కోవిడ్ కేంద్రం దగ్గరకు వస్తే తాట తీసి లోపలేస్తాం

220

– పోసుకోలు నాయుడు మాటలను పట్టించుకోం
– రాజకీయాల కోసం పిచ్చి వేషాలేస్తే ఇబ్బందులు తప్పవు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరిక

గుడివాడ, మే 26: జూమ్ యాప్ లో పనికిమాలిన చంద్రబాబు చెప్పాడు కదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలెవరైనా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలోని కోవిడ్ కేంద్రం దగ్గరకు వస్తే తాట తీసి లోపలేస్తామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హెచ్చరించారు. బుధవారం గుడివాడ ప్రభుత్వాసుపత్రిని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి మంత్రి కొడాలి నాని సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కోవిడ్ విజృంభణతో ఇబ్బందులు పడుతున్న ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. తుప్పునాయుడు, పప్పునాయుడులు చంద్రబాబు, లోకేష్ కు మాత్రం హైదరాబాద్ లోనే అద్దాల గదుల్లో గడుపుతున్నారని, వీరిద్దరివే ప్రాణాలా అని అన్నారు. కార్యకర్తలు వెళ్ళి కరోనా బాధితులను పరామర్శించాలని అంటున్నారని, చంద్రబాబు, లోకేష్ కు మాత్రమే సురక్షితంగా ఉండాలా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చంద్రబాబును సొల్లు నాయుడు అని అంటున్నారని చెప్పారు. కరోనా దెబ్బకు గత ఏడాది ఆరు నెలలు హైదరాబాద్ లో కూర్చోవడం వల్ల మైండ్ కూడా పోయిందన్నారు. సెకండ్ వేవ్ లో మళ్ళీ హైదరాబాద్ లోనే కూర్చున్నాడన్నారు. చంద్రబాబుకు అల్జీమర్స్ జబ్బు ఉందని, ఎవరో ఒకరితో మాట్లాడుతూ, ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే ఆ జబ్బు నియంత్రణలో ఉంటుందన్నారు. అద్దాల గదికి పరిమితమైతే ఉన్న మైండ్ కూడా పనిచేయదన్నారు . అందువల్లే కార్యకర్తలకు కూడా పిచ్చిమాటలు చెబుతూ ఉంటాడన్నారు.

చంద్రబాబు పోసుకోలు నాయుడు అని, అలాంటి వాళ్ళ మాటలను పట్టించుకునేది లేదని చెప్పారు. గుడివాడలోని కోవిడ్ కేంద్రానికి ఆక్సిజన్ కొరత ఏర్పడితే విజయవాడ నుండి తీసుకురావడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుందన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఇప్పుడున్న 25 బెడ్లకు అవసరమైన ఆక్సిజన్‌ను సొంతంగా సమకూర్చుతున్నానని చెప్పారు. కరోనాతో 26 వ వ్యక్తి వస్తే వెంటనే జాయిన్ చేసుకుని వైద్యం అందిస్తూ విజయవాడ, మచిలీపట్నంలలోని కోవిడ్ ఆసుపత్రులకు తరలించడం జరుగుతోందన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. పనికిమాలిన చంద్రబాబు జూమ్ యాప్ లో సొల్లు కబుర్లు చెబుతున్నాడన్నారు.

రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఇక్కడకు వచ్చి పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దన్నారు. అలా కాకుండా కోవిడ్ కేంద్రం దగ్గరకు వచ్చిన వారే ఇబ్బందులు పడతారని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, మాదాసు వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి, డాక్టర్ మాధురి, డాక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.

ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎంపీ బాలశౌరి

గుడివాడ పట్టణ ప్రజలు భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ లపై ఫ్లైఓవర్లు లేక పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్ల నిర్మాణానికి కృషి చేస్తానని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు.

ప్లైఓవర్ల నిర్మాణానికి కృషి చేసిన ఎంపీ బాలశౌరికి గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. చాలా కాలంగా గుడివాడ – పామర్రు రహదారిపై ఉన్న భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ కు గుడివాడ పట్టణ పరిధిలోనే ఉన్నాయన్నారు. ఈ రైల్వే ట్రాక్స్ దగ్గర ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం ఎంపీ బాలశౌరి పార్లమెంట్ లో, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, ఆయా శాఖల అధికారులతో చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారన్నారు. అలాగే పామర్రు నుండి ముదినేపల్లి మీదుగా కైకలూరు వెళ్ళే రోడ్డుకు భూసేకరణ కూడా జరుగుతోందన్నారు. కొత్తగా బైపాస్ రోడ్డును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, టెండర్లను కూడా పిలిచారన్నారు.

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ గుడివాడ ప్రాంత ప్రజలు భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. రైళ్ళ రాకపోకల కారణంగా ట్రాఫిక్ కు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అనేకసార్లు పార్లమెంట్ లో మాట్లాడానని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళానన్నారు. దీంతో లెవల్ క్రాసింగ్ గేట్ నెంబర్ -3 గుడివాడ – మచిలీపట్నం రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. అలాగే లెవల్ క్రాసింగ్ గేట్ -52 విజయవాడ – భీమవరం రైల్వే ట్రాక్ దగ్గర ఇంకో ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.125 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రెండు బ్రిడ్జిల డిజైన్లను తయారుచేసి నేషనల్ హైవే అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు.