ఒక ఆనందయ్య… వంద ప్రశ్నలు!

905

( మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

అనగనగా ఒక కృష్ణపట్నం. అందులో ఆనందయ్య యాదవ్ అనే ఆయుర్వేద వైద్యుడు. పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీకి సర్పంచిగా చేసి, తర్వాత లోకల్ లీడర్లతో పడక వైసీపీలో చేరాడు. చేరినా పెద్ద యాక్టివ్ కాదు. ఆయన పనేదో ఆయనది.  చెన్నైలో ఆయనకు  ఓ గురువు. ఆయన వద్ద శిష్యరికం చేసి వనమూలికలతో రోగాలెలా తగ్గించాలో నేర్చుకున్నాడు. కానీ ఎవరి వద్దా పైసలు తీసుకోడు. అంటే కన్సల్టెంటు ఫీజు, మెడికల్‌షాపు, ఎక్స్‌రే, ఈసీజీ దుకాణాల్లో పర్సంటేజీ గట్రాలేమీ తీసుకునే బాపతు కాదన్నమాట. అదొక చాదస్తం! అలాంటి ఆనందయ్యయాదవ్‌కు, కరోనా రోగులకు ఉచితంగా మందు ఇవ్వాలన్న ఆలోచన బ్రహ్మముహుర్తంలో వచ్చింది. అలా వచ్చిందే తడవుగా సరకూ, సరంజామా కూడగట్టుకుని, సొంతూరులోనే అందరికీ ఉచితంగా మందు ఇచ్చాడు. వారికెవరికీ ఇప్పడు కరోనా లేదు. పైగా మాస్కుల వంటి చాదస్తాలు వారి దరి చేరలేదు. అందుకే కృష్ణపట్నపోళ్లంటే మిగిలినోళ్లకు బోలెండ ఈర్ష్య. సరే మన ఆనందయ్య ఇస్తున్న మందు గురించి సోషల్‌మీడియాలో పొగ వచ్చింది. ఇంకేం? లక్షలు పోసి ఒళ్లు, ఇళ్లు గుల్లచేసుకుంటున్న రోగులంతా పోలోమని  కృష్ణపట్నం బయలుదేరారు. ఎర్రయాగాణీ తీసుకోకుండా, వచ్చినవారిని కాదనకుండా ఆ పిచ్చి ఆనందయ్య మందులిస్తున్నాడు. ఆయనకు అదో తుత్తి! ఆ దెబ్బతో చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రుల బెడ్లన్నీ ఖాళీ. రోగులంతా పోలోమని అంబులెన్సులేసుకుని ఆనందయ్య సన్నిధికి చేరారు. ఇదంతా రాష్ట్రం దాటి దేశానికి పాకింది. మరి కరోనా ట్రీట్‌మెంట్ పేరుతో లక్షలు కొల్లగొడుతున్న ప్రైవేటు-కార్పొరేట్ కింకరుల ఒళ్లపై.. తేళ్లూ, జెర్రులు, పాములూ, అనకొండలూ పాకవూ? ఎస్. సరిగ్గా అదే జరిగింది. కథ అక్కడితో ముగియలేదు. అసలు కథ అక్కడినుంచే ఆరంభమయింది. ఆ కథ పేరే అవస్థల ఆనందయ్య! అదేదో చూద్దాం రండి!!

ఇప్పుడు ఆనందయ్య ఉచిత మందుల పంపిణీకి బ్రేక్ పడింది. కారణం.. అసలది శాస్త్రీయమో కాదో తేల్చాలట. దానివల్ల సైడ్ ఎఫెక్టులు వస్తాయో లేదో చూడాలట. అందుకే సర్కారు వారు  ‘ఇదిగో అబ్బీ.. అసలు నీ మందు సంగతి తేల్చేవరకూ నీ దుకాణం కట్టెయ్’ అనడం, పాపం అమాయక యాదవు కూడా నాదగ్గరున్న మందంతా అయిపోయింది. రాగానే మళ్లీ ఇస్తానోచ్ అని మీడియాకు చెప్పకతప్పలేదు. పదిమంది పిల్లలను కన్న సంతానలక్ష్మికి, సంతాన పరీక్షలు చేసినట్లు.. ‘అసలు ఆ మందు ఎలా తయారు చేస్తావో ముందు మాకు చూపించవోయ్ ఆనందూ’ అని పెద్దాసుపత్రి సూపర్నెంట్ టెస్టు చేస్తారట. మరి ఆయనతోపాటు జిల్లా అధికారులు సంతృప్తి చెందితే సరిపోదట. ఆయుష్ కమిషనరూ రంగప్రవేశం చేశారు. యాదవ్ తయారుచేసిన మందు వల్ల సైడ్‌ఎఫెక్టులేవీ లేవని, కాకపోతే ఆయనది ఆయుర్వేదం కాదని సెలవిచ్చారు. దానిసంగతి తేల్చడానికి బెజవాడ-తిరుపతి నుంచి మరికొందరు అపర ధన్వంతరులొస్తారట. ‘ఐసీఎంఆర్ అనే పెద్ద ముత్తయిదువ’ కూడా పరీక్ష చేయాలట. మరి వీళ్లంతా శభాషులన్న తర్వాత కూడా… వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ధన్వంతరి మూలపుటమ్మ కూడా రంగప్రవేశం చేస్తుందో తెలియదు మరి. ఇన్ని ఆపసోపాలు పడేబదులు.. కరోనా వైరస్‌ను వదిలిన ఆ చైనా వాడినే పిలిచి.. ఏమోయ్.. నువ్వు సరదాగా మాపై వదిలిన వైరస్‌కు- మా ఆనందు తయారుచేసిన విరుగుడు ఇదేనా? కాదా?  అని అడిగితే సరి!

వెనకటికి ఇలాగే ఊళ్లోకి వరదలొస్తే గవర్నమెంటు గజ ఈతగాళ్లకోసం తెగ వెతుకుతుంది. ఎంత వెతికినా గజ సంగతి తర్వాత.. అసలు ఈత తెలిసిన వాళ్లెవరూ కనిపించడం లేదు. ఆలోగా ఈత బాగా తెలిసిన ఆనందయ్య అమాయకంగా నీళ్లలోకి దిగి, జనాలను కాపాడేపనిలో ఉంటాడు. మనవాడి ఉత్సాహం, చిత్తశుద్ది చూసి అనుమానం వచ్చిన గవర్నమెంటు.. ఏమోయ్ ఆనందూ. ఇంత ఇదిగా ఈత కొడుతున్నావ్. ఏ ఈత ఇనిస్టిట్యూట్‌లో చదువుకున్నావేంటి? నీ స్టైల్ చూస్తుంటే ఎక్కడా చదివినట్లు కనిపించడం లేదు. తక్షణం ఆ సరిఫికెట్టు చూపించకపోతే నిన్ను ఈతకు దిగనివ్వం. ఏమనుకున్నావో.. హమ్మా.. అంతా నీ ఇష్టమే! ఈత వచ్చినంత మాత్రాన సర్టిఫికెట్టూ గట్రాలూ లేకపోతే, మేమెలా ఒప్పుకుంటామనుకుంటున్నావ్? అంత కొండ వెర్రిపప్పుల్లా కనిపిస్తున్నామా?  గవర్నమెంటుకు కొన్ని లెక్కలుంటాయమ్మా ఆనందూ.. అని క్లాసు పీకి పంపేశారు. చేసేది లేక పాపం నీళ్లలో పడి కొట్టుకుపోతున్న, తన ఊరివాళ్లను చూసుకుంటూ వెళ్లిపోతాడు ఆ అమాయక ఆనందు.

ఇప్పుడు కృష్ణపట్నంలో జరుగుతున్న పరిణామాలకు ఈ కథ సరిపోతుంది. కరోనా నివారణకు పాలకులు వేల కోట్లు కార్పొరేట్ మెడికల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలకూ కుమ్మరిస్తున్నారు. సరే వాటి కమిషన్ల కథా కమామిషు తర్వాత సంగతి. అసలు అవి లేనిదే మన తాన ఏదీ నడవదు కదా? అసలు కరోనాకు వైద్యమేమిటో ఇప్పటివరకూ ఏ డాక్టరుకూ వంద శాతం తెలియదు. దానిపై అధ్యయనం చేసినా వాడూ లేడు.  తమకు తెలిసిన వైద్యం చేస్తున్నారంతే. ఏం మందులు వాడుతున్నారో రోగి బంధువులకు చెప్పరు. పక్కన ఉండే మెడికల్ షాపులోకి వెళ్లి, అపర ధన్వంతరులు రాసిన మందులు కొని వాళ్ల చేతిలో పెట్టాలన్నమాట. వాటిని వాడతారో లోపలున్న రోగికి తెలియదు. బయట జేబు ఉగ్గబట్టుకునే రోగి బంధువుకూ తెలియదు. అంతా సీక్రెట్టే.  అసలు కరోనా గురించి వైద్యం తెలిస్తే డాక్టర్లే ఎందుకు చనిపోతున్నారని మాత్రం మీడియానో, తెలివున్న వారో అడక్కూడదు. అలా అడిగిన వాడు దేశద్రోహి కింద లెక్క.

ఇదొక్కటే కాదు. ఏదైనా అంతే.. వైద్యులు రోగులను నీకు ఇంకా ఏమున్నాయని అడుగుతారు సహజంగా! దగ్గు, జ్వరం అంటాడు రోగి. అది మేం స్కానింగ్, ఈసీజీ చేసి తెలుసుకుంటాములేవోయ్. ఇంకా నీకు ఏమున్నాయని ప్రశ్నిస్తాడు డాక్టరు. బాగా నీరసంగా ఉంటుంది అంటాడు రోగి. సర్లే.. బ్లడ్‌టెస్టులు చేసి క నుక్కుంటాం లేవోయ్. ఇంకా నీకు ఏమున్నాయ్ అది చెప్పు అంటాడు డాక్టర్ మహాశయుడు. అంటే సదరు డాక్టరు కవిహృదయమేమిటంటే.. నీకు ఎన్ని ఎకరాల పొలం, ఎన్ని సవర్ల బంగారం, ఎన్ని ఇళ్లు ఉన్నాయని అర్ధం. దాన్ని బట్టి ట్రీట్‌మెంట్‌పై ఒక అండర్‌స్టాండిగుకొస్తారన్నమాట. మరి తనకు ‘కార్పొరేట్ వస్తాదులు’ ఇన్సెంటివులు ఇవ్వొద్దూ? ఠాగూర్ సినిమా చూడలేదూ…!

రోడ్డుపై శవాలమీద చిల్లర ఏరుకునే బ్యాచ్ ఉన్నట్లుగానే.. మనుషుల బలహీనతలను ఆసరా చేసుకుని, వారి బతుకులనే కరెన్సీలుగా మార్చి  డబ్బులు ఏరుకునే మెడికల్ మాఫియా ఒకటి, కరోనాను కరెన్సీగా మార్చే ధనయజ్ఞానికి తెరలేపింది. అందులో భాగమే రెమ్డిసివర్ ఇంజక్షన్లు,  ప్లాస్మా ట్రీట్‌మెంట్లు. లేటెస్టుగా బ్లాక్ ఫంగస్ ఒకటి మెడికల్ మాఫియాకు అదనపు వరంగా మారింది. ఇవికాక రకరకాల టీకాలు, మందులూను! ‘కార్పొరేట్ కింకరులు’ ఈపాటికే శవాలపై కరెన్సీ ఏరుకోవడం దాదాపు 50 శాతం పూర్తయింది. చిన్న చిన్న.. ఒకస్థాయి పట్టణాల్లో ఆసుపత్రులు ఈపాటికే రోగుల డబ్బులను నాకేస్తున్నాయి. మిగిలిన యజ్ఞం పూర్తి చేసేలోపే.. ఇదిగో ఈ ఆనందయ్య యాదవ్ ఆయుర్వేద మందు పేరిట శనిలా దాపురించాడు. మరి.. పులి మనిషి రక్తం వాసన మరిగినట్లు, కరెన్సీ కట్టల వాసన రుచి మరిగిన కార్పొరేట్ మెడికల్ మాఫియా ఉత్తిగా ఉంటుందా? తమ ఆదాయానికి సున్నం పెడుతుంటే, ఆనందంగా ఆనందయ్యలను కౌగిలించుకుంటుందా? నల్లిని నలిపినట్లు నలిపేయదూ?!..  ‘కావలసిన వారికి’ కరెన్సీ కట్టలు విసిరేసి కాగల కార్యం కానిచ్చేయదూ?..

