ఆయుర్వేదం పనితీరుపై టీటీడీ ఆసక్తి

269
* టీటీడీ పాలకమండలి సభ్యులు చెవిరెడ్డి నేతృత్వంలో..టీటీడీ ఆయుర్వేద నిపుణులు కృష్ణపట్నంలో అధ్యయనం
* ఐసిఎంఆర్ నివేదిక ఆమోదిస్తే.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు..
* రాష్ట్రం, దేశంతో పాటు ప్రపంచానికి ఆయుర్వేద మందును అందించేందుకు టీటీడీ సిద్దం
* టీటీడీ పాలకమండలి సభ్యులు చెవిరెడ్డి స్పష్టీకరణ

నెల్లూరు: కరోనా నియంత్రణలో ఆయుర్వేదం మందు పనితీరుపై టీటీడీ ఆసక్తి కనబరుస్తోంది. ఈ క్రమంలో కరోనాకు ఆయుర్వేద మందు తయారీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంను టీటీడీ పాలకమండలి సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ఆయుర్వేద నిపుణులతో కలిసి శనివారం సందర్శించారు.

♦️కరోనా మందు తయారీ విధానం.. వినియోగించిన సహజ వన మూలికలు.. మందు ఏ విధంగా పనిచేస్తుంది.. అనే అంశాలపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు విచ్చేసిన టీటీడీ ఆయుర్వేద నిపుణులు..
♦️చెవిరెడ్డి నేతృత్వంలో నెల్లూరు విచ్చేసిన ఆయుర్వేద నిపుణుల బృందం ఆనందయ్య  నివాసం, కరోనా మందు తయారు చేసిన ప్రాంతాన్ని, వినియోగించిన సహజ వనమూలికలను పరిశీలించారు. శాంపిల్స్ ను సేకరించారు. ఆనందయ్య కుటుంబ సభ్యులతో చర్చించారు. ఆ గ్రామ ప్రజలతో మందు పనితీరును అడిగి తెలుసుకున్నారు.

♦️అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు..ప్రపంచానికి భారత దేశం అందించిన వైద్యంలలో ఆయుర్వేదం ఒకటి.. ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనాను ఆయుర్వేద మందు నయం చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆయుర్వేద మందు పనితీరుపై యుద్ద ప్రాతిపదికన అధ్యయనం సాగుతోంది.పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తే రాష్ట్రంతో పాటు దేశానికి, ప్రపంచానికి ఆయుర్వేద మందును అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు టీటీడీ సిద్దంగా ఉంటుంది.కరోనా ఆయుర్వేద మందు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరోనా నుంచి కాపాడుతుందన్న నమ్మకం కలిగిస్తున్న నేపథ్యంలో..టీటీడీ పాలకమండలి సభ్యుని హోదాలో కృష్ణ పట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీని పరిశీలించేందుకు వచ్చామన్నారు..టీడీడీ ఆయుర్వేద విభాగంలో సీనియర్ ప్రొఫెసర్లు, సంబంధిత శాస్త్రవేత్తలు విచ్చేశారని అన్నారు. టీటీడీ పరిధిలో అధునాతన ఆయుర్వేద ఫార్మా  ఉందన్నారు.ఈ ఆయుర్వేద మందు నిజంగా ఆమోదయోగ్యమైతే భవిష్యత్తులో ప్రజలకు అందించేందుకు టీటీడీ ముందుంటుందని అన్నారు..  ఐ సి ఎం ఆర్ అధ్యయనం నివేదిక సానుకూలంగా ఉంటే.. రాష్ట్ర ప్రజలకు శ్రీవారి పాదాల చెంత ఆయుర్వేద మందు పంపిణీకి ప్రయత్నం ప్రారంభిస్తామని వెల్లడించారు. ఐసిఎంఆర్ అధ్యయనం నివేదిక వచ్చే లోపు టీటీడీ ఆయుర్వేద నిపుణులు కూడా కరోనా మందు పనితీరును అధ్యయనం చేస్తారని వివరించారు.