పది, ఇంటర్ పరీక్షల రద్దులో జోక్యం చేసుకోండి

318
–  అమిత్‌షాకు లోకేష్ లేఖ
కరోనా సంక్షోభంలో విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో పది, ఇంటర్ పరీక్షల వాయిదాపై జోక్యం చేసుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కోరారు. ఆ మేరకు ఆయన అమిత్‌షాకు లేఖ రాశారు. లోకేష్ లేఖ సారాంశం ఇదీ.. దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్‌ఇ, సిబిఎస్‌ఇ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయి.ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలు ఉన్నాయి. జూన్ 7 నుంచి వేలాది పరీక్షా కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 5 లక్షలకు పైగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు తమ పరీక్షల పట్ల అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ రెండు తరగతుల  విద్యార్థులు ఎంతో  మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చిన విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేరు. అనవసరంగా మరింత మందిని కరోనా రెండో దశ ఉధృతికి పరీక్షల వంకతో ఫణంగా పెట్టడం తగదు. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి పరీక్షలు వద్దని అభ్యర్థనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది.పరీక్షల నిర్వహణ తో విద్యార్థులను సూపర్‌స్ప్రెడర్ లుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.
ఆన్లైన్ ద్వారా నేను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన దశల వారీ సమావేశాలు, అభిప్రాయ సేకరణలో పరీక్షల రద్దుకు 5లక్షల మందికి పైగా మద్దతు పలికారు. పది, ఇంటర్  పరీక్షల విషయం లో సిబిఎస్ఇ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోమని కోరుతున్నా.గత నెలలో ఏపీలో 20శాతం కంటే ఎక్కువగా కరోనా పాజిటివ్ రేటు నమోదవుతుంటే పరీక్షలు నిర్వహణ తగదు. విద్యార్థులు,ఉపాధ్యాయులను బాధించేలా 3వ దశ ఉధృతి హెచ్చరికలు ఉన్నాయి. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ఆందోళనలను  గమనించి విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలి.