90 రోజుల్లో ఇంటి స్థలం కేటాయింపు, ఇళ్ల నిర్మాణం.

359

– వచ్చే ఏడాది ఉగాది రోజున పట్టణాల్లోని మధ్య తరగతి వర్గాల ప్రజలకు సరసమైన ధరకు ఇళ్ల స్థలాలు.
– ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధత, విత్తనాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ రుణాలు.
– జూన్‌లో అమలు చేయనున్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష.

అమరావతి: కోవిడ్‌ కేసులు మే నెలలో 16–22 తేదీల మధ్య అర్బన్‌ ప్రాంతంలో 48.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 51.7శాతం నమోదయ్యాయని, కాని కొన్ని పత్రికల్లో రూరల్‌ ఏరియాలో అతిఎక్కువగా కేసులు నమోదైనట్లు రాస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. వారికి సరైన అవగాహన, పరిజ్ఞానం లేకుండా ఇలాంటి వార్తలు రాస్తున్నారని ఆయన ఆక్షేపించారు. రూరల్‌ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ పలు మార్లు వెళ్లి సర్వే చేశారని, ప్రతి మూడు రోజులకు ఒకసారి సర్వే చేస్తున్నారని, జ్వరం సహా ఎలాంటి లక్షణాలు ఉన్నా పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న సింఘాల్, మిగలిన జిల్లాల్లో కేసులు స్టెబిలైజ్‌ అవుతున్నాయని వివరించారు.

1). కోవిడ్‌–19.
అందరికీ అభినందనలు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఆశా వర్కర్లు మొదలు వలంటీర్లు, డాక్టర్లు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బందితో పాటు, ఆ పనుల్లో నిమగ్నమైన జాయింట్‌ కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సమర్థంగా పని చేశారు. అందుకు మీలో ప్రతి ఒక్కరికి నా అభినందనలు. నిజానికి మన దగ్గర టయర్‌–1 నగరాలు కానీ, ఆ స్థాయిలో ఆస్పత్రులు కానీ లేవు.అయినా కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నాం.

కోవిడ్‌ కేసులు తగ్గుతున్నాయి:
గత కొన్నిరోజులుగా కేసులు తగ్గుతున్నాయని అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. పాజిటివ్‌ కేసులు గతంలో రోజుకు దాదాపు 24 వేలు నమోదు కాగా, ఇప్పుడు అవి 15 నుంచి 16వేలకు తగ్గాయి. ఇది సానుకూల పరిస్థితి. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా పరిస్థితులు మెరుగుపడాల్సి ఉంది. ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

50 శాతం బెడ్లు తప్పనిసరి:
ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 28,737 మంది అంటే 70 శాతానికి పైగా కోవిడ్‌ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం.
ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సల విషయంలో కృష్ణా జిల్లా అధికారులు ప్రత్యేక దృషి ్టపెట్టాలి.
ఎంప్యానెల్‌ చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కచ్చితంగా 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషెంట్లుకు ఇవ్వాలి.

అధిక ఫీజులు వసూలు చేస్తే..:
ఏ చికిత్సకు ఎంత అన్నది రేట్లు మనం ప్రకటించాం. వివిధ బీమా సంస్థల రేట్లతో పోలిస్తే.. మన ప్రకటించిన రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రకటించిన రేట్లకు కచ్చితంగా రోగులకు సేవలు అందాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నియంత్రణ, నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి. ఆరోగ్య మిత్రలు, సీసీ కెమెరాలు సమర్థవంతగా పని చేయాలి.
ఇవి సమర్థవంతంగా పని చేస్తే ప్రైవేటు ఆస్పత్రులమీద దాడులు చేయాల్సిన అవసరం ఉండదు. దాడులు నిర్వహించిన తర్వాత అధికంగా ఛార్జీలు వసూలు చేసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు చాలా ముఖ్యమైనవి.
24 గంటల్లోగా వారిపై చర్యలు తీసుకోవాలి.
ఒకవేళ అలా చర్యలు తీసుకోకపోతే నేరుగా నాకు నివేదిక అందాలి. కలెక్టర్లు ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
ఇది మహ్మమారి సమయం, ప్రతి పేదవాడికి, ప్రతి రోగికి సేవలు చేయాల్సిన సమయం.
ఎవరైనా తప్పులు చేస్తే, అధికంగా ఛార్జీలు వసూలు చేస్తే.. వారి మీద చర్యలు తీసుకోకపోవడం తప్పు అవుతుంది. ఒకసారి తప్పు చేస్తే ఫైన్‌ వేయండి. పదే పదే చేస్తే.. క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.

