కరోనా సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

358

– బెడ్స్, ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నాం
– సీఎం జగన్ ఆదేశాలను పెడచెవిన పెట్టొద్దు
– ఎన్ఆర్ఐ హనుమార సేవలు అభినందనీయం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, మే 26: కరోనా వైరస్ సోకిన వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) భరోసా ఇచ్చారు. బుధవారం గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి ఎన్ఆర్ఐ, లైవ్ ఫర్ లాటర్ హెల్ప్ ఇండియా బ్రీత్ ఆర్గనైజర్ ఆర్యప్రసాద్ హనుమార సమకూర్చిన 10 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 50 ఫింగర్ పల్స్ ఆక్సీమీటర్లు, 300 హెం ఐసోలేషన్ మెడిసిన్ కిట్ లను పెయ్యేరుకు చెందిన పేర్నీడు (పెదబాబు), దంత వైద్య నిపుణురాలు డాక్టర్ వేములపల్లి నాగరత్న, హనుమార చైతన్యకుమార్ లు ఇచ్చారు. వీటిని మంత్రి కొడాలి నాని, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చేతులమీదుగా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవికి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ అమెరికాలో ఉంటున్న విద్యార్థి ఆర్యప్రసాద్ హనుమార ఫ్రీ ఆక్సిజన్, ఫ్రీ కోవిడ్ మెడిసిన్ లక్ష్యంతో తన పాకెట్ మనీతో పాటు కుటుంబ సభ్యుల దగ్గర నుండి సేకరించిన డబ్బును వినియోగించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సీఎం జగన్మోహనరెడ్డి ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడడం లేదన్నారు. ప్రతి ప్రాణం విలువైనదేనని, కరోనా వైరస్ సోకిన వారిని కాపాడేందుకు అవసరమైన బెడ్లు, ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నారన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా రోగులకు 50 శాతం బెడ్ లను కేటాయించకుండా ధనార్జనే ధ్యేయంగా అవకతవకలకు పాల్పడుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ ద్వారా 50 శాతం బెడ్లను కేటాయించి వైద్యం అందేలా చూడాలని విజిలెన్స్, పోలీస్, ఆరోగ్యశ్రీ బృందాలు, రెవెన్యూ యంత్రాంగాన్ని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారన్నారు. నిబంధనలను పాటించని వారు ఎంత పెద్దవారైనా వదిలి పెట్టవద్దని హెచ్చరించారన్నారు. ఆసుపత్రులు నడవాలంటే డబ్బు అవసరమేనని, అయితే అంతకన్నా ప్రాణం ముఖ్యమన్నారు. ఒక ప్రాణం వెనక భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వంటి కుటుంబం ఆధారపడి ఉంటుందన్నారు.

కరోనా విపత్కర పరిస్థితులను డబ్బుతో ముడిపెట్టకుండా సామాజిక బాధ్యతను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచించారు. సీఎం జగన్మోహనరెడ్డి ఇస్తున్న ఆదేశాలను అధికారులు పాటించకుండా పెడచెవిన పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, మాదాసు వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి, డాక్టర్ మాధురి, డాక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.

రూ. 10.70 కోట్ల నిధులతో గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో నూతన భవనం
కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో రూ. 10.70 కోట్ల ప్రభుత్వ నిధులతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనులను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి మంత్రి కొడాలి నాని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 1983 లో ఎన్టీఆర్ హయాంలో గుడివాడలో ప్రభుత్వాసుపత్రిని నిర్మించారని, అది శిథిలావస్థకు చేరిందన్నారు. దీని స్థానంలో కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం నుండి రూ.10.70 కోట్ల నిధులను మంజూరు చేయించానని చెప్పారు. శిథిలమైన పాత భవనాన్ని తొలగించడం జరిగిందన్నారు. కొత్త భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, కోవిడ్ కేంద్రంలో మరిన్ని బెడ్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి పరిస్థితులు సహకరించడం లేదన్నారు. అయినప్పటికీ కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, కరోనా రోగులకు ఎటువంటి ప్రాణహాని లేకుండా వైద్యం అందిస్తున్నామన్నారు.

అత్యవసర కేసులను విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ ను కూడా అందుబాటులో ఉంచామని ఎంపీ బాలశౌరికి వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, మాదాసు వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి, డాక్టర్ మాధురి, డాక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.