మొండి పట్టు వీడి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

379

మే 26 నకు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు ఉద్యమం ప్రారంభంఅయ్యి ఆరు నెలలు పూర్తి అవుతాయి. రబీ గోధుమ పంట పనులను ముగించుకొని వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమ శిబిరాల వద్దకు చేరుకొంటున్నారు.కోవిడ్ రెండవ వేవ్ చాల తీవ్రంగా ప్రజలను నష్టపరుస్తూంది.ఇప్పటికే కోవిడ్ మరణాలు సంఖ్య మూడు లక్షలు దాటి పోయింది.

ఇట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసి,స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు సి2+50% చట్టబద్ధ యం.యస్.పి అమలు చేస్తామని ప్రకటించి రైతులు ఉద్యమాన్ని నిర్మించి వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళి పరిస్థితులను కేంద్రం కల్పించాలి. సుప్రీంకోర్టు మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలిపి వేసివుంది. కావున భేషజానికి పోకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో,రైతు సంఘాలతో చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా వుంది. స్వామినాథన్ కమీషన్ సూచనలు ప్రకారం కనీస మద్దతు ధర సి2+50% నిర్ణయం చేయనిదే ప్రధాని నరేంద్ర మోడి 2022నాటికి రైతుల వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న  హామీ వాస్తవ రూపం దాల్చదు.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు నిరసనలు తెలియజేస్తున్నా ,విదేశాల్లో ఉన్న భారతీయులు కోరుతున్శా మోడి ఏమాత్రం పట్టించుకోలేదు. కోవిడ్ కట్టడికి సకాలంలో తగు చర్యలు చేపట్టకుండా పశ్చిమ బెంగాల్ ఎన్నికల పైనే దృష్టి నంతాపెట్టి ఏనాడు చరిత్ర లో లేని విధంగా ఎనిమిది విడతలుగా బెంగాల్ లో ఎన్నికలు జరిపించి సర్వశక్తులు ఒడ్డినా చివరకు ఘోర పరాజయం పాలవ్వక తప్పలేదు. యు.పి స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి ఓటమిపాలయ్యింది.రైతాంగంలో ,గ్రామీణ ప్రజానీకంలో ఆదరణ కోల్పోయిన వాస్తవంను అర్దం చేసుకొని ఇటీవల పెంచిన డి.ఎ.పి ధరను ఉపసంహరించింది.

ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్ష లను పట్టించుకోకపోవడం ఎంతమాత్రం మంచిది కాదు. తగు సమయం వచ్చినప్పుడు రైతులు మరియు ప్రజలు మోడికి గుణపాఠం నేర్పుతారు.26న దేశవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు తెలియపర్చాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపును ఇచ్చింది. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించింది.

కావున యిక ఎంతమాత్రం జాప్యం చేయకుండా రైతుల డిమాండ్ లను అంగీకరించాలని ,చర్చలు ప్రారంభించాలని  సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తూ వుంది.

– వడ్డే శోభనాద్రీశ్వర రావు
(కన్వీనర్,ఎ.పి.రైతు సంఘాల సమన్వయ సమితి)