104 కాల్‌ సెంటర్‌:
104 కాల్‌ సెంటర్‌ ఒన్‌స్టాప్‌ సొల్యూషన్‌గా పెట్టాం. కలెక్టర్లు దాన్ని ఓన్‌ చేసుకోవాలి.
మన బంధువులే మనకు ఫోన్‌ చేస్తే.. ఎలా రెస్పాండ్‌ అవుతామో.
104కు ఎవరైనా ఫోన్‌ చేస్తే అలాగే స్పందించాలి.
సరిగ్గా స్పందించకుంటే.. అధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది.
104 అనేది అవర్‌ బేబీ. ఒకప్పుడు ఆ కాల్‌ సెంటర్‌కు రోజుకు 19 వేల కాల్స్‌ వచ్చేవి. అవి ఇప్పుడు 7వేల కాల్స్‌కు తగ్గాయి.
అంటే పాజిటివ్‌ కేసులు తగ్గాయనడానికి ఇదొక సంకేతం.
అనుకున్న సమయంలోగా పరీక్షలు, మందులు, బెడ్‌లు కేటాయింపు అన్నీ కూడా జరగాలి.

జర్మన్‌ హ్యాంగర్లు:
ఆస్పత్రుల్లో మనం వేస్తున్న జర్మన్‌ హేంగర్లు ఎలా ఉన్నాయన్న దానిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి.వాటిలో ఆక్సిజన్‌ సరఫరా ఏర్పాట్లు చేయాలి. ఎయిర్‌ కండిషన్‌ సదుపాయం ఉండాలి. అలాగే శానిటేషన్‌ బాగుండాలి, మంచి ఆహారం పెట్టాలి.

ఆక్సిజన్‌ సరఫరా:
నెల క్రితం రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరా 330 టన్నులు ఉండేది. కానీ ఇవాళ 600 టన్నుల పైచిలుకు మనం పంపిణీ చేస్తున్నాం. ఆక్సిజన్‌ పంపిణీలో మంచి సమర్థత, ప్రగతి చూపించాం. తుపాను ప్రమాదం ఉందన్న సమయంలో కూడా గత 2 రోజుల నుంచి సరిపడా ఆక్సిజన్‌ను నిల్వ చేయగలిగాం. కనీసం 2 రోజులకు సరి పడా నిల్వలను అందుబాటులో పెట్టుకోగలిగాం. సీనియర్‌ అధికారి కృష్ణబాబుతో పాటు, ఆరోగ్యశాఖ అధికారులు గట్టిగా కృషి చేసి ఆక్సిజన్‌ను నిల్వ చేయగలిగారు.

ఆక్సిజన్‌ను సమర్థవంతగా వినియోగించుకోవాలి:
ఉన్న బెడ్లు ఎన్ని? ఎంత ఆక్సిజన్‌ వాడుకుంటున్నాం? ఎంత అవసరం మొదలైన వాటి ఆడిటింగ్‌ సక్రమంగా జరగాలి.
ఎక్కడైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దాలి. ఆక్సిజన్‌ రవాణాకు సంబంధించి జిల్లాల్లో ఉన్న  టాస్క్‌ఫోర్స్‌ సమర్థవంగా పని చేయాలి. ఆక్సిజన్‌ నిల్వలను ప్రతి ఆస్పత్రిలో సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. తిరుపతి లాంటి ఘటనలు జరగకూడదు. ఎక్కడైనా ఆక్సిజన్‌ వాహనం సకాలంలో రాని పక్షంలో పరిస్థితులను ముందుగానే ఊహించుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలి.

రెమిడిసివర్‌ ఇంజక్షన్లు:
ప్రభుత్వ ఆస్పత్రులకు, ప్రైవేటు ఆస్పత్రులకు రెమిడెసివర్‌ ఇంజక్షన్లు ఇస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారానికి 50 వేల ఇంజక్షన్లు ఇస్తున్నాం. అలాగే ప్రైవేటు ఆస్పత్రులకు 60 వేలు ఇచ్చాం. రెమిడెసివర్‌ ఇంజక్షన్లు మీద మంచి నియంత్రణ సాధించగలిగాం. అందువల్ల కొరత లేకుండా ఇవ్వగలుగుతున్నాం. ఇంజక్షన్లు బ్లాక్‌లో అమ్మడం, వాటిని దారి తప్పించడం లాంటివి జరగకూడదు. ప్రాణం కాపాడే మందులుగా భావించినప్పుడు వాటితో వ్యాపారం చేయడం దుర్మార్గం. ప్రైవేటులోనైనా, ప్రభుత్వంలోనైనా ఎవరైనా వ్యక్తులు ఇలాంటి విషయాల్లో తప్పులు చేయడం చాలా తప్పు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

బ్లాక్‌ ఫంగస్‌:
బ్లాక్‌ ఫంగస్‌ కు వాడే ఇంజక్షన్లకు చాలా కొరత ఉంది. దేశవ్యాప్తంగా వీటి కొరత ఉంది.
ఒక్కో రోగికి వారానికి కనీసం 50 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి మనకు 3 వేల ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయి. మరో 2వేల ఇంజక్షన్లు వస్తాయని చెబుతున్నారు.
ఇవన్నీ కూడా సరిపోని పరిస్థితి. అందుకే కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. వీలైనంత మేర ఇంజక్షన్లు తెప్పించడానికి గట్టిగా కృషి చేస్తున్నాం. అందువల్ల ఉన్న ఇంజక్షన్లను జాగ్రత్తగా వినియోగించడంపై దృష్టి పెట్టాలి.

కర్ఫ్యూ అమలు:
కోవిడ్‌ విస్తరణను అడ్డుకోవడానికి కర్ఫ్యూ విధించాం. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వెసులుబాటు ఇచ్చాం. ఆ సమయంలో కూడా 144 సెక్షన ఉందనే విషయాన్ని మరిచిపోవద్దు. అందుకే అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు. వ్యాక్సిన్‌ ఒక్కటే దీనికి పరిష్కారం. మాస్క్‌లు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్‌ చేసుకోవడం.. ఇవన్నీ పాటించాలి.
మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత కచ్చితంగా కర్ఫ్యూ పాటించాలి. జిల్లాలలో 12 దాటిన తర్వాత కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయాలి. లేకపోతే ఎస్పీలు, కలెక్టర్లు విఫలమైనట్టుగా భావించాల్సి వస్తుంది.

కోవిడ్‌ వాక్సిన్లు:
ఇప్పటివరకూ 23,69,164 మందికి రెండు డోసులు వ్యాక్సిన్లు ఇచ్చాం. ఇంకా 33,11,697 మందికి ఒక డోసు ఇచ్చాం. వ్యాక్సిన్‌ పరిస్థితులు ఏంటో చాలా సార్లు చెప్పాం.
దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. 18 ఏళ్లకు పైబడ్డ వారికి 172 కోట్ల డోసులు దేశానికి అవసరం. మనకు 7 కోట్ల డోసులు కావాలి. వ్యాక్సిన్ల విషయంలో మెరుగైన పరిస్థితిలోకి రావాలంటే.. ఉత్పత్తి సామర్థ్యంపెరగాలి.
కేంద్రం కోటా ప్రకారమే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇవి వాస్తవ పరిస్థితులు.
45 ఏళ్లకు పైబడ్డ వారికి పూర్తిగా వ్యాక్సిన్‌ అయిపోయిన తర్వాత మిగిలిన వారికి వ్యాక్సినేషన్‌. ఈ వయస్సు వారిపై కోవిడ్‌ ప్రభావం చాలా ఎక్కవు కాబట్టి.. ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి డోస్‌ వేసుకుని రెండో డోస్‌ కోసం వేచి చూస్తున్న వారికి ప్రాధాన్యత.
వ్యాక్సిన్‌ విషయంలో అందరికీ ఒకటే నియమం, నిబంధన. నా దగ్గర నుంచి మీ దగ్గర వరకూ ఒకటే నిబంధన. వ్యాక్సిన్‌ విషయంలో సిఫార్సులకు తావులేదు.

