వైకాపా నాయకులకు కళ్లు నెత్తికెక్కాయా

290

పదవీయోగంతో ప్రజలకు మంచి చేయాలని అంతేకాని కళ్లు నెత్తికెక్కి పెద్దమనుషులను అవమానించరాదని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడుపై భాజపా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ను చూసి మిడిసిపడవద్దని, ఆయనకు బెయిల్ రద్దుయితే మీ పార్టీ భవిష్యత్తు…మీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. భాజపా రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ రాజకీయ జీవితం గురించి ప్రశ్నించే నైతిక హక్కు.. మీకు లేదని ధ్వజమెత్తారు. అధికారం రాజకీయం శాశ్వతం కాదని హెచ్చరించారు. ఆస్తులు కాపాడుకునేందుకు కన్నా ఇంటి అరుగుల మీద కూర్చున్న రోజులు మనోహర్ మర్చిపోయారని… మేయర్గా అవకాశం ఇచ్చిన మీ నాన్నను అడిగితే ఆ విషయాలు తెలుస్తాయని ఘాటుగా స్పందించారు. మత విద్వేషాలు ఎవరు రెచ్చ గొడుతున్నారో ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల పై వరసగా జరిగిన దాడులు… ప్రజలు మర్చిపోలేదన్నారు. దేవాలయాలను కూల్చివేస్తే, తెదేపాకు ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుందన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వైద్యం సక్రమంగా అందడం లేదని విమర్శించారు. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి మరణాలను… ప్రభుత్వ హత్యలగా ఆయన అభివర్ణించారు. కోవిడ్ వైద్యాన్ని… రాష్ట్రప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని ఆరోపించారు. కరోనా బాధితులు ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.