పక్షులకు మాస్క్‌ల బంధనాలు!

215

పర్యావరణానికి ప్రమాదంగా వాడేసిన మాస్క్‌లు

కరోనా వైరస్‌ నుంచి రక్షణకవచంగా నిలుస్తున్న మాస్క్‌లను ఇష్టారీతిగా పడేయడం పశు పక్ష్యాదులకు ప్రమాదకరంగా మారుతున్నది. పర్యావరణానికి చేటుచేస్తున్నది. కొవిడ్‌ కారణంగా గతేడాది మార్చి నుంచి రకరకాల ఫేసియల్‌ మాస్క్‌లను ధరిస్తున్నారు. భారత్‌లో 44 శాతం మంది ప్రజలు మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. గత రెండు నెలలుగా ఈ సంఖ్య మరింతగా పెరిగింది. కానీ, మాస్క్‌ వాడినవారు వాటిని విచక్షణారహితంగా ఎక్కడపడితే అక్కడ పారవేయడం వల్ల మూగజీవులు, పక్షులకు ప్రమాదకరంగా మారుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మాస్క్‌లు కాళ్లకు చిక్కుకుని పక్షులు విలవిలలాడుతున్నాయి. కొన్ని జంతువుల శరీరంలోకి కూడా వెళుతున్నాయి. చెరువులు, కుంటల్లో పారవేయడం వల్ల చేపలు మృత్యువాత పడుతున్నట్టు యాష్‌లీ ఫ్రూనోఆఫ్‌ యానిమల్‌ రైట్స్‌గ్రూప్‌ వెల్లడించింది. కొన్నిచోట్ల జంతువులు కరోనా వైరస్‌బారిన పడడానికి కారణం కూడా అవుతుదన్నదని విశ్లేషించింది. పద్ధతి లేకుండా ప్రకృతిలో విసిరేసిన మాస్క్‌లు పక్షులకు ఉరితాడుగా పరిణమిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ బోర్డు సభ్యులు, గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధి రాఘవేంద్ర ఆందోళన వ్యక్తంచేశారు. మాస్క్‌లను పారవేసేటప్పుడు వాటి నాడాలను తొలగించాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ తరపున ఈ విషయంలో విస్తృత ప్రచారం కల్పిస్తామని తెలిపారు.

                               –  రాఘవ్,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో వ్యవస్థాపకుడు