎన్నికలలో నిలబెడితే, డిపాజిట్ కూడా రాలేదు అన్నాడు. కుల సంఘాలు, ప్రజాసంఘాలకు చాలా పరిమితులు ఉంటాయి. అవి రాజకీయ నిర్మాణాలు కావు. రాజకీయ పార్టీ నిర్మాణం, పని పద్ధతి, దానికి ప్రజల నుండి వచ్చే స్పందన వేరుగా ఉంటుంది కాబట్టి కుల సంఘాల, ప్రజాసంఘాల వైఫల్యాలను రాజకీయ రంగానికి ఆపాదించడం సరి కాదని ఈటెల సోదరుడికి, అతని సన్నిహితులకు నేను చెప్పాను. నాతో పాటు వచ్చిన మా DBS నాయకులు చెరిపెల్లి ఆనంద్, నల్లా రమేష్  కూడా అదే అభిప్రాయం చెప్పారు. ముఖ్యంగా సాయిని నరేందర్ అన్నా, బిఎల్ ఎఫ్ నాయకురాలు వనజక్క వివరంగా రెండోసారి కలిసినప్పుడు తమ అభిప్రాయం గట్టిగానే చెప్పారు.

ఈటెల రాజేందర్ తన వ్యూహాలను నర్మగర్భంగా వివిధ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్తూ వచ్చాడు. వాటిని కెసిఆర్ బాగా అర్థం చేసుకున్నాడు. ఈటెల తన బలం తన కమ్యూనిటీ అని చెప్పుకున్నాడు. కెసిఆర్ ముదిరాజ్ కమ్యూనిటీ నాయకులను మెజారిటీగా తన వైపు నిలుపుకొనే వ్యూహాలు విజయవంతంగా అమలు చేశాడు. రెడ్డి, కాపు వర్గాలను దూరం చేయడానికి గంగుల కమలాకర్ ను రంగంలోకి దించాడు. మండలానికి వొక ఎమ్మెల్యేను ఇంచార్జీ పెట్టాడు. ఈటెల రాజేందర్ టీఆర్‌ఎస్ యేతర పార్టీలను కలిసి మాట్లాడాడు. కెసిఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులను నయానో భయానో లొంగదీసుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా వుందంటే, ఈటెల రాజేందర్ రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినా కూడా తన కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలు లేకుండా పోయారు. ఇది తనను మరింత బలహీనపర్చింది.

తనకు ఇప్పుడు మిగిలింది రెండు మార్గాలు. ఒకటి, టిఆర్ఎస్ నాయకులు తనను రాజీనామా చేయాలని సవాలు చేసినా, దాన్ని స్వీకరించ కూడదు. రాజీనామా చేయకుండా రాష్ట్రం అంతా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేసే సభలు పెట్టాలి. అన్ని వర్గాల నాయకులను, ప్రజలను సమీకరించాలి. జిల్లా సదస్సులు, మండల సదస్సులు నిర్వహించాలి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సభ ఒక యేడాదిలో లక్షలాది మందితో పెట్టాలి. అందులో కొత్త పార్టీని ప్రకటించాలి. ఈ విషయాలను నేను కాస్త తీవ్రమైన భాషలోనే తనను కలిసినప్పుడు, ఆయన పెద్దన్న సమ్మయ్యకు చెప్పాను.

ఇక రెండవ మార్గం ఏదో ఒక పార్టీలో చేరడం. అయితే ఏ పార్టీలో చేరినా ఆత్మగౌరవం తనకు దొరుకదు. ఆ భావనకు ఆ పార్టీలన్నీ వ్యతిరేకం. బిజెపిలో అద్వానికే గౌరవం దొరకడం లేదు. సీనియర్ నాయకులంతా తమకు జరుగుతున్న అవమానాలను బయటికి చెప్పుకోలేక, మోదిని విమర్శించ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని మనం చాలా వార్తలు వింటూనే వున్నాము. కాబట్టి ఇది మంచి ఆప్షన్ కాదు.

ఒక వేళ ఈటెల రాజేందర్ బిజెపిలో చేరితే ఏమవుతుంది? వ్యక్తిగతంగా తనకు రక్షణ దొరుకుతుంది. కానీ ఒక బలమైన కొత్త పార్టీ తెలంగాణలో ఏర్పడే చారిత్రక సందర్భం చేజారి పోతుంది. అంతేకాకుండా, బిసిలు ఎప్పటికీ ఒక రాజకీయ పార్టీ పెట్టలేరని, వాళ్లు ఎప్పుడూ ఏదోఒక అగ్రకుల పార్టీలో వుండాలి తప్ప మరేమీ చేయలేరని వచ్చే విమర్శలు నిజమని ఒప్పుకోవాల్సి వస్తుంది.ఈటెల పట్ల ఆశగా చూస్తున్న ప్రజలు నిరాశపడుతారు.

బిజెపితో ఆయన రహస్య భేటీ సమాచారం వల్ల రెండోదే జరగబోతుందని అనిపిస్తుంది. అందువల్ల ద్రవిడ బహుజన సమితి మాత్రమే ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తున్నాను.

                                                                                -డా.జిలుకర శ్రీనివాస్
DBS రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు