గుడివాడ డివిజన్లో 24 కేంద్రాల ద్వారా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

204

– 15 వేల 660 మందికి కొవాగ్జిన్ మొదటి డోస్
– 14 వేల 114 మందికి కొవిషీల్డ్ రెండవ డోస్
– మెరుగైన శానిటేషన్ కోసం 40 మంది నియామకం
– ఆక్సిజన్ కొరత, సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు
– కర్ఫ్యూను సమర్ధవంతంగా అమలు చేస్తున్నాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, మే 24: గుడివాడ డివిజన్లో 24 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గుడివాడ డివిజన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రం పనితీరు, మెరుగైన శానిటేషన్, కర్ఫ్యూ అమలు తదితరాలపై సోమవారం మంత్రి కొడాలి నాని సమీక్షించారు.

      గుడివాడ డివిజన్ లో ఇప్పటి వరకు 15 వేల 560 మందికి కొవాగ్జిన్ మొదటి డోస్ ను, 351 మందికి రెండవ డోస్ వేయడం జరిగిందన్నారు. అలాగే 31 వేల 405 మందికి కొవిషీల్డ్ మొదటి డోసు, 14 వేల 114 మందికి రెండవ డోసు వేశామన్నారు. ప్రస్తుతం మూడు రోజుల పాటు కొవిషీల్డ్ ఫస్ట్ డోసును వేయడం జరుగుతుందన్నారు. 45 ఏళ్ళు నిండి ప్రజలతో నిత్యం సంబంధాలు కల్గిన రైల్వే, ఆర్టీసీ, బ్యాంక్ ఉద్యోగులకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గత మూడు రోజుల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని చెప్పారు. గుడివాడ పట్టణంలో శానిటేషన్ ను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు అదనంగా మరో 40 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించామన్నారు. వారానికి రెండు రోజుల పాటు బ్లీచింగ్, సున్నం చల్లుతున్నామన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నామన్నారు.
వార్డుల్లోని అంతర్గత రోడ్లపై కూడా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేసేందుకు రెండు ట్రాక్టర్లను ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతంలో కూడా హైపోక్లోరైడ్ స్ప్రే చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ ను చల్లుతున్నామన్నారు. గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రం ద్వారా మెరుగైన వైద్య సేవలందేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం 30 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశామని, ఒకట్రెండు రోజుల్లో మరో 20 బెడ్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇద్దరు వైద్యులున్న పీ.హెచ్.సీల నుండి ఒక వైద్యుడిని గుడివాడ కోవిడ్ కేంద్రానికి డిప్యుటేషన్ పై పంపాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారులకు సూచించామన్నారు. ఆక్సిజన్ కొరత, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. కోవిడ్ కేంద్రంలో పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని, రాత్రివేళల్లో పోలీస్ సెక్యూరిటీని కూడా పెంచామన్నారు.
తుఫాన్ కారణంగా ఆక్సిజన్ సిలిండర్లకు ఎటువంటి అంతరాయం లేకుండా చూస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు పొడిగించిన కర్ఫ్యూను గుడివాడ పట్టణంలో పటిష్టంగా అమలయ్యేలా చూస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూను సడలించామన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉందని, కర్ఫ్యూ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ప్రజలంతా పాటించి సహకరించాలని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.