సంయమనం పాటించండి:
ఉద్యోగులు సరిగ్గా పని చేయడం లేదని ఒకరిద్దరు అధికారులు నిగ్రహాన్ని కోల్పోవడం, చర్యలకు దిగడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడితో పని చేస్తున్నారనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. తిట్టి పని చేయించుకోవడం వల్ల లాభం లేదు. ఎవరైనా పొరపాట్లు చేస్తే వారి పట్ల కాస్త సానుకూలంగా ఉండి నచ్చ చెప్పి పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అసాధారణ పరిస్థితుల్లో పని చేస్తున్నాం, మన ప్రవర్తనలో కూడా కాస్త సున్నితత్వం ఉండాల్సిన అవసరం ఉంది.
ఒకటి రెండు ఘటనలు జరుగుతాయి, జరక్కుండా ఉండవు. కానీ అవి జరిగినప్పుడు వాటిని సానుకూలంగా చూసి, వారికి నచ్చజెప్పి పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది.

2). ఉపాధి హామీ పనులు (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌):
కోవిడ్‌తో సహ జీవనం తప్పదు. అదే సమయంలో అన్ని కార్యక్రమాలు యథావిథిగా జరగాలి.

లేబర్‌ బడ్జెట్‌:
కోవిడ్‌ సమయంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు చాలా ముఖ్యం. మనకు ఈ ఏడాది 20 కోట్ల పని దినాలు మనకు మంజూరయ్యాయి.
వచ్చే నెల చివరిలోగా 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలన్నది మన లక్ష్యం.
ఆ లక్ష్యం చేరాలంటే ప్రతి జిల్లా తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలి.
కానీ ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో 7.41 కోట్ల పని దినాల పని మాత్రమే జరిగాయి.
నిజానికి ఈ నెలలో మనం పెట్టుకున్న టార్గెట్‌ 10.46 కోట్ల పని దినాలు.
అందువల్ల జూన్‌ చివరిలోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాల్సి ఉంది.

గ్రామ సచివాలయాల నిర్మాణం:
వచ్చే నెల 30 కల్లా అన్ని గ్రామ సచివాలయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
కానీ మొత్తం 10,929 సచివాలయాల భవనాల్లో పనులు పూర్తైనవిచాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి కలెక్టర్లు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు):
మహానేత వైయస్సార్‌ జయంతి అయిన జూలై 8 నాటికి ఆర్బీకేల నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ చాలా పనులు జరగాల్సి ఉంది.
మొత్తం 10,408 ఆర్బీకే భవనాల నిర్మాణం మొదలు పెడితే, వాటిలో దాదాపు సగం మాత్రమే దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి.
మిగిలిన వాటిలో కొన్ని బేస్‌మెంట్, మరి కొన్ని శ్లాబ్‌ లెవెల్‌లోనే ఉన్నాయి. కాబట్టి వాటిపై కూడా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు (గ్రామీణ):
మొత్తం 8,585 గ్రామీణ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణానికి గానూ, ఇంకా చాలా పూర్తి కావాల్సి ఉంది. వాటిపైనా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ఏఎంసీయూ, బీఎంసీయూ:
బీఎంసీయూలకు సంబంధించి 9,899 భవనాలు కట్టాలని నిర్ణయించగా, ఇంకా 352 చోట్ల పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వలేదు. దాదాపు 38 శాతం భవనాల నిర్మాణాలు ఇంకా మొదలు పెట్టలేదు. కాబట్టి వెంటనే ఆ అనుమతులు ఇవ్వండి. ఆ భవనాల నిర్మాణాలు మొదలు పెట్టండి.
అదే విధంగా ఏఎంసీయూలకు సంబంధించి తొలి దశలో 2,633 భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ వాటిలో 1,946 భవనాల పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. నిజానికి 2,583 భవనాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం జరిగింది.

అంగన్‌వాడీ కేంద్రాలు:
నాడు–నేడు కింద అంగన్‌వాడీలను వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నాము.
ఆ భవనాల నిర్మాణానికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో 1,230 చోట్ల, గ్రామీణ ప్రాంతాల్లో 375 చోట్ల ఆ స్థలాలు గుర్తించాలి. తొలి దశలో అంగన్‌వాడీ నాడు–నేడు కింద 8,634 చోట్ల కొత్త భవనాల నిర్మాణంతో పాటు, మరో 3,341 భవనాల ఆధునీకరణ చేపడుతున్నాం.
ఇంకా పెండింగ్‌లో అసంపూర్తిగా ఉన్న 3,928 అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి చేయాలి.
వెంటనే వాటి అంచనాలు పూర్తి చేసి, సాంకేతికంగా, పరిపాలనాపరంగా కలెక్టర్లు అనుమతులు మంజూరు చేయాలి. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలి.

3). వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌లు:
రాష్ట్రంలో మొత్తం 541 అర్బన్‌ క్లినిక్‌ల అవసరం ఉండగా, వాటిలో ఇప్పటికే ఉన్న వాటిలో 195 భవనాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.
ఇంకా 205 భవనాల రూపురేఖలు మారుస్తుండగా, కొత్తగా 346 భవనాలు నిర్మించాల్సి ఉంది. వాటన్నింటికి సంబంధించి మొత్తం 375 పనులకు అనుమతులు ఇచ్చినా, కేవలం 196 భవనాల పనులు మాత్రమే మొదలయ్యాయి.
కాబట్టి అన్నింటి పనులు టెండర్లు పూర్తి చేసి, వీలైనంత త్వరగా పనులు మొదలయ్యేలా చూడండి.

కొత్త వైద్య కళాశాలలు–స్థలాలు:
రాష్ట్రంలో కొత్తగా 16 బోధనాస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం.
వాటిలో ఇప్పటికే పులివెందుల, పాడేరు ఆస్పత్రులకు భూమి పూజ చేయడం జరిగింది.
కాబట్టి మిగిలిన 14 టీచింగ్‌ ఆస్పత్రులకు ఈనెల 30న ఒకేసారి శిలాఫలకాలు ఆవిష్కరించబోతున్నాము. ఆ మేరకు ఎక్కడెక్కడ ఏమేం చేయాలో వాటిని వెంటనే పూర్తి చేయండి.

4). గృహ నిర్మాణం, 90 రోజుల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు:
మొత్తం 28,81,962 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా అన్నింటినీ ఇవ్వడం జరిగింది. ఇంకా కోర్టు కేసులు ఉన్న 3,77,122 ఇళ్ల స్థలాల సమస్యను కూడా పరిష్కరించాల్సి ఉంది.

90 రోజుల్లో ఇళ్ల స్థలాలు:
ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా 1,53,852 అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగింది.ఇంకా 40,990 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో కూడా అర్హులను గుర్తించండి.ఇప్పటికే గుర్తించిన అర్హులకు వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంపై దృష్టి పెట్టండి.వారిలో 17,945 మందిని ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో, మరో 2,964 మందికి కొత్త లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుంది.
ఇక మిగిలిన 1,32,943 మందికి సంబంధించి భూసేకరణ జరగాలి. వెంటనే దీనిపై దృష్టి పెట్టి, వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చొరవ చూపండి.

ఇళ్ల నిర్మాణం:
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా, తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు మంజూరు చేశాం.వాటిలో పట్టణ ప్రాంతాల్లో 15.10 లక్షల ఇళ్లుండగా, మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. తొలి విడత ఇళ్లలో 14.89 లక్షల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరు పత్రాలు జారీ చేశాం.

టిడ్కో ఇళ్లు:
రాష్ట్రంలో 2,62,216 టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుండగా, వాటిలో 2,14,450 ఇళ్లకు సేల్‌ అగ్రిమెంట్ల పంపిణీ జరిగింది.ఇంకా 47,766 ఇళ్లకు సంబంధించి సేల్‌ అగ్రిమెంట్‌ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. వాటిలో అనర్హులకు కేటాయించిన ఇళ్లతో పాటు, సాఫ్ట్‌వేర్‌ సమస్యల వల్ల నిల్చిపోయిన ఇళ్లు ఉన్నాయి. కలెక్టర్లు చొరవ చూపి వీలైనంత త్వరగా వాటన్నింటిని పరిష్కరించాలి.

జూన్‌ 1న ఇళ్ల నిర్మాణం మొదలు:
ఎట్టి పరిస్థితులలోనూ ఇళ్ల నిర్మాణం జూన్‌ 1న ప్రారంభం అవుతుంది. ఆ ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక పురోగతి (బూస్టప్‌) మాత్రమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి.
స్టీల్, సిమెంట్‌ వినియోగం పెరుగుతుంది. మరోవైపు ఉపాధి దొరుకుతుంది. వీటన్నింటి వల్ల ఎకానమీ బూస్టప్‌ అవుతుంది.

ప్రిపరేటరీ వర్క్స్‌:
మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌజింగ్‌ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డుల మ్యాపింగ్‌ వంటివి చాలా చోట్ల పూర్తి కావాల్సి ఉంది.
వచ్చే స్పందన కార్యక్రమం నాటికి అవన్నీ పూర్తి చేయాలి. ఆ మేరకు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.

లేఅవుట్ల అభివృద్ధి:
ఎక్కడ ఇళ్ల నిర్మాణం చేయాలన్నా, నీటి వసతి తప్పనిసరి. ఎందుకంటే నీరు లేకపోతే అసలు ఇళ్లు కట్టడం సాధ్యం కాదు. కాబట్టి అన్ని లేఅవుట్లలో నీటి కనెక్షన్లు ఉండేలా చూడండి. తొలిదశలో 9,024 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం తలపెట్టగా, వాటిలో 8,798 లేఅవుట్లలో నీటి సదుపాయం కల్పించాల్సి ఉంది. డిస్కమ్‌లు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలతో కోఆర్డినేట్‌ చేసుకుని, వెంటనే నీటి సదుపాయం కల్పించాలి. ఆ పనులన్నీ ఈనెల 31లోగా పూర్తి చేయాలి. కలెక్టర్లు క్రమం తప్పకుండా ఆర్‌డబ్ల్యూఎస్, రెవెన్యూ, డిస్కమ్‌ అధికారులతో సమీక్షించాలి. ఇప్పటికే పొజెషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన 3.84 లక్షల ఇళ్ల నిర్మాణాలు వెంటనే మొదలు పెట్టొచ్చు.

మోడల్‌ హౌజ్‌లు:
ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా మోడల్‌ హౌజ్‌ నిర్మించాలి.
తొలిదశలో 9,024 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం మొదలు పెడుతున్నా, ఇప్పటి వరకు కేవలం 5,148 లేఅవుట్లలో మాత్రమే మోడల్‌ హౌజ్‌లు కట్టారు. కాబట్టి మిగిలిన వాటిలో కూడా వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి. అప్పుడే మనకు నిర్మాణ వ్యయం కూడా తెలుస్తుంది.

ప్రాజెక్టు నివేదిక:
అన్ని లేఅవుట్లలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్‌ కేబుళ్లు, నీటి సరఫరా వ్యవస్థ, ఫైబర్‌ కేబుళ్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టి పనులు చేయాలి. ఆ మేరకు అన్నింటిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలను వచ్చే నెల 20 కల్లా సిద్ధం చేసి, పంపాలి. ఇక జూన్‌ 1న పనులు మొదలవుతాయి కాబట్టి, అవసరమైన ఇసుక అందుబాటులో ఉండేలా చూడండి. అప్పుడే నిరాటంకంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది.

మధ్యతరగతి వర్గాలకు (ఎంఐజీ) ఇళ్ల స్థలాలు:
పట్టణాలలోని మధ్య తరగతి వర్గాల ప్రజలకు తొలి దశలో 3 లక్షల ఇళ్ల స్థలాలను వచ్చే ఏడాది ఉగాది రోజున (ఏప్రిల్‌ 2న) ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
వివాదాలు లేని ప్లాట్లు రిజిస్ట్రేషన్‌. అందుకు 17 వేల ఎకరాల భూమి కావాలి. ప్రభుత్వ, ప్రైవేటు భూముల సేకరణ. మూడు కేటగిరీలు 133.33 గజాలు, 146.66 గజాలు, 194.44 గజాలలో ప్లాట్లు అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా అర్హులకు ప్లాట్లు.   వాటిలో అన్ని మౌలిక సదుపాయాలు. భూగర్భ కేబుల్, విద్యుత్‌ వ్యవస్థ, వీధి దీపాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, నీటి సరఫరా, వాటర్‌ డ్రెయిన్ల  నిర్మాణం.

5). ఖరీఫ్‌కు సన్నద్ధత:
రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు మొదలవుతుంది. గ్రామాల్లో రైతులకు అండగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇచ్చే విత్తనం మొదలు, ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఉండాలి. అది ఓ రకంగా మనం (ప్రభుత్వం) ఇచ్చే అష్యూరెన్స్‌.
కల్తీ లేని క్వాలిటీ సర్టిఫైడ్‌ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా సరఫరా. ఈ సీజన్‌లో 8.08 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీతో రైతులకు ఇవ్వాలని నిర్ణయం. దాంట్లో ఇప్పటి వరకు 1.35 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. జూన్‌ 17 నాటికి వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తి కావాలి.

