ముంబైలో డ్రగ్స్ కలకలం..

146

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో మరోసారి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి.  మహానగరంలోని బాంద్రాలో రూ.1.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో 75 ఏళ్ల మహిళ సహ.. మరో వ్యక్తిని అరెస్టు చేశారు. కాగా.. సదరు మహిళను జోహ్రబాయ్‌ షేక్‌గా గుర్తించారు. మాదకద్రవ్యాలను విక్రయించేందుకు ఓ వ్యక్తి శనివారం బాంద్రాలోని వాటర్‌ ఫీల్డ్‌ రోడ్‌కు వచ్చే అవకాశం ఉందని ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌కు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై రెక్కి నిర్వహించారు.అనంతరం కిశోర్‌ గావ్లి (57) అనే వ్యక్తిని వలవేసి పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. జోహ్రబాయ్‌ షేక్‌ తనకు చరాస్‌ను విక్రయించిందని వెల్లడించాడు. దీంతో పోలీసులు బాంద్రాలోని ఆమె నివాసంపై దాడులు చేసి మూడు కిలోల చరాస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు చాలా రోజులుగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు క్రైం బ్రాంచ్ అధికారులు పేర్కొంటున్నారు. వారి వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. జొహ్రబాయి, కిశోర్ గావ్లిపై చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.