అదిగో.. సరిగ్గా అదే జరిగింది. జరుగుతోంది. ఆనందయ్య యజ్ఞానికి విలన్లు వచ్చేశారు అనేక రూపాల్లో!  అబ్బెబ్బె అక్కడ భౌతిక దూరం పాటించడం లేదని ఒకరు. అసలది శాస్త్రీయమే కాదని మరొకరు. దాని సంగతేమిటో తేల్చేదాకా మందులివ్వకూడదని ఇంకొకరు. ఆనందయ్య మందు తిని బ్రహ్మాండంగా ఉందన్న ఓ పంతులుగారు మళ్లీ అడ్డం పడ్డారట. ఇంకేముంది? నిరంతర వార్తా స్రవంతిని వదిలే ఓ పేద్ద టీవీచానెల్ రంగంలోకి దిగింది. చూశారా? ఇవన్నీ మూఢాచారాలని మేం చెబితే విన్నారా?  అని ఓ స్టోరీ వదిలింది. అసలు ఆయుర్వేదానికి పర్మిషన్ ఉందా? అని ఇంకో పనికిమాలిన చర్చ నడిపింది. పాపం ఆ చానెల్‌కు తొలి నుంచీ సమాజం మీద బోలెడంత ప్రేమ కారుతుంటుంది. నిజమే. పర్మిషను కావలసిందే మరి.  గుంటూరు పక్కనే స్వస్థత కూటమి పేరుతో వందల ఎకరాల్లో టెంట్లు వేసి, కేరళ నుంచి కొబ్బరినూనె ట్యాంకర్లు తెప్పించి, దానినే మంత్రించిన నూనె అని చెప్పి, రోగుల మొహం మీద పోసి.. వికలాంగుడికి కూడా కాలు తెప్పించే ఆ నూనెలకు పర్మిషను ఉందా అని అడగాల్సిందే. దర్గాల్లో మంత్రించి ఇచ్చే తావీజులకూ పర్మిషను కావాల్సిందే.  ఓ పదిరూపాయలకు దొరికే జిందాతిలిస్మాత్తుకూ, జండూబాముకూ  ఐసీఎంఆర్, డీజీసీఐ పర్మిషన్లు కావాల్సిందే. హైదరాబాద్‌లో బత్తిన గౌడ్ సాబ్ ఇచ్చే చేపమందుకూ పర్మిషను కావల్సిందే. అంతేగా.. అంతేగా?

మరి ఆనందుడిని అనుమతులు-శాస్త్రీయత పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పాలకులు.. వారికి తెర వెనక ఉండి ఆక్సిజను అందిస్తున్న మెడికల్ మాఫియా.. ఇప్పుడు కరోనాకు చికిత్స చేసేందుకు స్టెరాయిడ్లు, రెమ్డిసివరు, టోస్లీజ్‌మాబ్ వాడకానికి అదే డీజీసీఐ పర్మిషను ఇచ్చిందా? లేదే? అసలు రెమ్డిసివర్‌కు ముందు ఎందుకు అనుమతించినట్లు? తర్వాత ఎందుకు వద్దన్నట్లు? ప్లాస్మాను ఓకేనన్న ఆ నోళ్లే, తర్వాత నాట్ ఓకే అని ఎందుకు చెప్పినట్లు?  మీరు ఇచ్చిన అనుమతులపై మీకే నమ్మకం లేకపోతే, ఇక జనం నమ్మకాన్ని కాదనే హక్కు మీకెక్కడిదని జనం నిలదీస్తే మొహం మడిచి ఎక్కడపెట్టుకుంటారు? అసలు యాంటీ వైరల్ డ్రగ్స్‌ను ఎందుకు అమ్ముతున్నట్లు? డాక్టర్లు ఎందుకు వాటిని వాడుతున్నట్లు? వీటికి ధైర్యంగా జవాబిచ్చే ముఖం ఒక్కటైనా కనిపిస్తుందా? అన్నది ప్రశ్న. అసలు అధ్యయనాలు, ప్రయోగాలే చేయకుండా తాత్కాలిక అవసరం కోసం, తమ జేబు నింపుతున్న మెడికల్ మాఫియా పొట్ట నింపేందుకు చేస్తున్న పాలకుల అవినీతి రోగానికి.. మందు కనిపెట్టే ఆనందయ్యలు ఎప్పుడొస్తారో చూడాలి! అప్పుడే కదా దేశానికి బ్రహ్మానందం!!