టీడీపీ నేత,మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టు

218

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.  ఆయనతో పాటు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అర్థరాత్రి బీసీ జనార్దన్ రెడ్డిని, ఆయన అనుచరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. వారిని ఈ రోజు సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బనగానపల్లె కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి,ఆయన వర్గీయులు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేశారనే ఆరోపణపై పోలీసులు ఆ అరెస్టు చేశారు. రాత్రి 2 గంటల సమయంలో పోలీసులు బీసీ జనార్దన్ రెడ్డిని నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో బీసీ జనార్దన్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆయన అనుచరులు పోలీసు వాహనాలను స్టేషన్ వరకు అనుసరించారు. తొలుత కాటసాని రామిరెడ్డి అనుచరులు బీసీ జనార్దన్ రెడ్డి నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు పైపులతో కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.తమ అనుచరులను కాటసాని రామిరెడ్డి అనుచరులు ఇంటి వద్దకు వచ్చి రెచ్చగొట్టారని బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే, బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు అందరూ చూస్తుండగానే పైపులతో తమపై దాడి చేశారని కాటసాని రామిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.