మహమ్మారిపై పోరుకు ‘రూరల్ హోప్’ మద్దతు

201

◆ ప్రభుత్వాసుపత్రికి రూ.4 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ
◆ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 2.5 లక్షల విలువైన వెయ్యి కోవిడ్ కిట్లు అందజేత
◆ రూరల్ హోప్ ఫౌండేషన్ ద్వారా ప్రవాసాంధ్రులు కొండా చంద్రశేఖర్ రెడ్డి సేవలు
◆ రూరల్ హోప్-డాక్టర్ వీజీఆర్ లకు ప్రశంసల వెల్లువ

విజయవాడ: కరోనా మహమ్మారిపై పోరాటానికి రూరల్ హోప్ ఫౌండేషన్ మద్దతుగా నిలుస్తోంది. కోవిడ్-19 సెకెండ్ వేవ్ లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభించేలా ప్రవాసాంధ్రులు కొండా చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని రూరల్ హోప్ ఫౌండేషన్, ప్రఖ్యాత డయాబెటాలజిస్టు డాక్టర్ కొండా వేణుగోపాల్ రెడ్డి సారథ్యంలోని వీజీఆర్ ట్రస్ట్ సంయుక్తంగా కృషి చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించబడుతున్న కోవిడ్ చికిత్సా కేంద్రానికి 4 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను అందజేశారు.

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 80 ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, 25 వేల సర్జికల్ మాస్కులు, 2600 ఎన్95 మాస్కులు, 10వేల గ్లౌజులను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్ కు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ జన్మభూమి పట్ల ఆదరాభిమానాలతో, కోవిడ్ వైద్య సేవలకు మద్దతుగా నిలుస్తున్న రూరల్ హోప్ ఫౌండేషన్ సేవలు ప్రసంశనీయమన్నారు. వీజీఆర్ డయాబెటిస్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ట్రస్ట్ ద్వారా అనితరసాధ్యమైన సేవలందిస్తున్న డాక్టర్ కొండా వేణుగోపాల్ రెడ్డి చొరవతో కోవిడ్ కేర్ సెంటరుకు ప్రవాసాంధ్రుల మద్దతు లభించడం అభినందనీయమని డాక్టర్ శివశంకర్ పేర్కొన్నారు.

రూరల్ హోప్ ఫౌండేషన్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న  కొండా చంద్రశేఖర్ రెడ్డి.. మధుమేహవ్యాధి అవగాహన ఉద్యమాన్ని అవిశ్రాంతంగా కొనసాగిస్తున్న డాక్టర్ కొండా వేణుగోపాల్ రెడ్డి సహకారంతో కరోనా విపత్తు సమయంలో తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ రోగుల కోసం మొత్తం2.5 లక్షల రూపాయల విలువైన వెయ్యి మెడికల్ కిట్లను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి.సమరం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న తమ కార్యకర్తల ద్వారా కోవిడ్ బాధితులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మెడికల్ కిట్లను అందజేసిన రూరల్ హోప్ ఫౌండేషన్, డాక్టర్ వీజీఆర్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో మాతృభూమికి సేవలందిస్తున్న రూరల్ హోప్ ఫౌండేషన్ వారికి, వైద్య పరికరాలను అందించడం ద్వారా కోవిడ్ చికిత్సా కేంద్రానికి మద్దతునిచ్చిన డాక్టర్ కె.వేణుగోపాల్ రెడ్డిలను జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ప్రత్యేకంగా అభినందించారు.

కాలిఫోర్నియాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు కొండా చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన పనిచేస్తున్న రూరల్ హోప్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని డాక్టర్ కె.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. దాదాపు మూడు వేల కంటి శుక్లాల ఆపరేషన్లు, వందలాది మందికి కృత్రిమ అవయవాలను అమర్చడం తదితర కార్యక్రమాలతో రూరల్ హోప్ నిరంతర సేవలందిస్తోందని అన్నారు. రూరల్ హోప్ ఫౌండేషన్ ద్వారా ఆపన్నహస్తం అందిస్తున్న వారికి డాక్టర్ వీజీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.