వ్యవసాయ సలహా కమిటీలు:
అన్ని ఆర్బీకేల పరిధిలో వ్యవసాయ సలహా కమిటీలు ఏర్పాటు కావాలి. ఇప్పటి వరకు 10,498 ఆర్బీకేలకు సంబంధించి, 8,650 మాత్రమే ఆ కమిటీలు సమావేశమయ్యాయి.
కాబట్టి మిగిలిన చోట్ల కూడా ఆ కమిటీలు చురుగ్గా పని చేయాలి. ఆ కమిటీలు రైతులకు క్రాప్‌ ప్లానింగ్‌ ఇవ్వాలి.

కలెక్టర్లకు సూచనలు:
ఈ ఖరీఫ్‌లో 20.2 లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉంటుందని అంచనా. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి. వీటిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలి: ప్రతి జిల్లాలో కలెక్టర్లు నీటి పారుదల సలహా బోర్డుల సమావేశాలు నిర్వహించాలి. జిల్లా ఇంఛార్జ్‌ మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆ పని చేయాలి. జాయింట్‌ కలెక్టర్లు తరుచూ పర్యటించాలి. ఈ–క్రాపింగ్‌ ఎలా జరుగుతుందన్నది సమీక్షించాలి. ఎందుకంటే రైతుకు ఏ మేలు చేయాలన్నా ఈ–క్రాపింగ్‌ తప్పనిసరి.

రూ.1.45 లక్షల కోట్ల రుణాలు:
అదే విధంగా జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కూడా కలెక్టర్లు ఏర్పాటు చేయాలి.
అప్పుడే పంటల రుణాల పంపిణీ పక్కాగా ఉంటుంది.ఈ ఏడాది ఖరీఫ్, రబీకి సంబంధించి పంట రుణాలు, ఇతర రుణాలన్నీ కలిపి మొత్తం రూ.1,44,927 కోట్లు రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం. అదే విధంగా కౌలు రైతులకు కూడా ఈ ఖరీఫ్‌లో పంటల సాగు హక్కుల కార్డు (సీసీఆర్‌సీ)లు ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు జరగాలి. ఆర్బీకేల ద్వారా తమకు న్యాయం జరగలేదని ఒక్క రైతు కూడా చెప్పొద్దు. కాబట్టి కలెక్టర్లు ప్రతి రోజూ ఆర్బీకేలపై దృష్టి పెట్టండి.

రైతు సంతోషంగా ఉంటేనే..:
రైతు సంతోషంగా ఉంటేనే, ప్రభుత్వం బాగా పని చేస్తుందనిఅర్ధం.
రైతులు, వ్యవసాయాన్ని మనం బాగా చూసుకుంటే, దాదాపు 62 శాతం ప్రజలకు మేలు చేసిన వాళ్లమవుతాము. ఈ విషయం గుర్తుంచుకోండి

ఆక్వా గిట్టుబాటు ధరలు తగ్గొద్దు:
ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించడం జరిగింది. మార్కెట్‌లో అంతకన్నా ధరలు తగ్గితే, కలెక్టర్లు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఏ వ్యాపారి రైతులను మోసం చేసే పరిస్థితి రావొద్దు. వారి పంటలకు కచ్చితంగా గిట్టుబాటు ధర రావాలి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కచ్చితంగా రైతులకు దక్కాలి. రైతులు నష్టపోకుండా కలెక్టర్లు చొరవ చూపాలి.

6). ఈనెల, వచ్చే నెలలో అమలు చేయనున్న పథకాలు, కార్యక్రమాలు:
ఈనెల 31న పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్‌ పాల సేకరణ మొదలు కానుంది. జూన్‌ 8న జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం). జూన్‌ 15న వైయస్సార్‌ వాహనమిత్ర. జూన్‌ 22న వైయస్సార్‌ చేయూత (45 ఏళ్లకు పైబడిన మహిళలకు సాయం).
ఈ పథకాల లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. వాటిపై సోషల్‌ ఆడిటింగ్‌ జరగాలి. అర్హులైన ఏ ఒక్కరికి కూడా పథకం మిస్‌ కాకూడదు. కాబట్టి కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి. అంటూ సీఎం  వైయస్‌ జగన్, స్పందన సమీక్ష ముగించారు.

ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ)ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, చీఫ్‌ కమిషనర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య,   పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌ ఎండీ నారాయణ భరత్ గుప్తా,  పలువురు అధికారులు ఈ సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.